ఆరేసుకోబోయి పారేసుకున్నాను... అమ్మగారూ! అంట్లెయ్యండి’’ అంటూ వచ్చింది శాయిలు ఉరఫ్‌ శిరీష. (శాయిలు పేరు బాగాలేదని శిరీషగా మార్చుకుంది)‘‘ఏమిటే! ఈ రోజు మాంచి ఉషారుగా ఉన్నావు?’’ అంది నీరజ గిన్నెలు సర్ది సింకులో వేస్తూ‘‘జానకమ్మగారూ! రేపు మేము చిరంజీవి కొత్త సినిమాకి మార్నింగ్‌షోకి వెడుతున్నాము’’ అంది ఆనందంగా బరాబరా గిన్నెలు తోముతూ ‘‘అంటే రేపు ప్రొద్దుట పనికి రావన్నమాట!’’ అంది నీరజ అత్తగారు శాంతమ్మ. డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చుని కాఫీ తాగుతూ ‘‘రేపొద్దుటే కాదు. రేపు సందేల కూడా పనికి రాను’’ అంది కోపంగా శాయిలు ఉరఫ్‌ శిరీష శాంతమ్మ గారికేసి చూస్తూ.‘‘ఏం పాపం! సాయంకాలం ఏమయిందట?’’ అంది శాంతమ్మ తాగిన కాఫీ గ్లాసు సింకులో పడేస్తూ.‘‘సినేమా వచ్చిన్నాడే పొద్దుటేల ఆటకి టిక్కెట్ల దొరకడం అంటే అంత ఈజీ అనుకున్నారేటి? క్యూలో నిలబడి ఎంత యుద్ధం చేయాల? కొప్పు ఊడిపోద్ది. జాకెట్టు సిరిగిపోద్ది’’ అంటూ యుద్ధ భంగిమలు అభినయించి మరీ చూపించింది.శాయిలు గిన్నెలు తోమటం తాత్కాలికంగా పక్కన పెట్టేసి. ‘‘అంత జాకెట్లు చింపుకొని వచ్చిన రోజే పని మానేసి మరీ సినిమా చూడడం అంత అవసరమా?’’ అంది సాగదీస్తూ శాంతమ్మ.‘‘అవసరమే. నాకు అవసరమే’’ కోపంగా అంది శాయిలు. 

గిన్నెలు విసురుగా శబ్దం చేస్తూ సింకులో పడేస్తూ ‘‘చిరంజీవి ఫాన్స్‌ మొదటి రోజు మొదటాట కెల్లకపోతే అవమానం కాదేటి? అయినా - ఇయ్యన్నీ మీకెందుకు? నేను అమ్మగారితో మాట్లాడుతున్నాను.అమ్మగారు రేపు నేను పనికి రాను’’ అంది తెగేసి చెబుతున్నట్లు. ‘‘అదట్లా నన్ను నిర్లక్ష్యం చేసి మాట్లాడుతుంటే చూస్తూ వూరుకుంటాదే?’’ కోపంగా అంది శాంతమ్మ.నిస్సహాయంగా ఇద్దరినీ చూస్తూ నిలబడ్డ కోడలిని చూస్తూ ‘‘అమ్మగారూ నేనెడతన్నా’’ అంటూ నీరజకి చెప్పి వెళ్లిపోయింది శాయిలు శాంతమ్మగారి వైపు నిర్లక్ష్యంగా చూస్తూ.‘‘నా ఖర్మ. పని వాళ్ళకి కూడా అలుసయిపోయింది నా బ్రతుకు’’ నెత్తి కొట్టుకుంటూ తన గదిలోకి వెళ్లిపోయింది శాంతమ్మ.చేసేదేమీ లేక సోఫాలో కూలబడి పోయింది నీరసంగా నీరజ. దాదాపు ప్రతిరోజు పని మనిషికి, అత్తగారికి యుద్ధం సీనే. తను, భర్త ఉద్యోగాలకి వెళ్లిపోతే ఇంట్లో మిగిలేది అత్తగారు. ఆవిడకు, పనిమనిషికి క్షణం పడదు. పనివాళ్లు ఆవిడని లక్ష్య పెట్టరు. నాకెందుకని ఈవిడ ఊరుకోదు. సాయంత్రం ఆఫీస్‌ నుండి అలసిపోయి ఇంటికి వచ్చేటప్పటికి సమస్య సిద్ధం. దీనికి పరిష్కారం ఎప్పటికో! నిట్టూర్చింది నీరజ.