‘‘సారధీ! వీలు కల్పించుకొని రాగలవా?’’‘‘అంత అర్జంటా విహారీ?’’‘‘తప్పదు. అంతేకాదు పదిహేనురోజులు వుండేలా మరీ రావాలి’’.‘‘అన్ని రోజులా?’’‘‘ఊ! వివరాలన్నీ వచ్చిన తర్వాత చెపుతాను’’ గొంతులో ఆతృతకంగారు కనపడ్డాయి.‘‘సరే రేపు బయలుదేరి వస్తాను’’ విహారి అభ్యర్థన కాదనలేకపోయాను.ఉదయం ఆరు గంటలవుతోంది. రాత్రి బద్ధకంగా ఒళ్ళు విరుచుకొంటోంది. తొలి సంధ్య రాత్రిని జయించటానికి ప్రయత్నిస్తోంది. పొగమంచు దట్టంగా వుంది. రోడ్డు ప్రక్కగా వున్న గడ్డి మీద నీటి బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. గడ్డి పూలకి కూడ బద్ధకం తగ్గలేదు కాబోలు విరిసీ విరియనట్లు రెక్కలు విప్పుతున్నాయి.బస్సెక్కి కిటికీ ప్రక్కగా కూర్చున్నాను. విహారి పది రోజుల క్రితమే కలిశాడు. ఇంతలో అత్యవసరంగా రమ్మనటానికి కారణం ఏమయివుంటుందా అని ఎంత ఆలోచించినా అంతుదొరకటం లేదు. 

విహారికి ఏ విధమైన బాదరబందీలు లేవు. బ్రహ్మచారి. మరొక మూడు, నాలుగు నెలల్లో రిటైర్‌ అవ్వబోతున్నాడు. ప్రభుత్వపరంగా చాలా మంచిపేరు వుంది. ఒకరికి సహాయపడే వాడే కానీ ఎవరికీ మనస్సులో కూడా హాని తలపెట్టేవాడు కాదు విహారి.ఆరోగ్యం బావోలేదా అంటే తన స్వంత వూళ్ళో వైద్య సదుపాయం అంతంత మాత్రం. అక్కడి ప్రజలే వైద్యం నిమిత్తం ప్రక్క వూళ్ళకి వెళతారు. నేను మాత్రం వెళ్ళి చేసేదేముంటుంది. మనసు పరి పరివిధాల పోతోంది.నాకు విహారితో తొలి పరిచయం ఐ.ఎ.యస్‌. ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగింది. ఆ రోజు ఉదయం అలవాటు ప్రకారం ముస్సోరిలో నడుస్తూ వుండగా దూరంగా రోడ్డు ప్రక్కన రెయిలింగ్స్‌ మీద ఒక వ్యక్తి కూర్చొని బైనాక్యులర్స్‌తో హిమాలయాల వైపు చూస్తున్నాడు.

అప్పటికి ఇంకా సూర్యోదయం అవ్వలేదు చలిగా కూడా వుంది దగ్గరకు వెళ్ళి అడిగాను.‘‘మీ పేరు’’.‘‘విహారి! ఐ.ఎ.యస్‌. ట్రైనింగ్‌కి వచ్చాను’’.‘‘నా పేరు సారథి. నేను కూడా దానికోసమే వచ్చాను. ఏ బ్యాచ్‌.’’చెప్పాడు.అంటే నాకంటే సంవత్సరం జూనియర్‌ అన్నమాట. ‘‘ఈ మంచులో బైనాక్యులర్స్‌తో పనేమంది?’’ అడిగాను.‘‘నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. కొండలు, చెట్లు, సూర్యోదయంలో, సూర్యాస్తమయంలో ఆకా శంలో కనపడే రంగుల కలయిక, కొండల్లోకి జారిపోతున్న సూర్యుడు. వీటన్నింటిలో చేయి తిరిగిన చిత్రకారుని కుంచె కదలికలు కనిపిస్తాయి.