క్రిక్కిరిసిన ట్రాఫిక్‌ను ఛేదించుకొని, ఆ ఆసుపత్రిలోకి అడుగుపెట్టిన నేను అక్కడి వాతావరణానికి ముగ్ధుడనయ్యాను. నాలో అప్పటివరకు కలిగిన చిరాకంతా ఒక్కసారిగా మాయమయింది. ఒక వంక అందంగా అమర్చిన జలపాతం, మరోపక్క చెట్లు (పూలతొట్లలోనే), గోడలకు రమణీయ దృశ్యకావ్యాలు, ముఖ్యంగా ఆ చల్లని ఏ.సి. గది - మనసుకు ఎంతో హాయిగా అనిపించింది.ఇంతలో ఓ యువతి వచ్చి ‘‘మీ పేరు సార్‌? అపాయింట్మెంటు ఉందా?’’ అని అడిగింది.నా పేరు చెప్పి ‘‘డాక్టర్‌ గంగాధరం పంపారు. మేడంతో ఓ కేసు విషయం మాట్లాడాలి, ఆమెకు తెలుసు’’ అని నా కార్డు ఇచ్చాను.‘‘కూర్చోండి’’ అని నాకు చోటు చూపించింది. అప్పుడు గమనించాను. అక్కడక్కడా అమర్చిన కుర్చీలలో ఎనమండుగురు అప్పటికే ఆసీనులయ్యి ఉన్నారు. నా వంతు కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాను.

ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న నేను ఈ మధ్య ఆరోగ్యం బాగోలేదని మా అమ్మను సంస్థకు అనుబంధంగా నడిచే ఆసుపత్రికి తీసుకుపోయాను. రెండు వారాలు వైద్యం అందించిన డాక్టర్‌ గంగాధరం మా ఇరువురికీ ఉన్న స్నేహాన్ని బట్టి ఆమె శారీరకంగా కంటే మానసికంగా ఎక్కువ బాధపడుతున్నదని, మానసిక వైద్యురాలైన తన భార్య డాక్టర్‌ స్వయంప్రభకు ఒక్కసారి చూపిస్తే మంచిదని సలహా ఇచ్చాడు. నా భార్య అమ్మను రెండు సిట్టింగులకు తీసుకెళ్ళింది. ఏవో కొన్ని మందులు రాసిచ్చినామె నన్ను ఓ మారు కలవమని డాక్టర్‌ గంగాధరం ద్వారా కబురుపెట్టింది. పనుల్లో పడి నేను పట్టించుకోలేదు కానీ మొన్న రాత్రి తనకు నచ్చిన సీరియల్‌ పెట్టలేదని టీవీ రిమోట్‌ను విసిరేసిన మా అమ్మ ప్రవర్తన నన్ను ఇక్కడకు నడిపించింది. ఊహ తెలిసినప్పటినుండి నా తల్లి ఇంతలా అసహనాన్ని వ్యక్తపరచడం నేను చూడలేదు. మా పెళ్ళి నాటి నుంచి ఆమెను ఎరిగిన నా ఇల్లాలు కూడా ఆశ్చర్యపోయింది.ఫఫఫవేచి ఉండే ప్రదేశంలోనే ఎంతో ప్రశాంతతను కలిగించే వాతావరణం ఏర్పాటుచేసిన డాక్టరు తన కన్సల్టింగ్‌ రూమ్‌ను మరింత ఆహ్లాదకరంగా మలిచింది. గది మధ్యలో ఖాళీగా ఉన్న మేజా బల్ల, దానికి ఇరువైపులా కుర్చీలు. చుట్టూ కుండీలలో పొందికగా అమర్చిన పచ్చని మొక్కలు. అన్నింటికీ మించి ఈ మధ్య కార్యాలయాల్లో ఎక్కడా కనిపించని సూర్యరశ్మి.