ఆటో ఇంటికి వెళ్లే మలుపు తిరుగుతుండగా గుర్తొచ్చింది కృతికి ఇంట్లో కూరగాయలు ఏమీ లేవని. ఆటోని ఆపమని చెప్పి మూలన ఉన్న కొట్లో గుడ్లు, ఉల్లిపాయలు తీసుకుంది. సంతోషంతో గాల్లో తేలిపోతున్నట్టుగా ఉంది కృతికి. రోజూ చూసే పరిసరాలే ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి.ఎక్కడి నుంచో సన్నజాజుల పరిమళం గాల్లోంచి తేలివచ్చింది. తలెత్తి చూస్తే ఆకాశంలో కనిపించీ కనిపించనట్టు సన్నని రేఖలా నెలవంక. పక్కనే తళుక్కుమంటూ మెరుస్తున్న నక్షత్రం. ఆమె మనసు చిత్రమైన సంతోషంతో నిండిపోయింది. ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్లి రిషితో ఆనందం పంచుకోవాలా అని తహతహగా ఉంది ఆమెకి. ఈ నెలనుంచి శాలరీలో పదివేల హైక్‌. ప్రాజెక్టు పూర్తి అవగానే శాలరీ పెరుగుతుందని అనుకుంటున్నదే. ఐదువేలు పెరుగుతుందేమో అనుకుంది కృతి. పదివేలు అనేప్పటికల్లా అంతవరకూ పడిన కష్టం దూదిపింజెలా తేలిపోయినట్టు అనిపించింది. చకచకా మెట్లెక్కి హుషారుగా ఇంట్లోకి అడుగు పెట్టింది. కృతిని చూస్తూనే అంతవరకూ చూస్తూ ఉన్న టీవీ కట్టేసి ల్యాప్‌టాప్‌ ఓపెన్‌ చేసాడు రిషి.కృతి ఉత్సాహం చప్పున చల్లారి పోయింది. అప్పుడు గానీ ఆమెకు గుర్తుకు రాలేదు ఉదయం జరిగిన గొడవ. రిషి ముభావంగా ఉండడం చూసిన తరువాత అతను దాన్ని సీరియస్‌గా తీసుకున్నాడని అర్థమయింది.ఇవాళ ప్రాజెక్టు సబ్మిట్‌ చేయాల్సిన రోజు. పొద్దుట్నించీ ఏదో తెలీని కంగారు. హడావుడిగా పరిగెడుతూ పనులు చేస్తున్నా మనసు స్థిమితంగా లేదు. 

ఆలోచనంతా ప్రాజెక్టుమీద ఉంది. పాలు పొంగబెట్టింది. ఇడ్లీలోకి చట్నీ చేయడానికి వేపిన మిరపకాయలు నల్లగా, బొగ్గుల్లా అయ్యాయి. మళ్లీ మిరపకాయలు వేపేంత టైమూ, లేదు. స్థిమితమూ లేదు. అల్మరాలో నుంచి అల్లప్పచ్చడి సీసా టేబిల్‌ మీద పెట్టి రిషికి చెప్పింది. ఇడ్లీలోకి చట్నీ లేదు ఈ పూటకి అల్లప్పచ్చడితో తినేయవా ప్లీజ్‌ అని. టిఫిన్‌ చెయ్యకపోయినా ఫరవాలేదు కానీ చేస్తే మాత్రం అన్నీ కచ్చితంగా ఉండాలి రిషికి. చట్నీ లేందే అందులోనూ వేరుశెనగ పచ్చడి లేందే ఇడ్లీ కానీ దోశ కానీ ముట్టడు. ఆ విషయం కృతికి కూడా తెలుసు. అందుకే భయం భయంగానే చెప్పింది.‘‘చట్నీ లేకపోతే నేను తిననని తెలుసు కదా’’ రిషి విసుక్కున్నాడు.కృతి కోసం అప్పటికే క్యాబ్‌ వచ్చేసింది. డ్రైవర్‌ హారన్‌ కొడుతున్నాడు. కృతికి చిరాకనిపించింది.‘‘ఒక్కరోజుకి చట్నీ లేకపోతే ఏమయింది? ఏదో ఒకటి వేసుకుని తినొచ్చుగా’’ కాస్త విసురుగానే అంది.‘‘నా సంగతి నేను చూసుకుంటాను. నువ్వెళ్లు’’ రిషి అసహనంగా అరిచాడు.కృతి మాట్లాడకుండా నాలుగు ఇడ్లీలు, చట్నీ బాక్సులో సర్దుకుని బ్యాగ్‌ తీసుకుని బైట పడింది. తర్వాత ఆఫీస్‌ హడావుడిలో పడి ఆ విషయమే మర్చిపోయింది. బ్యాగ్‌లోంచి లంచ్‌బాక్స్‌ తీసి కిచెన్‌ గట్టుమీద పెడుతూ హాట్‌ప్యాక్‌ మూత తీసి చూసింది. పొద్దున పెట్టిన ఇడ్లీలు పెట్టినట్టే ఉన్నాయి. అంటే రిషి టిఫిన్‌ చెయ్యలేదన్నమాట.