ఒక భారతీయ స్ర్తీ చిన్న నేలబారు పీట మీద కూర్చొని స్నానం చేస్తున్న చిత్రం. గోడకి ఉన్న అద్దంలో అస్పష్టంగా ఆమె ముఖం; ముఖం కన్నా నుదిటిపైన మెరుస్తూ ఎర్రటి బొట్టు. వీపు మీద తడిసిన తెల్లటి వస్త్రంలో ఆమె వెనుక భాగం స్పష్టంగా ఉంది. పొడవాటి నల్లటి శిరోజాల అంచున ముత్యాల్లా రాలుతున్న నీటి చుక్కలు. ఓ మూలగా ఒక రంగుల సంతకం! ఆమె తదేకంగా ఆ చిత్రం వైపే చూస్తోంది. ప్రతీ చిన్న వస్తువూ చాలా వివరంగా కనిపిస్తున్నాయి. ఒక సజీవ దృశ్యంలా మలచబడ్డ ఆ చిత్రాన్ని ఆమె రెప్ప వాల్చకుండా చూస్తూనే వుంది. ఎంత భావుకతతో చిత్రీకరించాడు? ముఖ్యంగా ఎంచుకున్న రంగులు! ఒక్కసారి ఆ చిత్రకారుడి సంతకం వైపు చూసింది. అప్రయత్నంగా ‘‘అహిగా’’ అంటూ మెల్లగా అంది. ‘‘ఏంటి అంత తదేకంగా చూస్తున్నావు, సరూ?’’ అంటూ జాన్‌ వెనుక నుండి ఆమె భుజం తట్టేసరికి ఒక్కసారి ఉలిక్కిపడింది.‘‘రోజూ చూస్తున్నదయినా, ప్రతీరోజు ఆ పెయింటింగ్‌ చూస్తుంటే కొత్తగా కనిపిస్తూనే ఉంటుంది,’’ నవ్వుతూ అంది సరూ.సరూకి ఇష్టమయినా ఆ పెయింటింగ్‌ని తన పడకగదిలో గోడకి పెట్టుకుంది. పాతికేళ్ళ క్రితం స్నేహితులతో కలిసి మొహావీ వేలీ వెళ్ళినప్పుడు అహిగా అనే ఒక చిత్రకారుడు తనకు ఈ చిత్రాన్ని బహుమానంగా ఇచ్చాడు. అప్పటి నుండి ఆ చిత్రాన్ని ఎంతో భద్రంగా దాచుకుంది.

‘‘ప్రతీ రోజూ, ఈ పెయింటింగ్‌లు చూసి చూసి నీకలా అనిపిస్తూ ఉంటుంది. అంతే!’’ అంటూ జాన్‌ కొట్టి పారేసి సంభాషణ తన ఆఫీసు గొడవల గురించి మార్చేసాడు.ఇంతలో సరూ మేనేజరు కెవిన్‌ నుండి ఫోనొచ్చింది. అక్కడనుండి వేరేగదిలోకి వెళ్ళి మాట్లాడింది సరూ. కెవిన్‌ అంటే జాన్‌కి గిట్టదు. అతనికి ఆడవాళ్ళ పిచ్చి అని అందరూ చెప్పుకుంటూండగా విన్నాడు. ఆర్టు గ్యాలరీ ఉద్యోగం మానేయమని ఎన్నోసార్లు సరూకి చెప్పాడు. అతను మిగతా స్ర్తీలతో ఎలా వుంటాడో నాకనవసరం, నా దగ్గర అతని ప్రవర్తన ఎప్పుడూ హద్దులు దాటలేదని చెప్పింది. కానీ అతని అనుమానాలుఅతనివి. సరూ తిడుతుందని పైకి అనడు.‘‘ఏవిటంటాడు, మీ మేనేజరు?’’ సరూ వస్తూండగానే అడిగాడు.‘‘ఏం లేదు. ఆ గోడకున్న పెయింటింగ్‌ పట్టుకు రమ్మనమని చెప్పాడు,’’ అంతకుమించి పొడిగించలేదు సరూ.‘‘నువ్వేం చెప్పావు?’’‘‘ఇవాళ శాన్‌ఫ్రాన్సిస్కోలో చిత్రకారుల ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ ఉంది. ఇది పాతికేళ్ళ క్రితం నాటి పెయింటింగ్‌. అప్పట్లో మొహావీ లోయకి వెళ్ళినప్పుడు కొన్నాను. కెవిన్‌కి ఈ పెయింటింగ్‌ అంటే చాలా ఇష్టం. మా గ్యాలరీ తరపున పెడదాం తీసుకురమ్మన్నాడు,’’ గోడ మీదున్న చిత్రపటం కేసి చూస్తూ అంది. కెవిన్‌ ఈ పెయింటింగ్‌ అమ్ముదామని చెప్పాడనీ, తనకి ఇది ప్రాణం, అమ్మనని చెప్పానంది.