‘మూలకాలన్నీ చేరి ఒక కణమై, ఆ కణజాలాలన్నీ వ్యవస్థయై, అది ఇంకొన్ని వ్యవస్థలతో చేరి రూపుదిద్దుకున్నదే హోమోసెపియన్‌ అనబడే నా రూపం. కోటానుకోట్ల సంవత్సరాల నిర్మాణం ఇది. ఉల్కాపాతాలూ, విద్యుద్ఘాతాలూ, కాస్మిక్‌ కిరణాలతో నగిషీలు దిద్దుకున్నది నా యీ రూపం.‘‘సమాజం అంటే ఏంటోయ్‌’’ అన్న స్వామి ప్రశ్నకు నాలో ఉబికిన ఆలోచనలివి. అవును నాలాంటి వందల వేల లక్షల కోట్ల మానవుల యుగయుగాల ప్రస్థానమే కదా సమాజం అంటే.... అదే చెప్పాను స్వామికి. నా సమాధానానికి కళ్ళెగరేసారాయన. నచ్చిందో లేదో తెలియలేదు.హాస్పిటల్‌ క్యాంటీన్‌లో టీ తాగుతూ ఉన్నాం మేం. ఆదిత్య వెంకటస్వామి నా సీనియర్‌ ఫిజీషియన్‌. ఆయనతో ‘టీ’కి రావడం బాగుంటుంది. న్యూస్‌ పేపర్‌ని అటూ ఇటూ తిరగేస్తూ, ఆ వార్తలను విశ్లేషిస్తూ సాగే సంభాషణం తేనీటి ఉద్దీపనతో మంచి జ్ఞాన ప్రవాహమే అవుతుంది. కొందరు స్నేహితులు సిగరెట్‌ పొగలతో ఆ ప్రవాహాన్ని అటూ ఇటూ ఎగదోస్తూ, మళ్ళిస్తూ వాడినీ, వేడినీ పెంచుతూ ఉంటారు.ఎందుకడిగాడా ఆ ప్రశ్న అనుకుంటూ పేపర్లోకి తొంగిచూసాను.

 ‘నా ఇటుక - నా అమరావతి’ శీర్షికతో రాజధాని నిర్మాణం గురించిన వార్త ఉంది. చదివి ఆయన ముఖం వైపు చూసాను. కళ్ళెగరేసాడు మళ్ళీ. ‘‘అంతే కద సార్‌ నా కణమే నా రూపం... నా ఇటుకే నా అమరావతి’’ చతురమైన సమాధానం ఇచ్చానని ఛాతీ పొంగించేసరికి, పిడికిలితో గుండె మీద తట్టాడతను. ఆ అభినందనను స్వీకరిస్తుండగా స్వామి ఆప్రాన్‌ జేబులోంచి డ్యూటీ మొబైల్‌ మోగింది. తీసి చూసుకున్నాడు. ‘‘ఊఁ! ఎమర్జన్సీ నుండి ... కేసు వచ్చినట్లుంది పద పద...’’ అంటూ భుజం మీద స్టెతస్కోపు సర్దుకుంటూ మళ్ళీ ఫోన్లో మాట్లాడుతూ బయల్దేరాడు. న్యూస్‌ పేపర్‌ మడిచి పెట్టి బిల్‌ చెల్లించి వేగంగా నడుస్తూ ఆయన్ని చేరుకున్నాను.‘‘బ్రెత్‌లెస్‌నెస్‌ కేసట. పద చూద్దాం హార్టో లంగో లివరో కిడ్నియో. ఏది కొట్టిందో ఆయాసంతో ఊడిపడింది కేస్‌’’ అంటూ స్వామి వేగం పెంచాడు. ‘‘అవును బాస్‌.. ఇందాక మీరన్న సమాజమూ, మానవ శరీరమూ ఒకే రకమైన నిర్మాణాలు కదా. ఏది దెబ్బతిన్నా అన్నిటికీ ముప్పే’’ అన్నాన్నేను ఆయన స్టైల్‌లోనే, ఇందాకటి అభినందనను కంటిన్యూ చేయమని భుజం ముందుకు వంచుతూ. ఈసారి తట్టకుండా ముందుకు తోసాడు

. ‘‘ఇవి ఆపి కేసులోకి పద’’ అన్నారు. ఇరవై నాలుగ్గంటలూ కేసులూ, వాటి క్లినికల్‌ ఫైండింగులతో తలమునకలయ్యే స్వామికి ఇతర విషయాల పట్ల ఇంత అవగాహన ఎట్లా వచ్చిందా అని అబ్బురం నాకు. స్వామిని వదిల్తే నలుగురు ఐయ్యేఎస్‌లకూ, నాలుగు పార్టీల నాయకులకూ నిర్మాణమూ రాద్ధాంతమూ అనే పొలిటికల్‌ సైన్సు పాఠాలు ఏకబిగిన చెప్పేస్తాడేమో! ఆ స్పీడు వున్నందుకేనేమో డయాగ్నొసిస్‌ ఇట్టే పట్టేస్తాడు. ఆయన వడిని అందుకునేందుకు నేను నడకను పరుగులోకి మార్చాల్సి వచ్చింది. కొందరి అడుగుజాడల్లో నడవాలనిపిస్తుంది. కొందరితో పక్క పక్కనే నడవాలనిపిస్తుంది. అదేంటో ఈయనతో ఆ రెండు పనులూ చేయాలనిపిస్తుంది.