మన సంస్కృతి- సమిష్టి కుటుంబం. మనం మాత్రం పూజలు, మ్రొక్కులు, భక్తి వగైరాలను- ఒంటిపిల్లి రాకాసులమై పాటిస్తూ- అదే మన సంస్కృతి అనుకుంటూ- ప్రచారం కూడా చేస్తున్నాం. శ్రీ కంఠా జ్యూయలర్స్‌ ఐదువేల రూపాయలు దాటి కొనుగోలు చేసినవారందరికీ ఓ లక్కీ డ్రా ప్రకటించినప్పుడు నాకీ విషయం మరోసారి స్ఫురించింది. డ్రాలో ప్రథమ బహుమతి- ఓ జంటకి ఉచితంగా ఆమెరికా యాత్ర కావడం అందుక్కారణం.నా సుపుత్రుడు ఆరేళ్లుగా అమెరికాలోనే సతీసుత సమేతంగా ఉంటున్నాడు. మధ్యలో ఓ రెండుసార్లు ఇండియా వచ్చి వెళ్లాడు. నా భార్య అరుంధతికి అమెరికా చూడాలన్న కోరికేం పెద్దగాలేదు కానీ- చుట్టుపక్కల వాళ్లూరుకుంటారా- మీ అమెరికా ప్రయాణమెప్పుడని ఒకటే సొద!కావడానికి పవిత్ర భారతనారి ఐనా- ఉపవాసం పేరు వింటేనే గడగడలాడిపోయే అరుంధతికి- ఇరుగు పొరుగులతో కబుర్లు లేకపోవడం కూడా కఠిన ఉపవాసం కిందే లెక్క. అమెరికాలో కబుర్లకి ఇరుగు పొరుగు లుండరని తెలిసినా- బొజ్జ (వి)నాయకులక్కూడా ఓట్లకోసం వరద బురద నీటిలో పాదయాత్రలు తప్పవు కదా- అలాగే ఇరుగుపొరుగుల కోసం అరుంధతికీ అమెరికా యాత్ర తప్పదనిపించింది. అందుకే తననోసారి అమెరికా తీసుకెళ్ళమని నోరువిడిచి అడిగింది పుత్రరత్నాన్ని.

ఎందరో పిల్లలు- తమ పిల్లల సంరక్షణ కోసం- తలిదండ్రుల్ని అమెరికా రప్పించుకుంటున్నారు కానీ- అదేమిటో మావాడు మాత్రం అందుకు సుముఖంగా లేడు. అక్కడ మీరొక్క రోజు కూడా ఉండలేరని భయ పెడతాడు. మేము భయపడకపోతే- తనకున్న అప్పులన్నీ తీరేదాకా- తీసుకెళ్లలేనని అసహాయత ప్రకటిస్తాడు. వాడి అప్పులెప్పుడు తీరతాయన్నదో చిక్కు ప్రశ్న. అమెరికా వెళ్లగానే కారు కొనడానికి అప్పు చేసాడు. అది తీరేలోగా ఇల్లు కొనడానికి అప్పు చేసాడు. అది ఇప్పట్లో తీరేది కాదట. ఈలోగ వాడి పెళ్లాం కూడా ఉద్యోగంలో చేరింది- ఆర్థికంగా వెసులుబాటు కోసం కాదు, కొత్త సరదాలకి కొత్త అప్పులు చేయడానికి. ఆ సరదాల జాబితాలో మా అమెరికా ట్రిప్పు చేరినట్లు లేదు.ఐనా సరిపెట్టుకునేవాళ్లమే- మావాడి అత్తమామలు అప్పుడే రెండుమార్లు అమెరికా వెళ్లి రాకపోతే! ‘‘మీ వియ్యంకుడూ, వియ్యపురాలూ వెళ్ళొచ్చారుటగా, మరి మీరెప్పుడు?’’ అని ఇరుగుపొరుగులడిగాకనే వాళ్ల మొదటి ప్రయాణం గురించి అరుంధతికీ, ఆమె ద్వారా నాకూ తెలిసింది.అప్పుడు అరుంధతి- మొగుడు కొట్టినందుక్కాదు, తోడికోడలు నవ్వినందుకన్నట్లు- కుమిలిపోయింది కానీ కొడుకుని నిలదీసేందుకు అభిమాన పడింది. ఈలోగా వియ్యాలవారు రెండోసారి అమెరికా వెళ్లొచ్చినట్లు మళ్లీ ఇరుగుపొరుగుల ద్వారానే వినేసరికి పుండుమీద కారం చల్లినట్లయింది తనకి.అప్పుడిక ఆగలేక- అభిమానం కూడా మరిచి కొడుకుని నిలదీస్తే, ‘‘వాళ్లు మమ్మల్ని చూడాలన్న అభిమానంకొద్దీ టికెట్‌ ఖర్చులు పెట్టుకునొచ్చారు. కూడా ఫారిన్‌ ఎక్స్‌ఛేంజ్‌ తెచ్చుకుని, ఇక్కడ మాకూ అవీఇవీ కొనిపెట్టారు. మీరలా కొనిపెట్టక్కర్లేదు కానీ, టికెట్‌ ఖర్చులు పెట్టుకోండి. నేనిక్కడ మిమ్మల్ని నెత్తిమీద పెట్టుకుని చూస్తాను’’ అంటూ మావాడు బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు.