గీనడ్మ బడికి బోవాలంటె బుగులైతున్నది. బడి మాకు గండం తీర్గ అయ్యింది. తరగతికి బోతె ఏ సుడిగుండంల బడ్తమో ఎర్కలేకుంటైంది. మా క్లాస్‌ టీచర్‌ గోపాలకిష్న సార్‌. గాయిన హాజిరి దీస్కున్నంక-‘‘అరె బక్కోడా గిటు రా’’ అని బిల్సి-‘‘నిన్న మొన్న బడికి ఎందుకు రాలేదురా’’ అని అడిగిండు.‘‘బగ్గ జెరమొచ్చింది సార్‌’’ అని బక్కోడు జెప్పిండు.‘‘మీకు బడి అన్నా పరీచ్చలన్నా జెరాలొస్తయేందిరా? బడికి డుమ్మగొట్టి ఎన్ని సిన్మలు జూసినవ్‌ర’’ అని సార్‌ అడిగిండు.‘‘లీవ్‌ లెటర్‌ సంగతి యాదిమర్సిన సార్‌’’ అని గాడు అన్నడు.‘‘ఇయ్యాల్ల లీవ్‌లెటర్‌ యాదిమరుస్తవు. రేపు పాటాలు యాదిమరుస్తవు. పరీచ్చల సున్న మార్కులు దెచ్చుకుంటవు. మా ఇజ్జత్‌ దీస్తవు. గోడ కుర్సి ఎయ్యి’’ అని సార్‌ అన్నడు.గాని మోకాల్ల మీద ఒక పుస్తకం ఉంచిండు. గది గిన కింద బడితె బొక్కలురగ్గొడ్త అని జెప్పిండు. పస్టుపీరియడ్‌ అయ్యేదాంక బ క్కోడు గోడ కుర్సి ఏసిండు.పీరియడ్‌ కతంగాంగనే మా చప్రాసి అహ్మద్‌ఖాన్‌ గంటి గొట్టిండు. సెకండ్‌ పీరియడ్ల లెక్కల సార్‌ వొచ్చిండు. రాంగనే-

‘‘హోం వర్క్‌జెయ్యనోల్లు లేసినిలబడుండ్రి’’ అని గాయిన అన్నడు.కొంతమంది లేసి నిలబడ్డరు. మా లెక్కల సార్‌ కొట్టెటోడు గాదు. తిట్టెవోడుగాదు. మా చెవులను రెండు ఏల్ల నడ్మ ఇరికిచ్చుకోని గోల్లతోని గిచ్చెటోడు. తొడపాశం బెట్టెటోడు. మేము మొత్తుకుంటుంటె-‘‘మల్ల ఎన్నడన్న హోంవర్క్‌ జెయ్యకుంట వొస్తరా?’’ అని సార్‌ అడిగెటోడు.మూడో పీరియడ్‌ సైన్స్‌. మహదేవ్‌ సార్‌ వొచ్చెటోడు. గాయిన మంచిగ పాటాలు జెప్పెటోడు. గని పాటం జెప్పంగనే సవాల్లు అడిగెటోడు. జవాబులు జెప్పకుంటె గాయిన ఐదుయేల్లను మా చెంపల మీద చపాయించెటోడు.ఒకసారి గాయిన యాద్గిరి గాన్ని నిల బెట్టి-‘‘న్యూటన్‌ మూడో సూత్రం ఏంటిదో జెపరా’’ అని అడిగిండు.‘‘గది గది...’’ అన్కుంట యాద్గిరి నీల్లు నమ్లిండు.సార్‌ గాని చెంప మీద రెండీకిండు.‘‘గిపడు నేను ఎందుకు గొట్టిన?’’‘‘జవాబు జ్పెకుంటె సార్‌’’‘‘గిదె న్యూటన్‌ మూడో సూత్రం. చర్యకు సమానంగ ప్రతి చర్య ఉంటది. నువ్వు జవాబ్‌ జెప్పకపోవుడు చర్య. అయితె జవాబ్‌జెప్పనందుకు నేను నిన్ను గొట్టుడు ప్రతిచర్య’’ అని సార్‌ అన్నడు.