‘‘హే బేబ్‌ రెడీగా ఉండు, సాయంత్రం తొందరగా వచ్చేస్తాను’ అని వెనకనుండి ‘రుచి’ నడుం చుట్టూ చేయి వేసి దగ్గరగా హత్తుకుని, చెవిలో గుసగుసగా చెప్పి వెంటనే వదిలేశాడు అభి. అలాగే అని తలూపి అభి చేసిన చిలిపి పనికి లోలోపలే ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ కిచెన్‌లోకి వెళ్ళింది రుచి. కారణం, అభి వాళ్లమ్మ ఆ పక్కకు తిరిగి ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ఎంతైనా పక్కన పెద్దవాళ్ళుంటే భయం కదా! అదీగాక రుచి వాళ్లది ఉమ్మడి కుటుంబం. చాలా సంప్రదాయంగా పెరిగింది. భార్యాభర్తల ప్రేమ అంటే పడక గదుల వరకే పరిమితం అన్న భావం ఆ ఇంట్లోవాళ్ళకి నరనరాల్లో జీర్ణించుకుపోయింది. మరి ఆ ఇంటి వారసురాలు కాబట్టి రుచి కూడా అదే భావనతో పెరిగింది.ఇంకా ఈ కాలంలో ఇలాంటివాళ్ళు ఉన్నారా? అంటే అందుకు నిదర్శనం రుచి వాళ్ళ కుటుంబమే. అభి వాళ్లింట్లో కూడా అలాంటి పరిస్థితే. అందుకే సంప్రదాయాలు నచ్చి పెద్దవాళ్లు మాట్లాడుకున్నాకే వీళ్ళకి పెళ్ళిచూపులు గట్రా అయ్యాయి.పెద్దలు చూసిన సంబంధమే అయినా గాని, కట్నం పేరు వినపడకుండా అన్నీ లాంఛనాల పేరుతో ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు ఎటువంటి లోటు రాకుండా.కొత్తపెళ్లి కూతురిగా, కోటి ఆశలతో ఆ ఇంట అడుగు పెట్టింది రుచి.అభివాళ్ల ఇంట్లో అత్తగారు, మావగారు కాకుండా, బెంగుళూరులో చదువుకుంటున్న మరిది, అప్పుడప్పుడు సెలవులకి వస్తూ ఉంటాడు. అందరూ కలిసే భోజనం చేస్తారు. ఉదయం, సాయంత్రం అత్తగారు వంట చేస్తుంది. మావగారు ఇంకా సర్వీసులో ఉన్నారు. అన్నీ ఒక పద్ధతిగా సాగిపోతూ ఉంటాయి.కోడలిగా ఆ ఇంట్లో అడుగుపెట్టిన రోజు నుండి కొత్త జీవితం మొదలయింది. 

అసలే నవ వధువు, ఆపైన కొంచెం మొహమాటస్తురాలు.ఎంత సంప్రదాయంగా పెరిగినా, పుట్టింట్లో స్వతంత్రం, చనువు ఉంటాయి. సరదాగా సినిమా పాటలు పాడటం, పైన మేడమీదకెళ్ళి గట్టిగా అరవడం, డాన్సులు చేయడం లాంటివి. ఇక్కడికి వచ్చాక పెళ్ళయిన ముద్రతో, గాంభీర్యంగా ఉండటం రుచికి చేతకావటం లేదు.దానికి తోడు రుచికి, అభితో పెద్దగా చనువు కూడా పెరగలేదు, మొహమాటంగానే ఉంటుంది.మనసులో మటుకు అతను చేసే చిలిపి పనులు అంటే ఇష్టమే కాని, అంతలోనే ఏదో బెరుకు. గదిలో కూర్చొని ఆలోచిస్తున్న రుచికి మొదటి రాత్రి గురించి తమ ఇంట్లో జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది.ఫఫఫమొదటి రాత్రి ఎక్కడ ఎరేంజ్‌ చెయ్యాలా అని రుచి అమ్మానాన్న మాట్లాడుకుంటున్నారు. ఇంతలో రుచి చెల్లెలు నవ్య ‘‘నానమ్మా! అక్కకి పెళ్ళయి అప్పుడే రెండు రోజులు అయింది. ఫస్ట్‌నైట్‌కి ఎక్కడ ప్లాన్‌ చేస్తున్నారు? అని అడిగేసరికి ఒక్కసారి ఉలిక్కిపడింది నానమ్మ శ్యామల. గదిలో ఉన్న రుచి కూడా ఆశ్చర్యపోయింది.