‘‘పెళ్లంటూ చేసుకొంటే సుమతి లాంటి అమ్మాయినే చేసుకోవాలి!’’ఆ మాటలకు కాఫీ తాగుతున్న సదాశివం ఉలిక్కిపడ్డాడు. కాఫీ పొలమారింది.‘‘నిజం! ఆమె నెవరు చేసుకుంటారోగానిఅదృష్టవంతుడు!’’ మళ్ళీ అన్నాడు ఆనందరావు. ఆనందరావు కాఫీ తాగడం ముగించి బిల్లుపుచ్చుకున్నాడు.సదాశివం అతన్ని ఆగమని సైగ చేశాడు.తేరుకుని అడిగాడు ‘‘ఇందాకఏమన్నావ్‌!’’‘‘సుమతిలాంటి అమ్మాయిని చేసుకునేవాడు అదృష్టవంతుడని’’‘‘కొంపదీసి ఆ అదృష్టం నీకు పట్టాలనికోరుకోవడం లేదుగదా!’’ సదాశివం హేళనగా అన్నాడు. ‘‘అయ్యో! నా మొహాన అంతఅదృష్టమా! సుమతిని చేసుకోవాలంటే పెట్టి పుట్టాలి!’’ సదాశివం హేళన అర్థంచేసుకోకుండా ఆనందరావు ఏదో లోకంలోఉన్నట్లు మాట్లాడుతున్నాడు.‘‘అయిపోయింది - అంతా అయిపోయింది - క్లీన్‌ బౌల్డు!’’ నిట్టూర్చాడు.‘‘ఈ ఊరికి ట్రాన్సఫరు మీద రాకపోతే సుమతిలాంటి అమ్మాయిలుంటారని ఊహించలేక పోయేవాడిని.’’ చెప్పాడు ఆనందరావు.‘‘ఆనందరావు ! నీకేం తెల్సని సుమతిని అంతగా పొగుడుతున్నావ్‌! నువ్వు పొట్ట చేత్తో పట్టుకుని ఈ ఊరికి వచ్చావు మహా అయితే ఓ సంవత్సరం ఉంటావు. వచ్చి నాలుగు నెల్లు కూడ కాలేదు అప్పుడే నువ్వు సుమతి మాయలో చిక్కుకున్నట్లున్నావు! జాగ్రత్త!’’ కోపంగా చెప్పాడు సదాశివం.‘‘మాయలో పడేటంత పసిపిల్లాడిని కాదు సదాశివం గారు!’’‘‘అదేనయ్యా మా బాధ ! పసిపిల్లాడివి అయితే నయానో భయానో చెబితే వింటావు.

వయసులో వున్నవాడివి! లోకం పోకడ తెలియనివాడివి ! ఉడుకు రక్తం తప్పించి ఆలోచన లేనివాడిని - పైగా ఒంటరిగా అఘోరిస్తున్న వాడివి! ఎక్కడ కాలు జారుతావో అని మా బాధ!’’ సదాశివం హెచ్చరిస్తూ బాధపడ్డాడు.‘‘నేనేం అంత పసోడ్ని కాదు - అయినా నా గురించి మీరు ఎక్కువగా బాధపడతున్నారేమోనని నా అనుమానం!’’ ఆనందరావు అనుమానించాడు.‘‘మరి నాతమ్ముడిలాంటి వాడివి! ఇక్కడ నీకెవరూ దిక్కులేరు - ఈ ఊళ్లో నీకు కావల్సిన వాళ్ళు ఎవరూ లేరు. అభం శుభం తెలియని వాడివి. ఈ మధ్యే కొత్తగా ఉద్యోగంలో చేరావు - కాస్త జాగ్రత్తగా మసలుకోవాలి! ఈ వయసులో ఏ ఆడపిల్లను చూసినా అందంగానే కనిపిస్తుంది. వయసు ఆకర్షణ అటువంటిది!’’‘‘సుమతి అందరిలాంటి ఆడపిల్ల కాదు సార్‌! చాకు - చాకు సార్‌! ఇక్కడ ఉండాల్సింది కాదు - ఏ హైద్రాబాద్‌లోనో - బాంబేలోనో ఉంటే చాలా పైకి వచ్చేది.’’ చెప్పాడు ఆనందరావు ఆకాశంలోకి చూస్తూ.‘‘నిజం ! బాగా పైకి వచ్చేది!’’ వ్యగ్యంగా అన్నాడు సదాశివం.సుమతి వాళ్ళ ఆఫీసుకు ఎదురుగా ఉండే ఫాన్సీ షాపులో సేల్సుగర్లుగా పనిచేస్తుంది. చాలా అందంగా చలాకీగా ఉంటుంది. తన మాటల చమత్కారంతో వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసింది. దానికి తోడు జిరాక్సు కూడా ఉంది. ఆ షాపులో జిరాక్సు కోసం చాలా మంది జనం వస్తూ ఉంటారు. వారందరితో మంచిగా మాట్లాడ్డం - వారిని గుర్తు పెట్టుకుని - పలకరించడం చేస్తూ ఉంటుంది. తను బీదరికం నుండి వచ్చినా అలా కన్పించకుండా జాగ్రత్త పడుతుంది.