‘మనిషన్నంక కాస్త సిగ్గుండాలె... పంచాతిపెడ్తరంట పంచాతి. రానియ్య రాదు. ఏ పెద్ద మనిషివొస్తడో ఏం చెపుతడో..’సుగుణమ్మ పొద్దున లేసిన దగ్గర నుంచి చిటపట లాడుతున్నది. ఆమె గుండె రగిలిపోతున్నది. ఆమె మాటలు తల్లి శాంతమ్మ వింటనే ఉంది. కొడుకుల ప్రవర్తనకు ఆమె ఉడికిపోతున్నది.సుగుణమ్మ చాయ గ్లాసు తీస్కపోయి భర్త రాంకిషన్‌రావు చేతికి అందించింది. ఆయన తోటకాడికి పోయి అప్పుడే వచ్చిండు. ముందు అర్రల మంచం మీద జారగీల బడి టీవి చూస్తున్నడు.రాంకిషన్‌రావు చాయి తాగుతుంటే ‘ ఆల్లకు మనకు సుట్టిర్కాలేం లేవు. గాడిద కొడుకులు నోటికొచ్చినట్టు మాట్లాడితే నువ్వేం ఊకోవాల్సిన పనిలేదు. పంచాతి పెట్టినోని మీద పావురమేంది.’ తమ్ముండ్ల గురించి చెప్పింది సుగుణమ్మ.రాంకిషన్‌రావు మనసు నిండా ఆలోచనలు. బైటికేం మాట్లాడలేదు.లోపటి అర్రల గడపకాడ కూసొని వింటుంది శాంతమ్మ.ఇయ్యాల తన కొడుకులు .... అల్లున్ని బిడ్డను ముద్దాయిలుగా చేస్తుంటే భరించ లేకపోతున్నది. కొడుకుల తల్చుకుంటే అరవైయేండ్ల శరీరం భయానికో అసహ్యానికోగాని వణుకుతున్నది.దీనికంతటికి కారణం తనేకదూ! తనేనా! శాంతమ్మ ఆలోచనలు పదేండ్ల వెనకకు పోయినయ్‌.

నల్లగొండకు నార్కట్‌పల్లికి నడుమ రోడ్డు పక్కన కొండ కిందిగూడెం. తను పుట్టింది అక్కన్నే. ఊర్ల సంబంధమే. సంసారం చేసింది అక్కన్నే. ఇద్దరుకొడుకులు, ఓ బిడ్డ.ఉండిలేని సంసారం . ముగ్గురు పిల్లల సాదడమే గగనమైపోయింది. పాలుకొచ్చింది ఏడెకరాలు. పసుపుకుంకుమల కింద తన తండ్రి ఇచ్చింది రెండకరాలు. అదీ ఒట్టి సౌట నేల. ఓ పంట పండేది కాదు. తిండి పెట్టేది కాదు. తన పెనిమిటి కన్నమ్మ కష్టాలు పడ్డడు. ఎట్ల గడిసిందో ఏమో సంసారం.... ఆ దేవునికే ఎరుక. పిల్లలు సర్కారు బల్లె సదువుకుండ్రు. పెద్ద మనిషైన రెండేండ్లకే బిడ్డ పెండ్లి చేసింది. మంచి సంబంధం పోతే దొరకదని.అప్పుడే ఉన్న ఐదెకరాలు అమ్మాల్సి వొచ్చింది. పెద్దోనికి సదువు అబ్బలే . పదైనంక రాజకీయాలు గొడవలని వాడెప్పుడు ఇంటి పట్టున ఉన్నోడు కాదు. చిన్నోని గీత బావుండి పంతులు ఉద్యోగమొచ్చింది. అయ్యాల తన భర్త ఎంత సంబూరపడ్డడని !ఎదిగొచ్చిన కొడుకులకు సంబంధాలు నడిచొచ్చినయ్‌. ఇద్దరికి పెండ్లిండ్లు అయినయ్‌.అసలు కత అప్పుడు మొదలైంది.చిన్నోడు సుదర్శన్‌ నల్లగొండలో కాపురం పెట్టిండు. పెండ్లమొచ్చినంక వానికి ఇంటి మీద ధ్యాసే పోయింది.పెద్దోడు కమ్యూనిస్టోల్ల వెంట తిరిగిండు. ఇంగ దాంట్లెనే ఆని బతుకు. యాడ గొడవలైనా వాడే. వానికీ పెండ్లం పిల్లలే లోకం. అమ్మ య్య యాదికి రాకుంట అయ్యిండ్రు. ఇద్దరు కొడుకులు ఉన్నారనే గని అమ్మయ్య ఉండ్రా సచ్చిండ్రా అని పట్టించుకో వటమే మరిచిండ్రు.