ప్రపంచంలో చెడ్డ భార్య, చెల్లి, కూతురు ఉండొచ్చు గానీ, చెడ్డ తల్లి ఉండదట ఎవరికైనా! తల్లి బిడ్డని కొట్టినా, తిట్టినా వాడి శ్రేయస్సుకే గానీ, ద్వేషంతోను పగతోను కాదుగా. డాక్టర్‌ ఇంజక్షన్‌ మన మీద కోపంతో ఇస్తాడా? అమ్మ ఔన్నత్యం గురించి ఎన్ని కథలు, కవితలు రాలేదూ!అంతటి గొప్ప అమ్మ. నాకు జన్మనిచ్చిన అమ్మ. ఈ రోజుచావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఇన్‌టెన్సివ్‌ కేర్‌లో ఒంటరిగా మృత్యువుతో పోరాడుతోంది. నిశ్శబ్దంగా....నిస్సహాయంగా బయట నిలబడ్డం మించి తనేం చేయలేకపోతున్నాడు.‘‘రోజూ పది వేలు కట్టడం, ఆవిడ్ని హింసపెట్టడం కాదు. డాక్టర్ని సరిగ్గా కనుక్కోండి పరిస్థితి ఏమిటో’’ సుధ ఉదయం నుంచి ఒకటే గొడవ.‘‘సరేలే’’ అన్నాడు గానీ తనకు కాలు చెయ్యి ఆడడం లేదు.చిన్నప్పట్నుంచీ అమ్మ తననెలా పెంచిందో పదే పదే గుర్తుకొస్తోంది. ఓ అన్నకు, అక్కకు, చెల్లెలికి, తమ్ముడికి మధ్య పుట్టాడు తను. అటు అన్నలా పెద్దరికం లేదు. తమ్ముడిగా గారాబం లేదు. అయినా ఏ చీకు చింతా లేదు. ఆ పల్లెటూర్లో ఏటి గట్టున తన బాల్యం, ఆడుతూ పాడుతూ గడిచిపోయింది. నాన్న ఓ చిన్న భూస్వామి. నాన్న ఆ అయిదెకరాల మాగాణీలో పండీ పండక ఎన్ని యాతనలు పడ్డా తమకే లోటు రానిచ్చేవాడు కాదు. తమందర్ని కష్టపడి చదివించాడు. అమ్మ ఏనాడూ నాన్న మాటకు ఎదురు చెప్పి ఎరగదు. మండువా లోగిలి దాటి అమ్మ వీధి మొహం చూడ్డం తనేనాడు చూడలేదు. నాన్నంటే అందరికీ భయం. ఆ ఊళ్లో నాన్న ఒక్కడికే ‘హంబర్‌’ సైకిలూ, దానికి ‘డైనమో లైటు’ ఉండేవి. నాన్న సైకిల్‌ బెల్‌ వినిపిస్తే చాలు ఎక్కడి వాళ్లం అక్కడ గప్‌చిప్‌ .

కొడుకులకు, కూతుళ్లకు అందరికి పెళ్లిళ్లు చేసాక, ఇక తను వచ్చిన పని అయిందనుకున్నాడేమో ఏమో ఓ రాత్రి అనాయాసంగా దైవ సాన్నిధ్యాన్ని పొందాడు. జన్మనీ, జీవితాన్ని ఇచ్చిన నాన్న పోయే నాటికి జ్ఞానాన్ని మించి తమకేం మిగల్చలేదు.ఉద్యోగరీత్యా తలో ఊళ్లో స్థిరపడ్డా, అమ్మ మాత్రం తన దగ్గరే ఉండడానికి ఇష్టపడేది. పెద్ద కొడుకు దగ్గరికెళ్లినా, చిన్న కొడుకు దగ్గరకెళ్లినా ఓ నెల్లాళ్లుండి వచ్చేసేది. వాళ్లవి పెద్ద కుటుంబాలు కావడంతో పాటు తనకక్కడ సౌకర్యంగా ఉండకపోవడం ఒక కారణం అయితే, తన స్వభావం మరో కారణం. ఇంకో కారణం సుధ. తనైనా ఎప్పుడైనా అమ్మని విసుక్కున్నాడేమో కానీ, సుధ అమ్మకు సకాలంలో అన్నీ చూసుకునేది.ఎనభై అయిదేళ్ల వయస్సులో కూడా తెల్లవారుజాము నాలుగు గంటలకు అమ్మ లేచి, స్నానం చేసి, దైవ నామస్మరణ చేసేది. ఉదయాన్నే లేచి అమ్మకు ఫిల్టర్‌ కాఫీ తనే కలిపి ఇచ్చేవాడు. దానికే అమ్మ ఎంతో మురిసిపోయేది. తను కొంత కాలంగా అమ్మను గమనిస్తూనే ఉన్నాడు. ఈ మధ్య అమ్మ సరిగా ఆహారం తీసుకోవడం లేదు. వయస్సు రీత్యా ఆకలి లేదేమో అనుకున్నాడు తను.