లుఫ్తారిజితో మద్రాసు నుంచి ఫ్రాంక్‌ఫర్టుకి అక్కడినుంచి చికాగోకి ప్రయాణం.తప్పనిసరి ప్రయాణం. ఇష్టం లేని ప్రయాణం. ఆనందంగా వున్నట్లుగా చేస్తున్న ప్రయాణం. ఇలా గాలిలోఎగురుతూ ప్రయాణం చేయడం ఇదిరెండోసారి. మొదటిసారి విమానంఎక్కుతున్నపడు ఎత్తయిన పర్వతశిఖారాన్ని అధిరోహిస్తున్నట్లు,జీవితంలో వున్నతమైన స్థానాన్నిఅందుకుంటున్నట్లు గర్వపడింది.చికాగో నగరాన్ని చూసి అబ్బురపడింది. భారత దేశం మరో వంద సంవత్సరాలుగడిచినా ఇంత అభివృద్ధి చెందలేదని, ఆంధ్రదేశం మారుమూల పల్లెటూరిలాగా వుంటుందని భావించింది. పిట్స్‌బర్గ్‌ ఆలయంలో కొడుకు మోహనకృష్ణ తను ప్రేమించిన అమ్మాయి నవతను పెళ్లిచేసుకుంటున్నపడు తన కొడుకు చాలా దశమంతుడని, సమానంగా చదువు కొని ఉద్యోగం చేస్తున్న ఆ అమ్మాయి తన పూజల పుణ్యఫలమని తలపోసింది.అసలు మోహనకృష్ణ అమెరికా వెళ్లడం ఎంతో అద్భుతమైన అంశం. అమెరికాలో చదువుతాడని, మంచి ఉద్యోగంలో స్థిరపడతాడని, తాను చికాగో నడి వీధిలో కాలు పెడుతుందని ఏనాడు అనుకోలేదు. జమ్ములపాలెంలో పుట్టిపెరిగి, బెంగుళూరులో కొడుకు ఇంజనీరింగ్‌ చదివినందుకే కొడుకు తెలివితేటలకి మహా మురిసిపోయింది. బెంగుళూరు స్నేహితులతో కలిసి అమెరికాలో పై చదువులు చదువుతానంటే, తాను ఆర్థిక పరిస్థితుల్ని అంచనా వేసుకుంటూ వెనకాడుతున్నపడు అమ్మ ప్రోత్సహించింది. 

వీసా వచ్చిందని మోహనకృష్ణ సంతోషపడితే అంతకంటే అధికంగా అమ్మ, తాను సంబరపడ్డారు. పై చదువుల కోసం బ్యాంక్‌ అపలిస్తుం దంటే ఎక్కడ కావాలంటే అక్కడ ఆలోచించకుండా సంతకాలు పెట్టారు. బాపట్లలో మద్రాసు ఎక్స్‌ప్రెస్‌ ఎక్కించి భారమైన గుండెలతో వెనుదిరిగారు. ‘పిచ్చి తండ్రి సముద్రాలు దాటి దూరంగా వెడుతున్నాడు. మళ్లీ ఎప్పటికి కనపడతాడో’ అనుకున్నపడు ఆ మాటే అమ్మ పైకి అన్నపడు ‘వాడిని చల్లగా చూడమని’ వెంకన్నను వేడుకొని గుండెల్ని తేలకపరుచుకున్నారు.ఆ తర్వాత అమ్మ వాడికోసం, ఎంత బెంగపడిందో? వాడి దగ్గర నుంచి సరిగా కబురు అందక, ఎవర్ని అడగాలో అర్థంకాక, ప్రతిక్షణం బాధపడింది. ప్రతిపూట ప్రతి అన్నంమెతుకుని వాడిని తలుచుకుంటూ మింగేది.అమ్మకి వాడంటే ఎంత ప్రేమ? అమ్మమ్మగా వాడికి ఎన్ని సపర్యలు చేసింది? ఐదు రోజుల పసిగుడ్డుకు నూనెరాసి, నలుగుపెట్టి స్నానాలు చేయించింది. ఆనాటి నుంచి వాడు ఇరవై ఒకటవ ఏట అమెరికా వెళ్లే వరకూ వాడు ఎపడు పాలెం వచ్చినా వదిలేది కాదు. నలుగుతో స్నానం చేస్తే మెరుపు వస్తుంది, నునుపు వస్తుందంటూ వాడు వద్దని మొత్తుకుంటున్నా, వినకుండా లాక్కెళ్లి ముక్కాలి పీట మీద కూచోపెట్టి నలుగుతో స్నానం చేయించేది. ఆ తర్వాత సాంబ్రాణి ధూపం వేసి, వాడిని చూసుకొని మురిసిపోయేది. ఇరుగు పొరుగు దిష్టిపెట్టారని, తన దిష్టి కూడా తగిలిందని ఉప కల్లుతో దిష్టి తీసేది.