ఉదయం ఆరుకు పులివెందుల బస్సెక్కాను. వెనువెంటనే తిరిగి రావాలని. ఎండంటే పరమ అసహనమేస్తోంది. అక్కడ మహా అంటే అరగంటపని. ఇరవై రెండువేల చేబదులు నేనుగా మిత్రుడికివ్వాల. అప చేయడానికి ఆలస్యమవుతుంది. తీర్చడానికెంత సమయం పడుతుంది? ఇంతకీ అపచేయడం గొప్పకళ అంటారు గానీ ఈరోజుల్లో డబ్బిచ్చిన వాడికి సరిగ్గా నిద్రపట్టకపోవడం గాక నిరంతరం మన బాగు కోరుకుంటుంటాడు. అది చాలదూ ఈ జన్మకు. పిరికితనంతో ఆత్మహత్యలుచేసుకోవడమెందుకు?యర్రగుంట్ల ఎపడు దాటి పోయిందో మతికి లేదు. ముద్దనూరు వచ్చేసింది. అది వదిలితే కనుమ. అందులో నాలుగు మలుపులు తిరిగి కిందికి దిగాక మల్లేల. ఇటు నుంచి, అటు నుంచిదాన్ని తల్చుకుంటే చాలు. మనసుకు రెక్కలొచ్చి మావూరి మీద వాలుతుంది. మల్లేల మీదుగా పడమటికి సింహాద్రిపురం రూటుంది. బూసుపల్లె, రాముల కొలను, సుంకేసుల, లావనూరు వగైరా పల్లెలు తగులుతాయి. అందులో సుంకేసుల మా సొంతూరు. ఇద్దరి అక్కగార్నీ ఉండూర్లో యిచ్చాం. అదీ ఒక కుటుంబంలోని అన్నకు, తమ్ముడికి. నడిపి బావ శంకర. ముగ్గురు చిన్నాయన పెదనాయన కొడుకు లయినా చాలా ఏళ్ళు ఉమ్మడిగా బతికారు. ఎవరి మహాత్యమోగాని చిన్నక్క పెల్లయిన నెలన్నరకు విడిపోయారు. పొడుగాటి దంతెలమిద్దె మూడు అరలయింది. భాగాల ప్రకారం మెట్ట భూమి వచ్చింది. ఇంటిల్లిపాది పొలంలో, కల్లంలో శ్రద్ధగా పని చేస్తారు.అక్కగారికి మొదట మగ పిల్లాడు. తర్వాత ఆడపిల్ల. శంకరకు అందుకు విరుద్ధం. నాకు వెంటవెంట ఇద్దరు మగపిల్లలు. లలిత తనకు తానై కుటుంబనియంత్రణ ఆపరేషను చేయించుకుంది.

‘‘ఇకనుంచి నువు కుమార స్వామివి కాదురా కుబేరస్వామివి’’ అన్నారు అక్కగారు, లలితను చూడడానికొచ్చి. అంతటి వాన్ని కాదుగానీ అప్పటికి అమ్మ సమస్య ముదిరి పాకానపడింది. ఈ అత్తాకోడళ్ళు నోరు విప్పితే బూతుబాణాలు మాత్రం వుండవు. లలిత సుదర్శన చక్రం వదిలితే అమ్మ పాశుపతాస్త్రం ప్రయోగిస్తుంది. రూపాయలాభం లేని పెత్తనాల మధ్య సాగే యుద్ధం. అమెరికాకు తెలిస్తే వికటాట్టహాసం చేస్తుంది. ఇంట్లో ఎక్కువ సేపు వుండక పోయినా దినదినానికి నా పరిస్థితి పోకచెక్కబాపతయింది. ఒకరికి భర్తను. మరొకరికి కొడుకును. చాలా మందిలాగా గత్యంతరం లేక ఒకసారి భార్యవైపు మొగ్గు చూపాను. అదీ శ్రుతిమించినపుడు. అమ్మ మొగం చిన్నబోయింది. గొంతులోంచి మారుపలుకలేదు. ఎంతమథనపడిందో ఏమో అదే రోజు చెపకుండా సుంకేసుల చేరింది. అది రెండందాలా మంచిదే అనుకున్నాను.‘‘ఒరేయ్‌ స్వామీ! అల్లుళ్ళను అడుక్కునే దుస్థితికి తీసుకురాకు. ప్రతినెలా డబ్బులు పంపకపోతివా ఇక్కడే ఉరేసుకుని చస్తా’’ అంది అమ్మ.ఉసిపాటు వుండి చెడ్డపేరు తెచ్చుకోవడమెందుకని డ బ్బులు దారాళంగా యిస్తున్నాను. ముందుకు ముందుగా ఒక మొత్తాన్ని పెట్టకపోలేదు. అయినా రానురాను అక్కల ముచ్చట్లు ఎక్కువయ్యాయి. ఒకరికే భారం కాకుండా అమ్మ ప్రతి ఏడాదికీ మారుతూ వస్తోంది. ఆమె ఎవరింట్లో తిన్నా మంచం తీసుకుని ఒళ్ళు పెంచుకునే రకం కాదు. పైరు కాలంలో పొద్దున, సాయంత్రం పొలం మీది కెళ్ళికావిలి వుంటుంది. పైరొడిపాక కల్లం వదలదు. ఎండాకాలంలో పొయిలోకి ఓ మోపు ఎండుపుల్లలు తెస్తుంది. అట్లే రెండుగంపల పేడకుప్పేస్తుంది. ఎన్ని చేసినా అక్కగారి అసంతృప్తి తెరలు తెరలుగా లేస్తోంది. దీనికి మూలాలు నా స్టేట్‌బ్యాంకి ఉద్యోగం, పెట్టుపోతలు చూపని లలిత.