వెంకట్రామయ్య ఈ కాలానికి చెందినవాడు కాదు. కొంచెం అహంకారం, మరికొంచెం క్రమశిక్షణ, ఇంకొంచెం చాదస్తం ఇవన్నీ కలిపి రంగరించితే వెంకట్రామయ్య అవుతాడని ఆయనంటే ఇష్టమున్నవాళ్ళు, ఇష్టంలేని వాళ్లు కూడా చెప్పే మాట. అయినా కూడా వృత్తి పట్ల ఆయనకున్న నిబద్ధత, శ్రద్ధ ఆయనను ఎవరూ వేలెత్తనివ్వకుండా చేశాయి.ఇంతకీ వెంకట్రామయ్య ఆ మండల కేంద్రంలో వున్న హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు. పిల్లలకు చదువు బాగా రావాలంటే క్రమశిక్షణ తప్పనిసరని నమ్ముతా డాయన. అలాగే గురువుని వేలెత్తి చూపడాన్ని ఎంతమాత్రం సహించడు.ఆ రోజు వెంకట్రామయ్య స్కూలుకు చేరుకునేసరికే మిగిలిన టీచర్లు ఆయనకు అభినందనలు చెప్పటానికి సిద్ధంగా ఉన్నారు. వెంకట్రామయ్యకు సన్నిహితంగా ఉండే లెక్కల మాస్టారు అయిన రాజేశ్వర రావు అందరి తరపున పూలదండ మెళ్లోవేసి విషయాన్ని బయటపెట్టాడు.‘‘ఈ సారి రాష్ట్రం తరపున ఉత్తమ ఉపాధ్యాయుడి పురస్కారానికి మీరు ఎంపికయినట్లు మెసేజ్‌ వచ్చింది. దాంతోబాటు అన్ని ఛానెళ్లు స్ర్కోలింగ్‌ ఇస్తున్నాయి. గత సంవత్సరం పదవ తరగతి ఫలితాలలో జిల్లాలో మన స్కూల్‌కు మొదటి స్థానం వచ్చేలా చేశారు.

ఇప్పుడు రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఉపాధ్యాయుల్లో మీరొకరు. మీ సహచర ఉపాధ్యాయులుగా ఇది మాకెంతో గర్వకారణం’’ అందరూ చప్పట్లు కొడుతుంటే. వెంకట్రామయ్య ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. గొంతు మూగపోగా కృతజతతో అందరికీ చేతులెత్తి నమస్కరించాడు.్‌్‌్‌‘‘వెంకట్రామయ్య గారికి ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు వస్తే వచ్చివుండొచ్చుగాక, ఆయన పిల్లలకు క్రమశిక్షణ పేరిట పెద్ద పెద్ద పనిష్మెంట్‌లు ఇవ్వటం, అలాగే పిల్లలకు చెప్పుకునే ఆవకాశం ఇవ్వకపోవడం మాత్రం సరికాదు’’. స్టాఫ్‌ రూంలో చర్చకు శ్రీకారం చుడుతూ అన్నాడు ఇంగ్లీష్‌ టీచర్‌ రాజేష్‌.‘‘ఆయన చదువుకున్నప్పుడు ఉన్న బోధనా పద్ధతుల్నే ఇప్పటికీ ఆయన కొనసాగిస్తున్నారు. అలా వద్దు మాస్టారు అంటే ఆయనకు కోపం వస్తుంది. నా ఉద్దేశంలో ఆయనలో కొంత ఆధునికత జోడయితే అది అందరికీ మంచిదని నా అభిప్రాయం’’ సైన్స్‌ టీచర్‌ పద్మ సాలోచనగా అంది.‘‘ఏదయితేనేం.. ఆయన ఎలాంటి పైరవీలు లేకుండా, ఎవరి సిఫారసులు లేకుండా కేవలం తన స్వశక్తితో ఈ అవార్డుకు ఎంపికయ్యాడన్నది మనం మర్చిపో కూడదు’’. తెలుగు మాస్టారు రాఘవయ్యగారు గుర్తుచేశారు.‘‘కానీ ఒక్కొక్కసారి ఆయన మొండివైఖరివల్ల మనం నష్టపోయామన్న సంగతికూడా మనం మర్చిపోకూడదు’’. అక్కసంగా అన్నాడు సోషల్‌ టీచర్‌ రాజారావు.‘‘బావుందండి.. మనం స్కూల్‌ వున్నచోట నివాసం ఉండం, క్లాసులు సరిగ్గా తీసుకోం, వీలయతే పిల్లలకే పనులు అప్పచెప్పుతాం, క్లాసు అవ్వగానే స్కూల్లోంచి మాయమైపోతాం. వెంకట్రామయ్య మాస్టారు వీటిని ఒప్పుకోరు. అవసరమైతే మన మెడలు వంచుతారు, ట్యూషన్లు చెప్పనివ్వరు. అందుకేగా మనకు కోపం ఆయనంటే...’’ ఉండబట్టలేక అన్నాడు లెక్కల మాస్టారు రాజేశ్వరరావు.