వైశాఖమాసం నిప్పులు చెరిగే ఎండ. భానుడు చండ ప్రచండంగా వున్నాడు. వడగాలి వీస్తోంది. చెట్ల మీద పక్షులు నీటికి అల్లల్లాడే పరిస్థితి.హైవే మీద టాటా ఇండికా కారు వెళ్తోంది. ఇరువైపులా వస్తూ పోతూ వున్న వాహనాలు తప్పించి ఎక్కడా పిట్ట మనిషి కనపడడం లేదు. రోడ్డు మీద వేడి ఆవిరులు.ఆ సమయంలో ఆ టాక్సీలో అమలాపురం నుంచి వైజాగ్‌ బయల్దేరిన ఎనభై నాలుగేళ్ళ శాంతమ్మ, ఇంటర్మీడియట్‌ చదువుతున్న ఆమె మనవడు వెంకు వున్నారు.

తెల్లవారి అమలాపురంలో బయల్దేరిన కారు సుమారు అనకాపల్లి దాటి వైజాగ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ జోన్‌లోకి ప్రవేశించింది. నాలుగు లైన్ల రోడ్డులో అడుగడుగునా ఎన్నో అవాంతరాలు దాటి ఇంకా ముప్ఫై కిలోమీటర్ల దూరం ప్రయాణించి వైజాగ్‌ చేరవలసి వుంది.వెనక సీట్లో నిస్త్రాణగా, స్పృహ లేకుండా కట్టెల మోపులాగా పడి వుంది శాంతమ్మ. ప్రతి క్షణం ఆమె వైపు చూస్తూ బెంబేలెత్తిపోతున్నాడు వెంకు. నాన్నమ్మ ఏమైపోతుందేమోనని భయం, ఆందోళనలో టెన్షన్‌గా వున్నాడు. మాటి మాటికి అతడి నోరు పిడచ కట్టుకుపోతోంది. చాలా సార్లు అమలాపురంలో వున్న తండ్రికి ఫోను చేస్తూనే వున్నాడు.

‘‘ఏం ఫరవాలేదురా. పెద్దనాన్నకి ఈ రోజు సెలవు. ఇంట్లోనే వున్నాడు. వెళ్ళగానే నాన్నమ్మకి కావలసిన వైద్య సదుపాయాలు చూస్తాడు. నువ్వేం గాబరాపడకు’’ అని వెంకు తండ్రి చెబుతున్నాడు.వెంకుకి ఆ మాటలు నచ్చడం లేదు. అసలు ఈ పద్ధతే నచ్చలేదు. ఇంత ఎండలో నాన్నమ్మని తీసుకుని పెదనాన్న ఇంటికి చేర్చడం అసలు ఇష్టం లేదు. అతడికి కోపంగా వుంది. చికాకుగా వుంది. భయంగా వుంది.పాత డొక్కు కారు. చవగ్గా వస్తుంది కదా అని తక్కువకి మాట్లాడి తండ్రి పంపించాడు. ప్రతి ఐదు కిలోమీటర్లకి ఒకసారి ఏదో ఒక పెంట పెడతూనే వుంది ఏసి లేదు. గేర్లు సరిగ్గా పడవు. ఏభై కి.మీ. మించి స్పీడు వెడితే ఇంజను వేడిక్కెపోతోంది. డ్రైవరు నానా తంటాలు పడుతూ తీసుకు వస్తున్నాడు.