‘‘సూరి గాడేంటింకా నెగనేదూ?బారెడు బొద్దెక్కిపోనాదీ! బేగి నేపేసి ఇస్కూలు బడికి తోలియ్యె!’’ పారమ్మని కేకేసి, పన్లోకెళ్లాడు నరసింగు.పారమ్మ పనులన్నీ తెముల్చుకుని వచ్చి చూస్తే సూరీడింకా నిద్రలోనే ఉన్నాడు.‘‘ ఓలమ్మ నానేటి సేదునూ, ఈడింకా నెగిసిపోనాడే అనుకున్నాను.ఓరే, అయ్యా! సూరిగా, నెగురా! నీతొటోల్లంతా బల్లోకెల్లనానికి తెవిలి పోనారూ!’’ అంది పారమ్మ.మొదటి తండ్రి కేకేసినపుడే సూరీడుకి తెలివొచ్చీసింది.కానైతే-వాడికి బళ్ళోకెల్లాలని లేదు.ఒళ్ళంతా సలపరంగా ఉంది. దుప్పటి తలనిండా లాక్కుని ముసుగు తన్ని పడుకున్నాడు.ముడుమలు గెడ్డం కిందికి దన్ను పెట్టుకుని, పాదాలు చేతులతో పట్టుకునికాళ్ళూ చేతులూ కట్టి పడేసినట్టు ముటక దన్ని పడుకున్నాడు.తండ్రెళ్లిపోయేసరికి సూరీడుకి కొండంత ధైర్యం వచ్చిసిందిఎందుకంటే-‘స్కూలుకెళ్ళనని మారం చేస్తే తల్లి బతిమాలుతుంది. ‘బడికెల్లిపోరా నాయినా!’ అని సూరీడు రెండుసార్లు కాళ్ళూ చేతులు తన్నుకుని క్రిందపడి ఏడిస్తే- ఈ పూటకొగ్గీయే అంటే ‘అయితేరేపెల్లిపోరా! అయ్యికి తెలిత్తే సావసంపి సెవులు మూత్తాడు’ అని విడిచిపెడుతుంది.అపడు సూరీడు తుర్రున వీధిలోనికి పారిపోతాడు ఆడుకోవటానికి.‘తండ్రి పిచ్చిగానీ, ఆ బడికెందుకెల్లడమో?’ అనుకుంటాడు.మొదట్లో బళ్ళో జాయినయినపుడు ‘సర్దా’ గానే వెళ్ళాడు.కారణం తండ్రి కొత్త బట్టలు కుట్టించాడు. ఇస్కూలు బేగ్‌కొన్నాడు. కొత్తపలక కొన్నాడు. తెల్లపలక పుల్లలు పెట్టెతోకొన్నాడు. 

ఆ పలక పుల్లలకోసం నారయ్య కొడుకు ‘రామిగాడు’, సాకలి బుట్టోడి కొడుకు ఈరిగాడూ, సావుకారి గోవిందం కూతురు రత్నాలూ తనసుట్టూ తిరిగేవోరు. ఎంత ఇబ్బింత్రంగా ఉండేదో ఆ కవుర్లన్నీ తల్లికి సెప్పి, మురిసిపోడం, తల్లి పూరీణ్ణి జమీందారు కొడుకు నాగా సూడ్డం’ సూరిగానికెంతో ఆనందాన్నిచ్చేది.కానీ-ఆ పలకపుల్లల పాకెట్టయిపోవటం, పలకపుల్లలు కొనుక్కుంటానంటే ‘మొన్ననే డబ్బీడు పుల్లలు కొనిచ్చినాను. అపడే అయిపోయినాయా?’ అని తండ్రి గసర్డంతో సూరీడు చిన్నబుచ్చుకున్నాడు.ఇస్కూలు బడి కొచ్చినపుడందరికాడా డబ్బులుంటాయి. ఇంట్రబిల్లు ఇవ్వగానే స్వీట్ల జంగిడమీద ఈగల్లా పిల్లలందరూ అయిసుబండీసుట్టూ మూగుతారు. అయిసులు కొనుక్కుంటారు కొందరు సక్కిలాలూ కొందరు జాంకాయిలూ కొనుక్కుంటారు. తనకయితే జోబీలో సిల్లుగవ్వ ఉండదు’ సూరీడు బాధపడతాడు.వాడి మనసులో ఇంకా ఎన్నో బాధలు వాడికింకా ఎన్నో భయాలు.

అవి-‘పెతి సంవత్సరం అందరూ ఇస్కూలు యూనిఫారం కుట్టించుకుంటారు. సూరీడికి బళ్ళో జాయినయినపుడు తండ్రి బట్టలు కుట్టించాడు. ఆ తరవాతీ మళ్లా కుట్టించనే లేదు. తల్లి అంట్లుతోమే ఇంట్లో ఎవరోవాళ్ళ పిల్లల పాతబట్టలిస్తే అవి తెచ్చింది. వాట్నేసుకుని బడికెల్తే - అందరూ బుడబుక్కలోడని ఎగతాళి చేస్తారు. ఇంకోసారి ఇంకెవర్నో అడిగి తెచ్చిన బట్టలు తెచ్చింది. ఆ బట్టలయితే బగున్నాయి గానీ- ఆ నిక్కరు మధ్యలో చిరిగిపోవటం సూరిగాడు చూళ్ళేదు. కింద కూచోగానే టీచరమ్మ కిసుక్కున నవ్వింది. పిల్లలందరూ గొల్లున నవ్వారు. సూరీనికేడుపొచ్చి మధ్యాహ్నం స్కూలు కెళ్ళనని మొరాయించాడు. పారమ్మ జంగపు మల్లీను కాడకెల్లి నిక్కరు కుట్టించి తెచ్చింది.