అమ్మ మరణం నన్ను కుంగదీసింది. అంతకంటే అమ్మ తన శరీరాన్ని మెడికల్‌ కాలేజ్‌కు డొనేట్‌ చేయడం మరింత కుంగదీసింది. అమ్మ వీలునామా చదివాక ఎక్కువ బాధ కలిగింది. అందరి అమ్మల్లాగా మా అమ్మ ఎందుకు ఉండదో చిన్నప్పటి నుండి నాకు అర్థం కాదు. ఇప్పుడుకూడా అంతే, కడుపున పుట్టిన కొడుకు ఉండగా, వాడికి తలకొరివిపెట్టే అవకాశం లేకుండాచేయడం.. అసలు తనకు సంబంధం లేనివాళ్లకు ఆస్తి మొత్తం ధారపోయడం కొడుకుగా నా అస్తిత్వాన్ని,నా ఉనికిని లేకుండా చేశాయి.పెద్దమ్మ ఆమని, చిన్నమ్మ చేతన, మా అమ్మ అర్చన అక్క చెల్లెళ్ళు. ముగ్గురికీ కొడుకులే. పెద్దమ్మ కొడుకు వరుణ్‌, చిన్నమ్మ కొడుకు తేజ, నేను దాదాపుగా ఒకే వయసు వాళ్ళం. సెలవుల్లో అందరం బాగా ఆడేవాళ్ళం. వాళ్ళు మా ఊరికిరావడం, మేం వాళ్ళఊరుపోవడం. స్నేహితుల్లా కలిసిమెలిసి ఉండేవాళ్ళం.

అమ్మ ముందుగా వరుణ్‌, తేజల సౌకర్యం చూసేది. అంటే ముందు వాళ్ళకు కావలసినవి ఇచ్చేది. మిగిలినవి మాత్రమే నాకు. అదేమిటంటే, వాళ్ళు మన అతిథులుకదా అనేది. కానీ ఈ సూత్రం పెద్దమ్మ ఇంట్లో, చిన్నమ్మ ఇంట్లో నాకు అమలయ్యేది కాదు. చిన్నమ్మ, పెద్దమ్మ మా ఇంట్లో ఎంతో చొరవగా కావలసినవి తీసుకునే వాళ్ళు. కావాల్సిన వంటలు చేయించుకునే వాళ్ళు. మా అమ్మ వాళ్ళింట్లో పని చేయడంలో చొరవచూపించేది. కానీ ధైర్యంగా వాళ్ళింట్లో ఫ్రిజ్‌ తెరచి నాకు ఒక పండు ఇవ్వడానికి కూడా వెనకాడేది. మేము ముగ్గురు పిల్లలం. లంచ్‌ టేబుల్‌పైన రెండు బిర్యానీలుంటే, తన కొడుకు వరుణ్‌కు బిర్యాని ఇష్టం కాబట్టి రెండూ వాడే తినాలని కోరుకునే తత్వం పెద్దమ్మది. చిన్నమ్మ చేతన ఒక బిర్యాని తన కొడుకు తేజ తినాలి, ఇంకొక బిర్యాని నేను, వరుణ్‌ చెరిసగం పంచుకోవాలనుకునే రకం. ఇక మా అమ్మ అయితే వాళ్ళిద్దరూ చెరో బిర్యాని తింటారు. నీవు పప్పు అన్నం తిను, మన ఇంటికివెళ్ళాక కావలసినంత బిర్యాని చేసి పెడతా! అంటుంది. అమ్మ తీరు తన అక్కచెల్లెళ్ళ పిల్లల విషయంలోనేకాదు, ఎవరున్నా అంతే. ఆమె ప్రాధాన్యం నేనుకాదు. ఎప్పుడూ నాకు సర్దిచెప్పేది. ఇదీ అమ్మ తత్వం. అలాగని ఆమె నాకు ఏమైనా తక్కువచేసిందా అంటే అదెప్పుడూ లేదు. ఆమె ప్రాణమంతా నాపైనే. అన్ని బాధ్యతలూ నెరవేర్చాక అంత అలసటలో కూడా అమ్మ నా చదువు, ఆరోగ్యవిషయాల్లో ఎంతో శ్రద్ధ వహించేది. నాకు అన్నీ సమకూర్చింది. దాంతోపాటు ఎప్పుడూ పేదవాళ్ళు, అనాథలకు సహాయం చేయాలని కోరుకునేది. వాళ్ళకి బట్టలు కొనివ్వడం, ఫీజులు కట్టడం చేసేది. అమ్మను వాళ్ళు ఎంతో ప్రేమించేవారు, గౌరవించేవారు

