ఆమె మతం మారింది.. కన్న కొడుకు చేసిన నిర్వాకం ఇష్టం లేక మతం మారింది.. చనిపోయాక కూడా తనను కొడుకు ముట్టుకోకూడదనీ, అందుకు మతం మారడమే సరైన నిర్ణయమనుకున్న అమ్మ కథ ఇది.....

 నాకు నమ్మశక్యంగా లేదు.ఆమ్మ అలా చేసిందా? మహాలక్ష్మి పెద్దమ్మ... అదీ అరవై పైబడ్డాక!అమ్మకంటే దాదాపు పదేళ్ళు పెద్దది. పెద్దమ్మను మా ఊళ్ళవైపు ‘ఆమ్మ’ అని పిలుస్తాం.‘‘పెళ్ళికి వస్తుందిగా. నువ్వే మాట్లాడు’’ అన్నాడు నాన్న.తమ్ముడి పెళ్ళికని ఊరొచ్చాను. పెళ్ళి పెళ్ళికూతురు వాళ్ళ ఊళ్ళో. పెళ్ళి మర్నాడు మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం.నాకు ఆమ్మ దగ్గర చనువెక్కువ. నా చిన్నతనంలో నన్ను చాలా ప్రేమగా చూసేది. పెద్దయ్యాక ఎప్పుడోగానీ ఆమెను కలవకపోయినా ఎప్పటికప్పుడు నా బాగోగులు అమ్మనడుగుతూ ఉంటుందట.ఆమెకు ఒక కొడుకు, కూతురు.పెళ్ళయ్యాక కూతురు వైజాగ్‌లో ఉంటోంది.కొడుకు ఊళ్ళోనే ఉన్నా వేరు కాపురం పెట్టాడు. ఈ మధ్య పండగలకు పబ్బాలకు కూడా కలవడం లేదట. పెదనాన్న పోయాక, తల్లీ కొడుకుల మధ్య గొడవలు పెరిగి మాట్లాడుకోవటం కూడా మానేశారట.

మాట్లాడుకోనంతగా ఏం గొడవలు జరిగాయో ఎవరూ పూర్తిగా చెప్పడం లేదు. పొడిగా తలా ఓ ముక్క చెబుతున్నారు.అమ్మ నడిగాను.‘‘ఇద్దరి మధ్య ఏవో డబ్బు గొడవలట. అది నాక్కూడా సరిగ్గా చెప్పి చావదు’’ అంది. అంతకుమించి వివరాలు చెప్పలేదు. ఆమ్మ చేసిన పనికి అమ్మకు కూడా కోపంగా ఉంది.పెళ్ళికి పెద్దమ్మ రాలేదు.ఆమె కొడుకొచ్చాడు. కృష్ణన్నయ్య. నాకన్నా పదేళ్ళు పెద్దవాడు.పూర్తిగా పెద్దమనిషి తరహాలో ఉన్నాడు. తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు. కాస్త బట్టతలా, ఉబ్బిన మొహం. చిన్న కళ్ళు, ఒక మోస్తరుగా బొజ్జ.‘‘ఆమ్మ రాలేదేమిటన్నా?’’ అడిగాను.సమాధానం చెప్పలేదు.‘‘వస్తే బాగుండేది.’’నవ్వి, ‘‘నీ కబుర్లేమిటి. అక్కడే సెటిలౌతావా, ఇక్కడకొచ్చే ఆలోచనేమైనా ఉందా?’’ అడిగాడు.వాళ్ళ అమ్మ గురించి మాట్లాడ్డం ఇష్టం లేక మాట మార్చాడని అర్థమైంది.రమక్క గురించి అడిగాను. తన చెల్లెలు.‘‘రాలేదనుకుంటా’’ అన్నాడు నిరాసక్తంగా.అంటే చెల్లెలితో కూడా అంతగా పొత్తు లేదన్న మాట అనుకున్నాను.తర్వాత మాటలు ఉద్యోగాల వైపు కెళ్ళాయి. ఇప్పుడు తను సొంతంగా సీఏ ప్రాక్టీసు చేస్తున్నాడట. అమెరికా వాళ్ళ టాక్సుల పని చెయ్యడానికి ఒక చిన్న కంపెనీ కూడా మొదలెట్టాడట ఇంకో సీఏతో కలిసి. స్నేహితులతో కలిసి రియలెస్టేట్‌ వ్యాపారం కూడానట. కొత్త రాజధాని అమరావతి దగ్గర ఈ మధ్యనే కొన్న స్థలాల విషయం, విజయవాడలో అపార్ట్‌మెంట్ల సంగతి, సిటీలో తను నడిపే కార్ల గురించి చెప్పుకొచ్చాడు. ఆ మాటల నిండా ఘాటైన డబ్బు వాసన తగిలింది.