చాలా రోజులకి కొంత విరామం దొరికింది రాధాకృష్ణకి. వేసవి సెలవులకి కుటుంబం స్వంత వూరికి వెళ్ళడం, ఉద్యోగపరంగా ఆ రోజుకి అత్యవసర కార్యక్రమాలులేకపోవడంతో సమయాభావం వల్ల వాయిదాపడుతూ వచ్చిన పనులు చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో మొదటిది తనురోజు వాడే నిత్యావసర వస్తువులు తనే యిష్టపడి కొనుక్కోవడం.అద్భుతంగా ఉంది సూపర్‌బజార్‌. నగరంలో బాగా పేరు పొందినదీ, ఫ్రెంచి జాతీయుల ఆద రణ బాగా పొందినదీ కూడా. అరల్లో సరుకులు అమర్చిన విధానం కడురమ్యంగాను, అందులో ఎవరో కనబర్చిన శ్రద్ధ తెలిసేలాగాను వుంది.‘‘ఎలా వున్నారు’’ నవ్వుతూ పలకరించింది ఉమాజోషి. ఆవిడ వయసు సుమారు ఏభై పైన వున్నా ఏ మాత్రం చెరగని అందం. ఒక ఆంగ్ల దినపత్రికలో విలేఖరి. భర్త ఉద్యోగరీత్యా యిక్కడ స్థిరపడిన ఆవిడ నీతినిజాయితీకి మారుపేరుగా పత్రికా రంగంలో పేరు తెచ్చుకుంది. కానీ ఈ మధ్య ఆవిడలో మార్చువచ్చిందని వినికిడి. ఈ సంవత్సరం శాసనసభ మీ శాఖకి బాగా నిధులు కేటాయించింది కదా, మీకు పని వత్తిడి పెరిగి వుంటుంది’’ అందావిడ. లేదండీ, యివాళమటుకు ఖాళీగానే వున్నాను. అయినా ఎప్పుడూ వుండే వత్తిడే కదా’’ అన్నాడు రాధాకృష్ణ.ఆవిడతో మాట్లాడటం అయ్యాక ఎందుకో తెలీదు రాధాకృష్ణలో పాతజ్ఞాపకాలు కదల సాగాయి. కొందరు వ్యక్తులు వారికి పెద్దగా సంబంధం లేని గతాన్ని ఎందుకు మేలుకొలుపుతారో తెలీదు. సరిగ్గా పది సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు గుర్తొచ్చాయి.

‘ముఖ్యమంత్రి గారు మీకోసం ఎదురు చూస్తున్నారు’ హడావిడిగా చెప్పారు వ్యక్తిగత కార్యదర్శి. శాసనసభా సమావేశాలు జరుగుతున్న సమయం కావడంతో దారికి రెండు వేపులా బారికేడ్లు కట్టారు. వాహన తనిఖీ ఏమీ లేకుండానే సిబ్బంది పెద్ద ఇనుప తలుపుల్ని బార్లా తెరిచారు. బాగా పరిచయమైన వాహనాలకి తనిఖీ నామ మాత్రంగా కూడా వుండదు.ఫ్రెంచి కాలపు రాజ ప్రాసాదాన్ని ముఖ్యమంత్రి, తదితర మంత్రుల అధికార ప్రాంగణం గానూ, అందులో ఒక భాగాన్ని శాసనసభా ప్రాంగణం గానూ ఉపయోగిస్తున్నారు. స్వేచ్ఛగురించి, స్వపరిపాలన గురించి ప్రపంచానికి పాఠాలు బోధించిన ఫ్రెంచివారు ఆసియా ఖండంలో మిగిల్చి వెళ్ళిన ముఖ్య కట్టడం యిది. రెండు నిమిషాలు ఎదురు చూసాక ‘అయ్యా కలాపడరంగ (అయ్యవారు పిలుస్తున్నారు). మహరాజ దర్పంతో కూర్చుని ఉన్నారు ముఖ్యమంత్రిగారు. వారి ఎదురుగా మొదటి వరస కుర్చీలలో కొంతమంది వ్యాపారస్తులు, శాసనసభ్యులు కొలువు దీరి వున్నారు. చూడండి రాధాకృష్ణగారూ, వీరు మాకు అతిముఖ్యులు. మా ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారకులు. ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడాలని అనుకుంటున్నారు. వీరికి సహాయం చేయండి.