రాజమండ్రిలో రైలు దిగి, అక్కడినుంచి ఎక్స్‌ప్రెస్‌ బస్సులో రామచంద్రపురం వెళ్ళి బస్టాండులో వెయిట్‌ చేస్తే రోజుకు మూడు ట్రిప్పులు తిరిగే ఎర్రబస్సు వస్తుంది ఆ ఊరికి వెళ్ళడానికి. ఆ బస్సులో కూర్చుంటే మరో గంట సేపు ప్రయాణం!అమ్మ ఎప్పుడైనా పుట్టింటికి వెళ్దామంటే నాన్న ఎందు కంతలా విసుక్కునేవాడో మొదటి సారిగా అర్థమైంది నాకు. ఈ రోజుల్లోనే ఇలా వుందంటే అప్పట్లో ఇంకెలా వుండేవో సౌకర్యాలు? నాకు తెలిసీ నేనా ఊరికి నాలుగైదు సార్లు వెళ్ళుంటానేమో... అదీ బాగా చిన్నతనంలో మాత్రమే. ఆ తరువాతెప్పుడూ ఆ ఊరికి వెళ్ళలేదు. అమ్మకి ఆ ఊరినిండా బంధువులే అన్న సంగతి మాత్రం తెలుసు. నా చిన్నతనంలో తన ఊరినుంచి ఏ శుభలేఖ వచ్చినా, శుభకార్యానికి పిలుస్తూ చిన్నకార్డు ముక్క వచ్చినా అమ్మ ఎంతగా సంబరపడిపోయేదో ఇప్పటికీ నాకు బాగా గుర్తే. అలాంటి సందర్భాల్లోనే అమ్మతో ఒకటి రెండుసార్లు ఆ ఊరికి వెళ్లడం గుర్తుంది.ఆ తరువాత కొన్నాళ్ళకి పెద్దమావయ్య, చిన్న మావయ్యలు కూడా హైదరాబాద్‌ వలస వచ్చేయడంతో ఆ ఊరికి వెళ్ళడం దాదాపు తగ్గిపోయింది. 

ఏ ముఖ్యమైన శుభకార్యాలకో అమ్మ ఒక్కతే పిన్ని వాళ్ళతోనో మావయ్యలతోనే కలిసి వెళ్ళేది. వాళ్ళంతా మరీ బలవంత పెడితే నాన్న కూడా చాలా అరుదుగా వాళ్ళతో బయలుదేరేవాడు.ఈ మధ్యకాలంలో ఏ ఫంక్షన్లయినా కాకినాడలోనో రాజమండ్రిలోనో ఎక్కువగా హైదరాబాద్‌లోనూ జరుగుతుండడం వల్ల ఆ మాత్రం అవసరం కూడా కలగడం లేదు. ఇదుగో ఇప్పుడు... ఇన్నాళ్ళకి మళ్ళీ ఆ ఊరికి వెళ్ళాల్సిన అవసరం పడింది. అసలా పనికి ప్రత్యేకంగా పనిగట్టుకుని మేము రానక్కర్లేదు. కానీ అమ్మ పట్టుబట్టడం వల్ల బయలుదేరాల్సి వచ్చింది.నాన్న మీద కోపంతో ప్రయాణంలో దారిపొడవునా నాతో ముభావంగా వున్న అమ్మ రామచంద్రపురంలో బస్సు దిగగానే మొదటిసారిగా నోరు విప్పింది. కళ్ళింతలు చేసుకుని చూస్తూ చుట్టూ వున్న పరిసరాలని గమనిస్తూ ‘‘రాంపురవేనా ఇది? ఎంతగా మారిపోయింది?!’’ అంది.ఆశ్చర్యమో ఆనందమో తెలియని నవ్వుతో అమ్మ ముఖం వెలుగుతోంది. ఆ ఊరి పేరుని ఆమె పలికిన తీరుకి నవ్వొచ్చింది నాకు.‘‘నువ్వు చూసి దశాబ్దం పైనే అవుతోంది. మారదా మరి ఊరు?’’ అన్నాను నవ్వుతూ.‘‘ఇక్కడ బస్సుకోసం ఏం వెయిట్‌ చేస్తాం? టాక్సీ ఏమైనా దొరకుతుందేమో చూస్తాను’’ అన్నాను అక్కడినుంచి బయటికి కదలబోతూ.‘‘నీకూ మీ నాన్నకీ షోకులకేం తక్కువలేదు. గంట గంటకీ బస్సుందని శంకరం మావయ్య చెప్పాడు. టాక్సీఎందుకూ? అసలు నువ్వొద్దన్నావు గానీ, శంకరం మావయ్య రాజమండ్రి స్టేషనుకే వస్తానన్నాడు...’’ అంది అమ్మ. శంకరం మావయ్య అమ్మకి కజిన్‌ బ్రదర్‌.