కిట్టమ్మని మొహం మీద వంద మాటలను, వెయ్యిరీతుల తిట్టు కిమ్మనదు, కమ్మనదు గాని కుక్కమీదనో, పందిమీదనో, పందిరిగుంజమీదనో పెట్టి సూటిపోటి మాటలు ఏమరుపాటునైనా సరే, ఎవరయినా సరే, అన్నారో....‘‘ఈ కుక్కసావ, ఎన్నిమాట్లు సీ కొట్టినా, మళ్లీ సిగ్గొదిలి ఈ బజార్నొస్తది. సీ,సీ... ఎదవజన్మ, దీని మొహానికి సింగారం గూడ, ఏయ్‌... సీ,సీ... ఛ... ఫో...’’ కిట్టమ్మ వీధిన పోతున్నపడు ఆమెను చూసో, చూడకో ఆ వడ్డెరగూడెపోళ్లు ఆడేగాని, మగే గానీ నోరు జారారో... ఇహ చూడండీ....

కిట్టమ్మ పోతున్నపని వదిలేసి, కొరకొర జూస్తూ, జుట్టు లాగి ముడేసి, నడుం చుట్టూ కొంగు తిప్పి, బొడ్లో దోపుతూ, చుట్టుపక్కల గుడిసెల్లోని పిల్లలు జడిసి, జ్వరాన పడేలా గద్దర గొంతుతో... ‘‘ఏ బాడుకావే నను సీ కొట్టేది? ఎవితే సిగ్గొదిలింది? ఎవరు పత్తిత్తో కులానికి తెల్వదానె బోసిడికె! ఎవరు సింగారిచ్చుకునేది, ఎవురెక్కడ చెంగొదిలేది జెనాలకి తెల్వదానె లవిఁడి ముండ! మీ జోలి కొచ్చినా, పాలికొచ్చిన్నా... నన్నెందుకు పీక్కుతింటరే... మీ గుడిసెల్ల పీనిగెల్ల...’’ ఆమె ఆగే ముచ్చటే లేదు. నోరు నొప్పెట్టి, తనంత తాను తగ్గాలే తప్ప ఎవరాపినా... ఆ ఆగమన్నోళ్లనీ లంకించుకొని కొత్తపురాణం ఎత్తాల్సిందే! అవతలివాళ్లు తప్పయిందని చెంపలేసుకునో, చేతులు పట్టుకునో వేడుకుంటే తప్ప, బరిలో నిల్చిన కోడిపుంజులా- చావో, బతుకో అన్నట్టు కిట్టమ్మ అంత కచ్చమనిషి! కంతిరి మనిషి!!చాటుమాటు గుసగుసలూ, ఎత్తిపొడుపులూ, మూతి విరుపులూ, ఓరగంట వంకర చూపులూ పసిగట్టిందో... ఆమె పడిగెత్తిన పామే! ససేమిరా నచ్చను గాక నచ్చదు.ఈ నచ్చని తనం ఆమెకు పుట్టకనుంచే ఉన్నదేం కాదు.మూడేళ్లకు ముందు తన పదహారేళ్ల పెద్దబిడ్డ కంకరమిల్లు సాయిలు మాటలకు బోల్తాపడి, వాని పాలయినపడు కూడా కిట్టమ్మ తలదించుకునే ఉంది. వాడు- బిడ్డని బెజవాడ బ్రోకరోళ్లకు అమ్మేసి, ఎవడితోనో లేచిపోయిందని బుకాయించినపడూ...‘మన బంగారం మంచిది కానపడు ....’ ధోరణిలో ఖర్మగా సరిపెట్టుకుని, కడుపులో తలపెట్టుకుని కుమిలిపోయిందే తప్ప, ఎవర్నీ పల్లెత్తు మాటన్నదీ లేదు. వీధికెక్కి వీరంగాలాడిందీ లేదు.