అభిప్రాయాలు, అభిరుచులు పొసగని జంటలు ఆ రెండూ. కానీ కొద్దిగా అటూ ఇటూ మారితే, అతని భార్యా, ఆమె భర్తా ఇద్దరూ చక్కని జంట అవుతారు. కానీ ఈ చక్కని జంట ఏకాంతంగా, సంతోషంగా ఎప్పుడూ గడపలేదు. కారణం ఏమిటంటే ఆమెకు భర్తంటే భయం, అతడికి భార్యంటే భయం. వాళ్ళెప్పుడైనా ఏకాంతంగా గడిపారా? మరి వాళ్ళ భాగస్వాములు సహించి ఊరుకున్నారా?

 ఆర్లోవే ఓ కళ్ళజోళ్ళషాపు యజమాని. ఊళ్ళో పెద్దమనిషిగా చలామణి అవుతుంటాడు. అందరికీ తన అవసరం ఉండాలని తపనపడేవాడు. మతబోధకులు, కళాకారుల తరహాలో తన వృత్తిలో సహనానికి, నైపుణ్యానికి అవకాశం లేకపోయిందే అని ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. అందరికీ తలలో నాలుకలా ఉండాలని ఎన్నో కార్యకలాపాలు నిర్వహించేవాడు. సభల్లో మాట్లాడేవాడు. యుద్ధ శరణార్థుల కోసం, చర్చి తరపున, చందాలు వసూలు చేసేవాడు. స్థానిక బేస్‌బాల్‌, హాకీ క్లబ్బుల్లో కూడా అతనికి సభ్యత్వం ఉంది. నున్నటి బట్టతల, గుండ్రటి మొహం, ముక్కుమీదకు జారే బైఫోకల్‌ కళ్ళద్దాలతో నలభై ఐదేళ్ళ వయసున్న ఆర్లోవే, ఎంతమందిలో ఉన్నా ప్రధాన ఆకర్షణగా నిలిచే వాడు. ఆ ఊళ్ళో ఆర్లోవే అంటే తెలియని వాళ్ళుండరంటే అతిశయోక్తి కాదు.అతడి భార్య విర్గా కొద్దిగా భయస్థురాలు. ఎప్పుడూ కలలు కంటూ ఊహల్లో తేలిపోతూ ఉండేది. ఆమెకు సంగీతమంటే ప్రాణం. ప్రేమగీతాలను ఇష్టంగా వింటూ ఉండేది. అయితే ఆర్లోవే మాత్రం తన కార్యక్రమాల్లో విర్గా కూడా పాలు పంచుకోవాలని కోరుకునేవాడు. బయటికి ఎక్కడికీ వెళ్ళకుండా, ఆమె ఇలా పగటికలలు కంటూ కాలం గడిపేయడం చూసి ఆర్లోవే మొత్తుకునేవాడు. అయినాసరే ఆమె అతన్ని అస్సలు పట్టించుకునేది కాదు. తన ధోరణిలో తనుండేది. రంగురంగుల ప్రేమలోకంలో విహరిస్తూ ఉండేది.ఆర్లోవే ఎక్కువగా బయటే గడుపుతుండటంతో, దంతవైద్యుడు అలాన్‌ సెడార్‌ ఆకర్షణలో పడింది విర్గా. అతడంటే విర్గాకు అమితమైన ప్రేమ. నిజానికి సెడార్‌, విర్గాలది చూడముచ్చటైన జంట. అయితే వాళ్ళు ఎప్పుడూ కలిసి ఏకాంతంగా, సంతోషంగా గడిపింది లేదు. భర్తని చూసి భయపడేది విర్గా. గయ్యాళి భార్యని చూసి భయపడేవాడు అలాన్‌. కూల్‌డ్రింక్‌షాపులో ఎప్పుడన్నా కలుసుకునేవారు. కాఫీయో, శీతలపానీయమో తాగేవారు. ఒక్కొక్కసారి అలాన్‌ సెడార్‌ సొంత కారులోనో, పార్కులోని పచ్చిక మైదానాల్లోనో కూర్చుని మాట్లాడుకునేవారు.

కారులైట్ల వెలుగులో రాబర్ట్‌ఫ్రాస్ట్‌, టి.ఎ్‌స.ఇలియట్‌, శాండ్‌బర్గ్‌లాంటి కవుల కవిత్వం చదువుకుని ఆనందించేవారు.అలాన్‌కు నగరంలో మంచి నటుడని పేరు. అతని నాటకాల్లో నటీనటుల దుస్తుల ఎంపికను విర్గా పర్యవేక్షించేది. నాటకం రిహార్సల్స్‌కు కూడా హాజరయ్యేది. అలా వాళ్ళు తరచు కలుసుకునేవారు. ఈ వ్యవహారమంతా అలాన్‌ సెడార్‌ భార్య బెర్తాకు తెలిసింది. లావుపాటి బెర్తా గయ్యాళి మాత్రమేకాదు, ఆమెలో ఒకలాంటి వంకరబుద్ధి, క్రూరత్వం కనిపించేవి. నిజానికి ఆమె భర్తను ద్వేషించేది. పైకి భర్తను తిట్టేది కాదుగానీ, నాటకాలపైనా, కవిత్వంపైనా భర్తకున్న ప్రేమను ఎగతాళి చేసేది. క్రాస్‌వర్డ్‌ పజిల్స్‌ పూర్తిచేయడం, స్టాంపుల సేకరణ లాంటి అతడి ఇష్టాలను విమర్శించేది. అతని మీసకట్టును, ఒక దంత వైద్యుడిగా అతడికున్న నైపుణ్యాన్ని కూడా చులకనచేసి మాట్లాడేది. బెర్తావాళ్ళు ఏడుగురు అక్కాచెల్లెళ్ళు. వాళ్ళతో, వాళ్ళ భర్తలతో కబుర్ల కాలక్షేపం చేస్తూ అలాన్‌ గురించి చులకనగా మాట్లాడేది.