‘‘అసలు నిన్ను కాదే, నీ బాబుని అనాలి. కలిసి రైల్లో కొన్ని గంటలు ప్రయాణం చేసిన నేరానికి నాతో పరిచయం పెంచుకొని నిన్ను అంటగట్టాడు. అమ్మమ్మ! ఎంత తెలివిగలవాడే నీ బాబు’’ అన్నాడు రామారావు.వెంటనే అందుకుంది అతని భార్య లక్ష్మి - ‘‘చాల్లే ఊరుకోండి! మా నాన్న తెలివిగలవాడేమిటి? ఏమాత్రం కాస్త తెలివి ఉన్నా బంగారం లాంటి నన్ను, డిగ్రీ పాస్‌ అయిన నన్ను, డిగ్రీ తప్పిన మీకిచ్చి పెళ్ళి చేస్తాడా? అసలు మీ గురించి ఏ వివరాలు తెలుసుకోకుండా అల్లుడ్ని చేసుకుంటాడా’’ అన్నది.స్వరం పెంచాడు రామారావు - ‘‘ఏమిటే! వివరాలు తెలుసుకునేది! ‘ఏమి చదివావు బాబూ’ అని అడిగాడు. ‘డిగ్రీ పూర్తిచెయ్యాలి’ అనే లోపు ‘డిగ్రీనా సంతోషం’ అన్నాడు. ఏ డిపార్టుమెంటు అని అడిగాడు. ‘కరెంటు’ వైరింగ్‌ చేస్తుంటా అనేలోపు ‘కరెంటాఫీసులోనా’ అన్నాడు ఇకిలిస్తూ. 

మీ ఆఫీసు ఎక్కడ అని అడిగాను. ‘సబ్‌స్టేషన్‌’ పక్కన అనేలోపు సబ్‌స్టేషన్‌లోనా అని సకిలించాడు’’ అన్నాడు రామారావు.‘‘అయితే మాత్రం ఎలాగైనా చెప్పవలసిన బాధ్యత మీకు లేదా?’’ అడిగింది లక్ష్మి.వెంటనే రామారావు - ‘‘నన్నసలు నోరు మెదపనిస్తేగా! చెబుదామని అనుకున్నపడల్లా ఏదోఒకరకంగా అడ్డుతగిలి చెప్పనిచ్చేవాడు కాదు’’ అన్నాడు.‘‘అందుకే కదండీ! మా నాన్న పోయేదాకా ఒకరి తల ఒకరు పట్టుకొని ఏడ్చాం’’ అన్నది లకి్క్ష.‘‘చాల్లే ఊరుకో! అసలు నాదొక సందేహం, నిన్ను వదిలించుకోవడానికే మీ నాన్న వివరాలు కూడా తెలుసుకోకుండా ‘దొరికాడు చాల్లే’ అని నాకిచ్చి పెళ్ళి చేశాడు. అయినా నీకేం తక్కువ. ముప్పొద్దులా మెక్కి, టి.వి. సీరియల్స్‌ చూస్తూ హాయిగా కాలం గడుపుతున్నావుగా’’ నసిగాడు రామారావు.‘‘ఆహా! ఏమి భాగ్యం! నగలు నట్రానా! ఇల్లా వాకిలా! ఊర్లో అందరి ఇళ్లకి వైరింగ్‌ చేయడమేగాని సొంతగా ఇల్లు కట్టుకోగలిగారా? ఇపడు ఆ వైరింగ్‌ కూడా మానేసి నామీద ఫైరింగ్‌ చేస్తున్నారు’’ అంది తల పట్టుకొని.విసురుగా లేచాడు రామారావు. ఏమిటే, ఇల్లు వాకిలి అని మాట్లాడుతున్నావ్‌? మీ నాన్న ఇచ్చిన పది ఎకరాలు కూకట్‌పల్లి భూమి అమ్మి కోట్లు గడించి దాచిపెట్టుకొని నేనేదో ఇల్లు కట్టనట్టు మాట్లాడుతున్నావ్‌?’’