‘‘ఏంటి నాన్నా..అలావున్నావ్‌..’’ అడిగింది మాధవి. కొడుకు విశాల్‌ అలియాస్‌ పండుని.‘‘ఏం లేదమ్మా...’’ చెప్పాడు పండు.‘‘ఏమీ లేకపోతే అలా ఎందుకు వుంటావురా.. సరిగ్గా భోజనం చేయడం లేదు.. హోంవర్క్‌ కూడా శ్రద్ధగా చేయట్లేదు. నోట్సులో రిమార్క్స్ చూస్తూనే వున్నా..’’ అందిమాధవి.తల్లి వైపు ఎగాదిగా చూసి..‘‘మనస్సు బావోలేదమ్మా...’’ చెప్పాడు పండు.‘‘మనస్సుకు ఏమైందిరా నీ వయసుకు మాట్లాడాల్సిన మాటలేనా?’’ మందలింపుగా అంది మాధవి కొడుకు ముఖంవైపు అదోలా చూస్తూ.పండు సెయింట్‌ థామస్‌ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.తండ్రి జీన్స్‌ యాజ్‌ ఇటీజ్‌గా రావడంతో మనిషి ఏపుగా పెరిగాడు.చిన్న వయస్సుకే ధృడంగా పెరిగాడు.‘‘ఈ వయస్సుకే ఏదైనా ప్రేమలో పడ్డాడా?..’’ అనుమానంగా చూసింది మాధవి.. తర్వాత తనని తాను తిట్టుకుని ‘ఛా’ అను కుంది. కానీ నిర్ధారణకి రాలేకపోయింది.

పండు బాల్యావస్థ దాటలేదని అతడి అనేక చర్యలు చెప్పుతుండడంతో కాస్త ఊరటగా వుంది. కానీ మీడియా... ఇంటర్‌ నెట్‌ ప్రమాదంతో వయసుకు మించి పిల్లలు ప్రవర్తిస్తున్నారన్న చింత ఆమెలో బలంగా వుంది.తరచూ ‘ఆక్వేరియం’ ముందు కూర్చుంటున్నాడు పండు. రాజకీయాలనో... వ్యాపారమనో తన భర్త జనార్దన్‌ తిరిగేటప్పుడు... ఆ ఒంటరితనాన్ని భరించడం కష్టమై డిప్రెషన్‌ పోగొట్టుకోవడానికి తను ‘ఆక్వేరియం’ ముందు కూర్చునేది.రంగు రంగుల చేపలు ఇటువైపు నుండి అటువైపు ఈదుతుంటే సంభ్రమంగా చూస్తుండేది. చేపల చిన్న చిన్న కళ్ళు... అవి నీళ్ళు పీల్చి మొప్పల ద్వారా వదిలే వైనం సరదాగా చూసేది. తన ఆసక్తిని గమనించి జనార్దన్‌ రంగు రంగుల చేపల్ని తెచ్చి ‘ఆక్వేరియం’ లో వదిలేవాడు.

‘ఇంకా నయం వాటితోనే కాపురం చేయమనట్లేదు..’ అనుకొనేది నవ్వుతూనో విసుగుతోనో. ‘‘అదికాదు మాధవీ. ఇప్పుడు నేను రిలాక్స్‌ అయితే రేపు బుజ్జి జనార్దన్‌ పరిస్థితి ఏంటి??...’’ అనేవాడు భార్య నెలలు నిండిన కడుపు మీద చేయివేసి.సంపాదన... రాజకీయాలు.. వ్యాపారం... ఒకటే పరుగు...ఆ పరుగులో తాను ఎంత వెనుక బడిపోయానో అని మాధవి వ్యధకు లోనయ్యేది.కాలం గిర్రున తిరిగింది.. పండు పుట్టాడు. ఎదిగాడు.. ఎదుగుతున్నాడు..