అదొకరాయి. ఎక్కడో కొండల్లో కొండగా, బండగా బతికేస్తూ వుంటుంది. ఎవరో అనామకుడు పొట్టకూటికోసం దాన్ని రోలుగా మలుస్తాడు. ప్రాణంలేని వస్తువుగా మనింటికి చేరుతుంది. మన సరదాలు, కష్టాలు, కన్నీళ్లు అన్నీకూడా ఆ రాయి మౌనంగా చూస్తూ వుంటుంది. దానిది రాతిగుండె అయినా వెన్నలాంటి రుచుల్ని అందిస్తుంది.కాలం తెచ్చే మార్పులన్నింటికీ సజీవసాక్ష్యమైన రోలు నేడు కనుమరుగవుతోంది. మిక్సీలు, గ్రైండర్లు దాన్ని తరిమేశాయి. నగరాలు, పట్టణాల్లోంచి మాయమైపోతున్నా, ఇంకా పేదపల్లెలు మాత్రం రోలుని తమ గుండెల్లో దాచుకుంటున్నాయి.ఇక్కడ ప్రచురిస్తున్న రెండు కథలు రోలుకి సంబంధించినవే. అరిగే రామారావు రాసిన ‘మా ఇంటిరోలు’ కథలో తన జీవితంలోని సంఘటనలన్నింటినీ ఒక ఇల్లాలు రోలు జ్ఞాపకాల్లో వెతుక్కుంటుంది.అమెరికాలోని ఆంధ్రుడు జె.యు.బి.వి ప్రసాద్‌రాసిన ‘అమెరికాలో రుబ్బురోలూ కందిపచ్చడి!’ కథలో అమెరికాలో రోట్లో రుబ్బిన కందిపచ్చడి తినడానికి ఒక గృహస్థుపడిన అవస్థలు సరదాగా అనిపిస్తాయి. ఒకే ‘‘కథావస్తువు’’ చుట్టూ తిరిగిన యీ రెండు కథలనూ ఒకే చోట మా పాఠకులకు అందిస్తున్నాం. 

మన సంస్కృతితో ముడిపడివున్న ఎన్నింటినో చివరికి మనం కథావస్తువుల్లోనే వెతుక్కోవాలేమో!శనివారం మధ్యాహ్నం పూట.సుష్టుగా మా వరలకి్క్ష చేసిన వంట బాగా మింగి, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథల పుస్తకం తీసుకుని సోఫాలో నడుం వాల్చాను. అలా అలా చదువుతూ ఒక కునుకు తీద్దామని నా ప్లాను. కనీసం వారం చివరలోనన్నా కాస్త మధ్యాహ్నం నిద్ర పోకపోతే ఇంకెందుకమ్మా బతకడం! మా మేనమామ కొడుకులైతే మరీనూ! శనాదివారాల్లో మధ్యాహ్న భోజనం అవగానే ఠక్కున మంచం ఎక్కేస్తారు. పక్కనే బిల్‌ గేట్సున్నా సరే, వై.యెస్‌. రాజశేఖరరెడ్డున్నా సరే!!‘‘మీరు కాసేపు మా ఆవిడతోటో, పిల్లలతోటో మాట్లాడుతూ వుండండి. ఇపడే లేస్తా’’ అని చెప్పి ఒక రెండు గంటలసేపు సుఖంగా నిద్రోయేవారు.అందుకే ఆ టైంలో వాళ్ళింటికెళ్ళడం బొత్తిగా కిట్టేది కాదు నాకు. అది వేరే కథ.‘‘యావజ్జీవం హోష్యామి’’ అన్న శ్రీపాద వారి కథ చదవడం మొదలుపెట్టాను.‘‘ఇలా యెసట్లో బియ్యం పోసేసి అలా కందిపప రుబ్బితే యెవరయినా వద్దంటారా?’’ అన్న కథానాయకుడి మాటలు చదవగానే మనసంతా రుబ్బురోలు మీదకి పోయింది.