‘‘బిడ్డని కనడానికి అద్దె వసూలు చేయడం, లేదా ఓ ఒప్పందం ప్రకారం ఒప్పుకున్న పనికి నెలకి ఇంతని సొమ్ము పుచ్చుకోవడాన్ని సంపాదనగానే చూడాలి... ఇటువంటి సొమ్ముకి ఆదాయపు పన్నులో మినహాయింపు ఇవ్వాలని ఎక్కడా రాసి లేదు... నా అభిప్రాయంలో... ఇది రిపోర్ట్‌ చెయ్యాల్సిన ఆదాయమే!’’ అన్నాడు సిపిఎ (Certified Public Accountant).ఈ మాటలు వినగానే...‘‘ఏం... ఎందుకు లెక్కచెప్పాలి? నా శరీరం మీద కూడా నాకు హక్కు లేదా? రకరకాల ఖర్చుల పేర్లు చెప్పి... సరోగసీ ఏజెన్సీలు పేరెంట్స్‌ నుంచి డెబ్బయి, ఎనభై వేల డాలర్లకు పైగా వసూలు చేస్తుంటే... మిలియన్ల వ్యాపారం జరుగుతుంటే, వాటికి అండగా నిలబడుతున్నవి గవర్నమెంటులే. ఆ లెక్కలు ఏనాడూ బయటకు రావు. మా శరీరాలను అడ్డుపెట్టుకుని గవర్నమెంటు ఎంత సంపాదించాలనుకుంటోంది?...’’ ఆవే శంగా అంది కేట్‌.‘‘సరోగసీ ఏజెన్సీ మీకు ఎటువంటి టాక్స్‌ ఫాం ఇవ్వలేదు కాబట్టి, ఆదాయపు పన్ను కట్టవలసిన అవసరం లేదని చెప్పడం తప్పుతోవ పట్టించడమే అవుతుంది. అలాగే ఆదాయపు పన్ను శాఖ (Internal Revenue Service)మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి, వడ్డీతో సహా ఆదాయపు పన్ను కట్టమంటుందనీ చెప్పలేను... అదో మహాసముద్రం... ఏవి తేలతాయో, ఏవి అడుగున ఉంటాయో చెప్పడం కష్టం. 

కొత్తగా రూపుదిద్దుకుంటున్న ‘వృత్తి’ కనుక మీరు చెప్పే విషయాల మీద కొంత అస్పష్టత ఉంది. పైగా ఏజెన్సీలు ఒకే మాదిరి ఒప్పందాలను కుదుర్చుకోవు... రకరకాల పదాలు వాడుతుంటారు... మీరు ఏం ఆశించి ఈ పని చేస్తున్నారనేది ఇక్కడ కీలకమైన అంశం... ఇక మీ మాజీ భర్త నుంచి భరణం వస్తుంటే అది కూడా తప్పకుండా రిపోర్ట్‌ చెయ్యాల్సిన ఆదాయమే.నా మాటల్ని మీరు తప్పుగా అనుకోకండి, చట్టాల తాత్పర్యం ఎలా ఉంటుందో చెప్పడం కోసమే అలా అన్నాను. రక్తదానం చెయ్యటం గొప్ప విషయం, కానీ అదే జీవనాధారం అయిందనుకోండి... స్వయం ఉపాధి (self-employment) కిందికి వస్తుంది. ఈ మధ్య కాలంలో తల్లి పాలు అమ్ముతున్న మహిళలు ఎంతోమంది ఉంటున్నారు, ఈ పనిని కూడా స్వయం ఉపాధి కింద పరిగణించాల్సి వస్తోంది. ఆదాయానికి సంబంధించిన అన్ని కాగితాలూ, ఖర్చుల వివరాలూ తీసుకొస్తే పన్ను ఎంతో లెక్క కట్టొచ్చు... మీరు విద్యార్థిని అంటున్నారు కనుక టాక్స్‌ ఫైల్‌ చెయ్యడం ఉపయోగం కూడా... తర్వాత లేనిపోని తలనొప్పులు ఉండవు...’’ వివరణ ఇచ్చాడు సిపిఎ.