ఈ రోజు జానకి రామయ్య, జానకమ్మ గార్లపెళ్లిరోజు.డిసెంబరు తొమ్మిది, ఆదివారం.నలభై అయిదు వసంతాల సహజీవన గమనం;ఏడడుగులతో మొదలైన అలుపెరగని పయనం;జీవన సంధ్య నిశ్శబ్దంగా కుంగుతున్న సమయం.ఎక్కడో ఖండాంతరాల్లో వుంటున్న చిన్న కొడుకు. లేటుగా నిరుడేపెళ్లి చేసుకుని విశాఖపట్నంలో ఉంటున్నచిన్న కూతురు.ఇదే వూళ్లో, ఇదే ఇంట్లో కింద వున్న పోర్షన్లలోవేరు వేరు కాపురాలుపెట్టుకుని వుంటున్న పెద్దకొడుకులిద్దరూ.ఇంటి పై భాగంలో రెండు గదులు వేసుకుని నెలా నెలా వచ్చే పెన్షన్‌ డబ్బుల్తో, విడిగా ఇంత వుడకేసుకుని తింటూ, కృష్ణా రామా అనుకుంటూ, వారి మానాన వారు కాలం గడుపుతున్న వృద్ధ దంపతులు.వచ్చిపోయిన ఎన్నో పెళ్లిరోజుల్లాగే ఇది మరో పెళ్లి రోజు.

కన్నవారయినా, వారు కట్టుకున్న వారయినా, వీరు కన్న పిన్నవారయినా మొక్కుబడిగా పొడిపొడిగా చెప్పే గ్రీటింగ్స్‌...ఈ రోజు కూడా గత పెళ్లిరోజుల్లాగే నామమాత్రంగా, సాదాసీదాగా గడిచిపోవలసిన రోజే!ఆఖరికి ఈ రోజు ఉదయం పదిగంటలకు కూడా అలాగే గడిచింది! ఎటొచ్చీ పదిన్నర నుంచి రసవత్తరంగా, రమ్యంగా మలుపు తిరిగింది. దీనికి సూత్రధారి అమెరికాలో వుంటున్న చిన్న కొడుకు నరేష్‌. అందుకే ఈ కథ...టైం పదిన్నరయింది. ఫోను దీర్ఘంగామోగింది. ఇంటర్నేషనల్‌ కాల్‌. అమెరికా నుంచి చిన్న కొడుకు. కొడుకు, కోడలు, మనవలూ వీరికి హేపీ మేరేజ్‌ డే గ్రీటింగ్స్‌ చెప్పారు.నరేష్‌, ‘‘మమ్మీ! మీ మేరేజ్‌ని ఎలా సెలబ్రేట్‌ చేస్తోన్నారు?’’ నవ్వుతూ, సరదాగా అడిగాడు.‘‘ఏం వుంది నాయనా! ప్రతి యేడు లాగే మీ నాన్న వూళ్లోని గుళ్లూ గోపురాలన్నీ తిప్పించి అభిషేకాలూ, అష్టోత్తరాలూ చేయించి ఇదిగో ఇపడే ఇంటికి తీసుకొచ్చారు. తిరిగి తిరిగి శోష వచ్చి ఇదిగో ఇలా కూలబడ్డా. ఇంతలోకి మీ ఫోను!’’ నీరసంగా అంది.‘‘ఒక ఆటోనన్నా ఎంగేజ్‌ చేసుకోపోయారా మమ్మీ’’‘‘అయ్యో రాతా! ఎక్కే బస్సూ, దిగే బస్సూ. చిల్లర పైసల దగ్గర వాళ్లతో ఈయనగారి పేచీలూ! అడగొద్దురా తండ్రీ!’’అవతల్నుంచి నవ్వులు.‘‘ఈరోజు మీ లంచ్‌ ప్రోగ్రాం ఏంటత్తయ్యగారూ?’’ అమెరికా కోడలు నవ్వుతూ అడిగింది.‘‘ఒకటే ప్రోగ్రాం తల్లీ! ఇపడు ఎసట్లో బియ్యం పోసుకోవాలి. కింద నుంచి కోడళ్లు కూరలు పంపిస్తామన్నారు’’