బస్టాండులో జనం పలుచగా వున్నారు. ఎన్నో బస్సులు వస్తున్నాయి... వెళుతున్నాయి... కానీ, నేను వెళ్లవలసిన బస్సు మాత్రం ఇంకా రాలేదు. అదెపడు వస్తుందో చెప్పే నాధుడే లేడక్కడ?నాకు చాలా చిరాగ్గా వుంది. బయట ఎండ మాడ్చేస్తోంది. చెమటతో వొళ్లంతా తడిసి ముద్దయిపోతోంది. రాని బస్సు కోసం ఎదురు చూడ్డంలో నాకు అసహనం అంతకంతకూ పెరిగిపోసాగింది. ఏదన్నా పుస్తకం చదువుదామనిపించింది. సూట్‌కేస్‌ తెరిచి పుస్తకం తీస్తూ యాదృచ్ఛికంగా ఎదురుగా ఆగి వున్న బస్సు వైపు చూసి ఉలిక్కిపడ్డాను.అక్కడ... ఆ బస్సులో... ఓ యువతి ఏవో తినుబండరాల ప్యాకెట్లను అమ్ముతోంది ఆమె కళావతిలా వుండడమే నా ఉలికిపాటుకు కారణం. ఆమె భుజానికి వేలాడుతున్న సంచిలో ఇంకా చాలా రకాల ప్యాకెట్లున్నాయి. ప్రతి ప్రయాణీకుడి ముందుకూ చెయ్యి చాపుతోంది. కావలసిన వాళ్లు కొనుక్కుంటున్నారు. కొనుక్కున్న వాళ్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ముందుకు కదులుతోంది.ఆమె బస్సులో నుండి కిందకు దిగింది. సందేహం లేదు. ఆమె కళావతే! చటుక్కున పుస్తకాన్ని ముఖానికి అడ్డుపెట్టుకున్నాను. అలా చెయ్యడం ఆమెకు భయపడి కాదు. నేనెవరో ఆమెకు తెలియకూడదని... అంతే!అలా బస్సు దిగిన ఆమె వెనుక ఓ రెండేళ్ల పిల్లవాడు కూడా వున్నాడు. వాడు కళావతి కొంగుపట్టుకొని నడుస్తున్నాడు. వాడిని చూశాక నా గుండె ఎందుకో తీవ్రంగా స్పందించసాగింది. ఆమె నావైపు రావడంతో నా ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డాను. నా పక్కన ఇంకా చాలా మంది బస్సు కోసం ఎదురు చూస్తున్న వాళ్లున్నారు. వాళ్లల్లో కొంత మంది కళావతి అమ్మే ప్యాకెట్లు కొని తింటున్నారు.

కొంటే ఆమె ముఖంలో సంతోషమో...వద్దంటే బాధపడ్డమో... ఏ భావాలు ఆమెలో కనిపించలేదు నాకు!! యాదృచ్ఛికంగా...నిర్లిప్తంగా...నిశ్శబ్దంగా చిప్స్‌ ప్యాకెట్లను అమ్ముకుంటోంది కళావతి!ఆమె నా భార్య కాకపోయుంటే నేనూ ఓ ప్యాకెట్‌కొని ఆమెకు సాయం చేసుందును. కానీ... ఆమె ముందు వుంది ‘నేను’ అని తెలిస్తే చచ్చినా దాన్ని ఆమె నాకు అమ్మదు. ఆమె స్వభావం నాకు బాగా తెలుసు. అహంకారి! ఆ అహంకారమే ఇప్పటికీ ఆమె నుండి దూరం కాలేదని తెలుస్తోంది. ఆ అహంకారమే ఆమెను నానుండి దూరం చేసింది.అలా నా నుండి దూరమైపోయిన ఆమె... ఇలా... బస్టాండులో చిప్స్‌ ప్యాకెట్లు అమ్ముతూ కనిపిస్తుందని నేను ఊహించలేదు. ఆమెకెందుకు ఈ దుస్థితి దాపురించింది? ఆమె తల్లి, తమ్ముడూ ఏమైనట్లు? ఆమె చేత ఈ పని ఎందుకు చేయిస్తున్నట్లు?ఇలాగే ఓసారి ఏదో పండగకు వాళ్ల ఊరికి వెళదామని బస్టాండుకొచ్చాం. అపడు కూడా ఎంతకీ బస్సు రాకపోయేసరికి బస్సు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాం. ఓ పదహారేళ్ల అమ్మాయి ఏవో ఫారిన్‌ వస్తువులు చీప్‌గా అమ్ముతోంది. ఆ అమ్మాయి నా దగ్గరకొచ్చి ‘‘సార్‌... మీకు ఈ సెంట్‌ అయితే బావుంటుంది. సెంట్‌ రాసుకొని ఆఫీసుకెళితే అందరూ మీకేసి చూడాల్సిందే...’’ అంటూ చిలిపిగా నవ్వింది.