డెబ్భైఐదేళ్ళు నిండిన నా వయసుకి డైమండ్‌ జూబిలీ.. యాభైఏళ్ళ మా వైవాహిక జీవితానికి గోల్డెన్‌ జూబిలీ... గొప్ప వేడుకల్నే ఏర్పాటు చేశారు మా అబ్బాయీ...కోడలూ... అమ్మాయీ... అల్లుడూ... మనవలూ మనవరాళ్ళూ...అమెరికాలోనే ఉన్న మా తమ్ముళ్ళూ.... మరదళ్ళూ... చెల్లెళ్ళూ... బావగార్లూ.... వారి కొడుకులూ... కోడళ్ళూ; కూతుళ్ళూ... అల్లుళ్ళూ... వారివారి పిల్లలూ... ఇతర బంధువులూ... స్నేహితులూ.... నాతో యూనివర్సిటీలో పనిచేసిన సహాధ్యాయులూ.... ఎక్క డెక్కడో మంచి మంచి పొజిషన్లలో స్థిరపడిపోయిన నా స్టూడెంట్లూ..., విశ్రాంత ప్రొఫెసర్‌గా ఇప్పటికీ వారానికి రెండుసార్లు యూనివర్సిటీకి వెళ్ళి పాఠాలు చెబుతుంటాను కాబట్టి... ఇప్పటి నా స్టూడెంట్లూ... రీసెర్చి స్కాలర్లూ... బంధుప్రీతితో... ప్రేమతో... అభిమానంతో... వాత్సల్యంతో... గౌరవంతో... వచ్చిన అందర్నీ చూస్తుంటే ఉద్వేగంతో కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.ఎక్కడి వాళ్ళం ఎక్కడికి తేలామా అనిపిస్తోంది.మేము ఆరుగురు అన్నదమ్ములం. ముగ్గురు అక్క చెల్లెళ్ళు. అందరిలో నేనే పెద్దవాడిని. మా అందరిలో చిన్నది మా చెల్లెలు, దానికి మొన్నే యాభై ఏళ్ళు నిండాయి.మాది బందరు. మధ్య తరగతి కుటుంబం. దేవుడి దయ, అమ్మా, నాన్నల చలవ... అందరం జీవితాల్లో హ్యాపీగా సెటిలయ్యాం.నాన్న బ్యాంకులో పని చేసేవారు. బందరు నుంచి మూడేళ్ళకోసారి ట్రాన్స్‌ఫర్లతో చాలా ఊళ్ళు తిరిగారు. ఆయన జీతం జస్ట్‌ ఇంటి అద్దెలకే... చిన్ననాటి మా చదువులకీ... పాలకీ మాత్రమే సరిపోయేది. అమ్మకి స్త్రీ ధనంగా ఆరెకరాల భూమి... చెప్పుకో దగినంత గానే వెండి బంగారాలూ ఇచ్చారు మా అమ్మమ్మ వాళ్ళు. 

మేము పెరిగి పెద్ద అవుతున్నకొద్దీ.. ఎకరం ఎకరం చొప్పున పొలమూ... వెండి బంగారాలూ అమ్మేసేది అమ్మ. ఆ సొమ్మే మా తిండి ఖర్చులకీ.. పెద్ద చదువులకీ.. హాస్టళ్ళకీ పండగ పబ్బా లకీ... బట్టలు కొనడానికీ ఉప యోగపడేది.అమ్మా... నాన్నలతో, ఇంటికొచ్చే స్నేహితులూ.. బంధువులతో మా అన్న దమ్ములూ, అక్క చెల్లెళ్ళూ అంతా చాలా సంతోషం గడిపేవాళ్ళం. నాన్న రిటైర్‌ కాగానే వచ్చిన ప్రావిడెంట్‌ ఫండ్‌ పెట్టి ఇద్దరు చెల్లెళ్ళకీ పెళ్ళిళ్ళు చేశారు. ఎమ్మెస్సీ... పీహెచ్‌డీ చేసిన నాకు టాటాస్‌లో ఐదొందల యాభై రూపాయల జీతంతో ఉద్యోగం దొరికింది.‘ఒరే రామూ... నీకు దేవుడి దయవల్ల ఉద్యోగం దొరికింది. పాతికేళ్ళు నిండాయి. మంచి సంబంధం వచ్చింది. మాధవరావుగారి అమ్మాయిని పెళ్ళి చేసుకుని ఉద్యోగంలో జేరు అన్నారు నాన్న. అమ్మా... నాన్నల మాట నాకు శిరోధార్యం. అలాగే సునందని పెళ్ళి చేసుకుని జంషెడ్‌పూర్‌ టాటాస్‌లో జాయినయ్యాను. ఆ తర్వాత ఆర్నెల్లకి... నాకు చాలా ఇష్టమైన రీసెర్చికి ఫెల్లోషిప్‌తో సహా అమెరికాలో అవకాశం వచ్చింది.