. అమ్మ ప్రేమ నాకు మాత్రమే కాకుండా చాలామందికి ఇవ్వడం నాకు చాలా కినుకుగా ఉండేది. తర్వాత అమ్మ తత్వం అలవాటైపోయింది. మొదట్నుంచీ నాన్నతో నాకు చనువులేదు. ఆయన ఏ విషయం పట్టించుకోకుండా రాజకీయాల్లో తిరుగుతుండేవాడు. పొలం పనులు చూసుకునేవాడు కాదు. అవి కూడా అమ్మే చూసుకునేది. అమ్మకు నేను ఒక్కణ్ణే. దాంతో అమ్మకు నేను, నాకు అమ్మే ప్రపంచంగా ఉండేది. నా చదువుకోసం మా పల్లె వదిలి అమ్మ నగరానికి వచ్చింది. అప్పుడప్పుడు వెళ్ళి ఊర్లో పనులు చూసుకునివచ్చేది. మా ఊరికి చెందిన మోహన్‌సారే మా హైస్కూల్‌ హెడ్‌మాస్టారు. నాన్న స్నేహితుడాయన. నాన్న మమ్మల్ని ఆయనింటికి తీసుకెళ్ళాడు.

అదే నా జీవితంలో పెద్ద మలుపు. పిల్లలు లేని మోహన్‌సార్‌, ఆయన భార్య నన్ను చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఏక సంథాగ్రాహినైన నేను ఆయన గురుత్వంలో చదువులో ఎప్పుడూ ముందుండేవాణ్ణి. ఇంజనీరింగ్‌ ఐఐటి ఖరగ్‌పూర్‌లో, ఎమ్మైటిలో ఎమ్మెస్‌, నాసాలో ఉద్యోగం. నా ప్రతిభకుమెచ్చిన ఓ పెద్దవ్యాపారవేత్త అందమైన కూతురితో వివాహం..ఇలా నా జీవితం వడ్డించిన విస్తరిగా మారడానికి నూటికి నూరుపాళ్ళు నా తెలివితేటలు, కృషి అనే నమ్ముతాను. ఇన్ని సాధించినా, ఎంతో సంపాదించినా ఎందుకో నా తల్లిదండ్రులు నా ఉనికిని గుర్తించకపోవడం భరించలేకుండావున్నాను. చిన్నప్పటి అమ్మలాలన గుర్తొచ్చి మనసు కలతపడినా, ఆమె నన్ను వారసునిగా గుర్తించలేదన్న సత్యం గుర్తొచ్చి ఒకరకమైన ఉదాసీనత ఆవరించింది. ఈ ఊళ్ళో పొలాలతోపాటు ఇల్లు కూడా నాదికాదు. త్వరలోనే అవి చారిటీ ట్రస్ట్‌ ఆధీనంలోకి వెళ్ళిపోతాయి. ఇండియా రావడానికి ఇంక అక్కడ అమ్మానాన్న లేరు. నాదంటూ ఇల్లు, వాకిలి, పొలం లేదు. నా మనసు మనసులో లేదు. ఈ విషయం నా భార్యకు తెలియనీయలేదు.