గీతిక చాలా బాగా పాడుతుంది. ఆమెకి పాడడమంటే ఇష్టం. పాటంటే ప్రాణం.ఆ అమ్మాయికి పదిహేనేండ్లుంటాయి. టెన్త్‌లో ఉంది. బాగా చదువుతుంది కూడా. పాట, చదువు రెండూ రెండు కళ్లులాంటివి ఆమెకు.కమ్మని గాత్రం ఆ పాపకు దేవుడిచ్చిన వరం. ఆమె గుండె చప్పుడు కూడా లయబద్ధంగా ఉంటుందనిమెచ్చుకుంటారట.గీతిక పాడితే-పాటలోని పల్లవికే ప్రాణం లేచొస్తుంది. పంట చేలువ్యయారంగా నర్తిస్తుంది. పైరగాలి హుషారుగా గంతులేస్తుంది. సెలయేటి కెరటాలు సవ్వడిమాని తీరం ఎదపై సేదదీరుతాయి. కోయిలమ్మ కూత మరచి కొమ్మ ఒడిలో విశ్రమిస్తుంది.అంత కమ్మని గాత్రం ఆ అమ్మాయిది!గీతిక పుట్టకముందే వాళ్ళమ్మ రాగిణి ఎదలోగిలిలో మొదట పాటే ఊయలలూగింది. రాగిణికి సరిగమలు పలికించడం తెలుసు. చరణాల స్పర్శతో స్వరాల్ని సవరించడం తెలుసు.రాగిణికి నలుగురి నడుమ పాడాలని ఉండేది. పాటతో కరిగి పరవశించాలని ఉండేది. కుదర్లేదు. ఆట పాట వంకతో ఆడపిల్ల పది మంది ముందు వేదిక లెక్కడం, కచేరీలు చేయడం ఆమె నాన్నకి ఇష్టం ఉండేదికాదు. సనాతన ఆచారాలు, సంప్రదాయాల మడి కప్పుకున్న ఆ తండ్రికి తన కూతురు పాడడం అయిష్టంగా ఉండేది.

 ఇంట్లో కూనిరాగం వినపడ్డా మందలించేవాడు. కూతురి ఆశల రెక్కల్ని ఆదిలోనే తుంచేసాడు.అలా ఓ కమ్మన్నైన పాట రాగిణి గుండె గొంతుకలోనే కలగా ఒదిగి పోయింది. ఆమె కన్నీటి ఊటల మాటున మసకబారింది. పెళ్లి, పిల్లలు, బాధ్యతల మధ్యన రాగిణి రాగాలాపన అనవరతం ఆలాపనగానే మిగిలిపోయింది.చెదిరిన వర్ణాలు ఆకాశపు అంచున చేరి రంగుల హరివిల్లై తిరిగి పొదగబడినట్టు...పగిలిన రాగిణి గానస్వప్నం-చక్కని పాటై గీతిక కంఠస్వరాన సప్తస్వర మధురిమగా జాలువారింది.రాగిణి తన పాపకి ‘పాట’ని ఉగ్గుపాలతో రంగరించింది. ‘పల్లవి’ని నుడికారంగా మలచింది. ‘చరణాల’ లాలితో జోలపాడింది.కూతురి పాటను తన పాటగా చేసుకొని మురిసి పోతుంటుందా తల్లి, భార్య అభిరుచికి ఆలంబనగా నిలబడ్డాడు సందీప్‌. తల్లీకూతుళ్ళ అభిప్రాయాలను ఏనాడూ వ్యతిరేకించలేదతను.గీతికను గొప్ప గాయకురాలిగా చూడాలన్నదే రాగిణి ఆకాంక్ష. అందుకు తగినట్టుగానే తల్లి సంరక్షణలో నిరంతరం సాధన చేస్తుందా అమ్మాయి.పాటల పోటీలు ఎక్కడ జరిగినా రాగిణి మిస్‌ చేయదు. కూతుర్ని పోటీలో నిలబెడుతుంది. వెంట తనుంటుంది. గీతిక పాల్గొందంటే ఫస్ట్‌ప్రైజ్‌ ఆమెని వరించాల్సిందే.అలాంటి తరుణంలో-ఓ ప్రముఖ టీ.వీ. ఛానెల్‌ వాళ్ళు నిర్వహిస్తున్న ‘పాడుతా - జూనియర్స్‌ కాంటెస్ట్‌’ షోలోకి ఎంటరయ్యింది గీతిక. తల్లిదండ్రుల ఆశలన్నీ కూతురిపైనే!ఎపిసోడ్స్‌ మీద ఎపిసోడ్స్‌ రసవత్తరంగా నడుస్తున్నాయి. గానప్రియుల చెవులన్నీ ఆ ప్రోగ్రామ్‌ మీదే. న్యాయనిర్ణేతలు ఏ పాట ఇచ్చినా అద్భుతంగా పాడి అందరి ప్రశంసలందుకుంటోంది గీతిక.