సెల్‌ రింగవ్వడంతో బద్దకంగా కళ్ళు తెరచి చిరాగ్గా దానివైపు చూసాడు వెంకట్రావు. ‘‘ఏయ్‌! ఎక్కడున్నావే.... ఫోన్‌ చూడు...’’ విసుగ్గా అరిచాడు. గుమ్మం ముందు అటూ ఇటూ తిరుగు తున్న పెద్ద కొడుకు నరేంద్ర గుమ్మం దగ్గర ఆగి - ‘‘అమ్మ పూజ చేసుకుంటోంది.. ఫోన్‌ దగ్గరే కదా ఉంది.. చూడొచ్చుగా’’ అనేసరికి తప్పదన్నట్లుగా సెల్‌ ఎత్తి ‘హలో’ అన్నాడు వెంకట్రావు.‘‘నాన్నా నేను రాజేంద్రని... అమ్మ లేదా నాన్నా!’’.‘‘అనుకున్నాను. నీకు అమ్మ తప్ప మేము గుర్తురాం. ఆవిడ గారు పూజ గదిలో ఉంది... మళ్ళీచెయ్యి...’’ అంటూ ఫోన్‌ ఆఫ్‌ చెయ్యబోతుండగా -

‘‘నాన్నా నేను నీ కోసమే ఫోన్‌ చేసాను..’’ అన్నాడు రాజేంద్ర.‘‘ఏంటో చెప్పు...’’ విసుగ్గా అడిగాడు వెంకట్రావు.‘‘నీలిమకు మూడు నెలలు నిండాయి నాన్నా! డాక్టర్‌ బెడ్‌ రెస్ట్‌ తీసుకోవాలని చెప్పారు... అందుకని’’‘‘అందుకని... నన్నేం చెయ్యమంటావురా... పుట్టింటికి పంప లేకపోయావా?’’...‘‘ఇప్పట్నుంచే పుట్టింటికి పంపడం.. నాక్కూడా ఇబ్బందే కదానాన్నా! అందుకని అమ్మని కొన్నాళ్ళు నా దగ్గరుంచుకుంటాను. అమ్మని పంపించు నాన్నా!’’‘‘మీ అమ్మ రావటం ఎలా కుదురుతుంది. మీ వదిన మీ ఆవిడలా ఇంట్లో కూర్చోదుగా. ఉద్యోగస్తురాలు.. పైగా నా పన్లు ఎవరు చూస్తారు... ఎవరినైనా పని మనిషిని పెట్టుకోరా అబ్బాయ్‌...’’ ఉచిత సలహా ఇచ్చాడు వెంకట్రావు.

అంతలో పూజ ముగించుకుని గదిలోకొచ్చింది అలివేలు మంగతాయారు. ‘‘కాఫీ తీసుకోండి’’ అంటూ ‘ఎవరు’ అన్నట్టుగా భర్తవైపు చూసింది.‘‘నీ చిన్నకొడుకు.. పెళ్ళాం కడుపుతో ఉందిగా.. ఊడిగం చెయ్యటానికి నిన్ను పంపమంటున్నాడు. డాక్టరు బెడ్‌రెస్ట్‌ కావాలందంట..’’ భర్త మాటలు పట్టించుకోకుండా ఫోన్‌ తీసుకుని ‘‘హలో చిన్నోడా! కోడలు ఎలా ఉందిరా... సరే మరి అవసరం గాబట్టి గదా అడుగుతున్నావు... నాన్న కాదనరు లేరా.... పెద్దోడికి చెప్పి బయలుదేరుతాను... సరే సరే... తొందరగానే బయల్దేరతాను.. ఉంటాను.. కోడలు జాగ్రత్త’’.‘‘వెళ్దామనే నిర్ణయించుకున్నావన్న మాట...’’ ఎద్దేవా చేస్తూ అన్నాడు వెంకట్రావు. ‘‘తప్పదుకదండీ... కూతురైనా కోడలైనా ఒక్కటేగా. వెళ్ళాలి కదండి’’ అంది ఖాళీ గ్లాసు అందుకుంటూ అలివేలు.