పనివేళ ముగిసిందని సూచిస్తూ ఆ ఫ్యాక్టరీ సైరన్‌ ఓ నిమిషంపాటు కూసింది.రోజూ ఉండేదే అయినా చెట్లపైనున్న పక్షులన్నీ బెదిరి పైకెగిరి రెక్కలు రెపరెపలాడిస్తూ మళ్లీ చెట్టుకొమ్మలని చేరాయి. ఉద్యోగస్తులను నిర్మొహమాటంగా, నిర్దాక్షిణ్యంగా తొలగించే ఆ ఫెర్టిలైజర్స్‌ కంపెనీలో పనిచేసే చాలామంది నిత్యం ఆ పక్షుల్లానే బెదురుతూ బతుకులీడుస్తుంటారు. సైరన్‌ కూసిన కాసేపటికి సదరు బెదురుజీవులు ఒక్కొక్కరుగా వెలుపలికి రాసాగారు.

అర్ధగంట గడిచాక, దాదాపుగా అందరూ వెళ్లిపోయాక, ఆవరణలో కుడివైపుగా విసిరేసినట్టున్న డెలివరీస్‌ డిపార్ట్‌మెంట్‌ నుండి ఒక్కడే బయటికొచ్చాడు రాజు.అతని గుండె దడదడలాడుతోంది. అందరితోపాటు వెళ్లనీయకుండా ఆఖరి నిమిషంలో అర్జెంట్‌ పనుందని ఆపేసిన సూపర్‌వైజర్ని తిట్టుకుంటూ గేట్‌కేసి నడుస్తుంటే, ముందు తనమీద తనకు జాలి కలిగింది. ఆ తర్వాత ఎవరిమీదో తెలీదు కానీ కోపం తన్నుకొచ్చింది.‘ఇలా భయపడుతూ ఎన్ని రోజులు బ్రతకడం’ అనుకున్నాడు. సత్యకి కూడా అనుమానంగా ఉంది. ‘ఏంటి అదోలా వుంటున్నావు? ఆఫీసులో ఏదన్నా ప్రాబ్లమా!’ అంటూ ఈ మధ్య ఒకటే ప్రశ్నలు. ఏమని చెప్పాలి? పనికి వెళ్లి రావడం దినదిన గండంగా తయారైందనా? ‘నేనింక ఈ ఉద్యోగం చెయ్యలేను సత్యా’ అని ఎన్నో సార్లు నోటిదాకా వచ్చినా ఆపుకున్నాడు. 

చొక్కాలు మార్చినట్లు ఉద్యోగాలు మార్చగలిగే అర్హతలు కానీ, అనుభవం కానీ తనకి లేవు మరి.గేటు వద్ద సెక్యూరిటీ చెక్‌ ముగించుకుని రోడ్డుమీద పడేసరికి నల్లటి మబ్బులు ఆకాశానికి గొడుగు పట్టేసి వున్నాయి. అప్పుడొకటీ ఇప్పుడొకటీ చినుకులు పడసాగాయి. రాజు గుండెలో దడ మొదలయింది. అయినా ఏ మూలో చిన్న ఆశ.‘వర్షమొస్తుందని ఈ రోజు కాస్త ముందే వెళ్లిపోయుంటాడేమో’ అనుకుంటూ... హారర్‌ సినిమాలో కనబడబోయే తర్వాతి దృశ్యాన్ని కళ్లకడ్డుపెట్టుకున్న చేతివేళ్ల సందుల్లోంచి తొంగిచూసే పిరికి ప్రేక్షకుడిలా... గేటు పక్కకో దొంగచూపు సారించాడు.అదృష్టం వెక్కిరించిందతన్ని.ముసలాడు అక్కడే ఉన్నాడు.రాజు గుండెలో రాయి పడింది. వళ్లు వణికింది. కాళ్లు కదల్లేదు. నేలలో పాతేసినట్లు ఎక్కడివాడక్కడే నిలబడిపోయాడు.అక్కడికి వంద గజాల్లోపే ఉన్న బస్టాప్‌ చంద్రగోళమంత దూరంలో ఉన్నట్లనిపించింది. దూరంగా సిటీ బస్సు వస్తూ కనబడింది. అడుగు అటువైపు వేసే ధైర్యం మాత్రం రావటం లేదు. ఈ బస్సు వెళ్లిపోతే మరోటి ఇప్పుడే రాదు. అవతలేమో వర్షం ముంచుకొస్తోంది.