కొండ కనుమలను తలగడగా చేసుకుని నిద్రపోవాలనిపించిందేమో పడమట దిక్కున వాలిపోతూ ఉన్నాడు సూర్యుడు.సంధ్యా సమయం సూర్యకాంతి పడి అడివంతా వర్ణశోభితంగా వుంది. అడవి వాతావరణంలో మధురమైన సంగీత సప్తస్వరాలు ప్రతిధ్వనిస్తూ వున్నాయి.అడివి అందాలు నిశాంత్‌కు కొత్తేమీ కాదు. అందరి ఉద్యోగాలు పట్టణాల్లో వుంటే అతని ఉద్యోగం అడవుల్లో తిరగడం. ఫారెస్ట్ ఆఫీసరుగా ఉద్యోగంలో చేరి రెండేళ్ళయ్యింది.దట్టమైన అడివి మధ్యలో మెటల్ రోడ్డు మీద జీప్ నడపడం కొండయ్యకు కొట్టిన పిండే! రెప్ప వాల్చకుండా మెలికలు తిరిగిపోతున్న దారి మీదే అతని దృష్టి లగ్నమయి వుంది. రోడ్డుకు అడ్డంగా పరుగులు తీస్తున్న లేళ్ళగుంపులను, జీప్ చేస్తున్న శబ్దానికి బెదిరి ఎగిరి గంతులేస్తూ పొదల్లోకి దూరిపోతున్న కుందేళ్ళను గమనిస్తూ, జీప్ స్టీరింగు సంభాళిస్తూ నడుపుతున్నాడు.డ్రైవరు పక్కన కూర్చున్న నిశాంత్ దృష్టి చెట్లమీదే వుంది. ఎవరన్నా చెట్లు నరికి వేస్తున్న జాడలు ఏమన్నా వున్నాయేమోనని నిశితంగా చూస్తూ వున్నాడు.‘‘మనం ఖమ్మం తిరిగి వెళ్ళడం కష్టం సార్... అడివి మధ్యలో వున్నాం... చీకటి పడబోతున్నది. మెయిన్‌రోడ్డు మీదకు చేరుకోవడం చాలా కష్టం’’ అన్నాడు కొండయ్య.‘‘దగ్గర్లో మన ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ గెస్ట్ హౌస్ ఉంది కదా... ఈ రాత్రికి గెస్ట్ హౌస్‌లో వుండిపోదాం’’ జీపు చప్పుడకు ఎనిమిది అడుగులు ఎత్తుకు ఎగిరిన దుప్పులను చూస్తూ అన్నాడు నిశాంత్.
అడివిలో జంతువులు చేసే శబ్దాలు, గూళ్ళలో సర్దుకుంటున్న పక్షులు చేసే ధ్వనులు అతని మనస్సును మరో ప్రపంచానికి లాక్కెళ్ళాయి. అడవి పూలమత్తు వాసన గాలిలో తేలివస్తూ వుంది.కోతుల గుంపులు వాటి కోతి చేష్టలతో కనువిందు చేస్తున్నాయి. పిల్లల్ని పొట్టకు కరుచుకుని ఒక కొమ్మ మీద నుంచి మరో కొమ్మ మీదకు గంతులేస్తూ కన్పించాయి. దూరం నుంచి ఏనుగుల ఘీంకారనాదాలు విన్పించేయి.....హైద్రాబాద్‌లో వున్న భార్య, పిల్లలు గుర్తుకు వచ్చారు. నిశాంత్ భార్య సచివాలయంలో సెక్షన్ ఆఫీసరు. పిల్లలు చదివేది కాన్వెంట్ స్కూల్లో. వాళ్ళు తన దగ్గర వుండే పరిస్థితి లేదు. తన పోస్టింగ్ ఖమ్మంలో. నెలలో రెండు మూడ్రోజులు తనే వీలు చూసుకుని భార్యా పిల్లలను చూడటానికి వెళ్తూ వుంటాడు. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులైతే ఇటువంటి ఇబ్బందులు తప్పవు మరి...గెస్ట్ హౌస్ దరిదాపుల్లోకి వచ్చేశారు.నీళ్ళకుండ భుజం మీద పెట్టుకుని ముందు నడుస్తున్న మేకలను అదిలిస్తూ ఓ అమ్మాయి పోతూ వుంది. జీప్‌కు ఎక్కడ అడ్డం పడతాయోనని గట్టిగా హారన్ మోగించాడు కొండయ్య మేకలను అదిలించే ప్రయత్నంలో.హారన్ శబ్దానికి మేకలు రోడ్డుమీద నుంచి కదిలి దారిప్రక్కనున్న పొదల్లోకి తప్పుకున్నాయి. ఓ చిన్న మేకపిల్ల బెదిరిపోయి జీప్‌కు అడ్డంగా వొచ్చింది.