మొన్నమొన్నటిదాకా ఉద్యోగం రాలేదన్న బాధ ఉండేది. ఇంకా ఆ జ్ఞాపకాల మరకలు చెరిగిపోయినట్టే లేదు. ఎప్పుడూ తాజాగానే అన్పిస్తాయి. వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడే పదిహేనేళ్ళు దాటి పోయాయి. ఉద్యోగం లేకుండా రేయి పగలు కనిపించని దుఃఖాన్ని అనుభవిస్తున్న రోజుల్లో పుట్టిన పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. తోటి స్నేహితులతో సమానంగా మార్కులొచ్చినా అందరిలా పెద్ద కాలేజీల్లో, కోరుకున్న కాలేజీల్లో చదవలేక పోతున్నామన్న బాధ వాళ్ళ మొహాల్లో ఎప్పుడూ కన్పిస్తూ ఉంటుంది. మరి కొన్నాళ్ళు పోయాక ‘ఇన్నాళ్ళు ఉద్యోగం చేసి ఏం సంపాదించి పెట్టావ్‌?’ అని నిలదీస్తారేమో.వాళ్ళు నిలదీయడం మాట అలా ఉంచి కట్టుకున్న మనిషికి కూడా ఓపిక నశించినట్టుంది. ‘అచ్చటా లేదు ముచ్చటా లేదు ఇంకెప్పుడు సరదాలు? ఆయిమనంగ బట్ట కట్టింది లేదు. నగలూ నట్రా పెట్టిందీ లేదు. పొట్టకింత తినడం, పొద్దంతా బడి పోరగాండ్లతో ఒర్రడం తోటే బతుకంతా గడిచి పోతూంది. ఏ పేరం టానికో పోవాలన్నా చిన్నతనంగా ఉంటుంది. ఆ అమ్మా ఈ అమ్మా దిగేసి కొని వచ్చే సొమ్ము చూసి మసంత ఇదైపోతాంది.

 ఏ కార్యానికి పోవద్దనుకుంటెనేమో ఎల్తలేదాయె. పోతెనేమో.... అయి నోళ్ళ మాటలు, కానోళ్ళ మాటలు మనసుకంత కుచ్చుకోబట్టి. నవ్వే దాని ముందట నాదానై పోతాంటిని. సొమ్ము సోమందం లేకపోతె లేక పాయె. ఉండే ఇల్లన్న సొంతిల్లు లేక పాయె. ఉన్నో ళ్ళోమొ ఒక దానిమీద ఒకటి ఒకటే కట్టబట్టిరి. ఎట్లచూసినా అందరి కంటె తక్కువే ఉంటిమి. ఇగ ఎప్పుడయ్య నేను సుకపడేది?’ అని నిల దియ్య బట్టింది.‘అయ్యో... అప్పుడె బతుకంత అయిపొయి నట్టు అంత అదై పోతానవెందుకు? మనక్కూడ మంచి రోజులొత్తయిలే’ అని చాలాసార్లు చెప్పి ఊకుంచిన. ఈ మధ్య ఇంటిపోరు మరింత ఎక్కు వయింది. ఎట్లయితేంది. సొమ్ముల ముచ్చట తర్వాత చూడొచ్చుకని ముందు ఒక ఇల్లు కట్టు కుంటె బాగుంటదన్పించింది. పోరగాండ్లు కూడా పెద్దోళ్ళయితాండ్లు ఊకె కిరాయిండ్లు పోంటి తిరిగి తిరిగి అలిసిపోయినం. ఎప్పుడో చిన్నప్పుడొచ్చిన పట్నానికి! అప్పట్నుంచి అమ్మ, పసికందుల మయిన మమ్మల్ని పిల్లి తన పిల్లల్ని ఏడిండ్లు తిప్పినట్టు మమ్మల్నికూడా ఎన్నిండ్లు తిప్పిందో! మనక్కోపమొచ్చినా ఇంటోళ్ళకు కోపమొచ్చినా తట్టబుట్ట సదురుకొని మనమే పోవాలె. గట్లనే ఇండ్లు మారినం. ఇప్పటికీ ఇండ్లు మారుతనే ఉన్నం.