అది బ్రహ్మ లోకం.ఎనభై నాలుగు లక్షల జీవరాసుల సృష్టికర్త అసహనంగా పచార్లు చే స్తున్నాడు. అతను చేస్తున్న పని మీద ఏకాగ్రత తప్పుతోంది. అతనికి చాలా కోపంగా...చికాకుగా వుంది...‘‘ఎందుకు నాయనా...ఈరోజు ఓ మాదిరిగా వున్నావు...’’ అడిగింది జగన్మాత.‘‘తల్లీ...! నాకు చాలా బాధగా వుంది. అంతే కాదు ఈ మానవుల మీద కోపంగా వుంది...’’ అన్నాడు సృష్టికర్త.‘‘ఏం నాయనా...! ఏమైంది...?’’ ఆశ్చర్యంగా అడిగింది జగన్మాత.‘‘తల్లీ...! ఈ సృష్టిలో ఎన్నో లక్షల జీవరాసులు వున్నాయి. వాటిని నేనే సృష్టించాను. వీటన్నింటి కన్నా మిన్నగా, భిన్నంగా మనిషిని సృష్టించాను. అంతేకాదు. ఈ మనిషికి స్పందించే మనసునిచ్చాను. అందమైన దేహాన్నిచ్చాను. అపారమైన తెలివితేటల్ని ఇచ్చాను...’’‘‘అవును...అది నిజమే...మరి ఇప్పుడేమైంది నాయనా?’’‘‘ఈ మనిషికి కనీసం కృతజ్ఞత కూడా లేదు. నా సంకల్పం లేనిదే చీమ అయినా కుట్టుదు...గడ్డిపోచ అయినా కదలదు. అలాంటిది నేను ఎంతో ముచ్చటపడి సృష్టించిన ఈ మనిషి నన్నూ, నా ఉనికిని మరిచిపోతున్నాడు...’’ సృష్టికర్త చింతిస్తూ అన్నాడు.‘నీవు అలా మధనపడకూడదు. ఇంతకీ నిన్ను ఇంతగా క్షోభకు గురిచేసిన ఆ మనిషి ఏం చేసాడు...?’’ అడిగింది జగన్మాత.‘‘తల్లీ..!ఒక్కసారి అటు చూడు...’’ తన చేతిని భూలోకం వైపు చూపించాడు సృష్టికర్త.

‘‘అమ్మా...’’తేనె కన్నా తియ్యనైనది. గుండె లోతుల్లోంచి వచ్చే శబ్దం.. పలకడానికి, వినడానికి ఎంత బాగుంటుంది...!పుట్టి బుద్దెరిగిన నాటి నుంచీ, నిన్న మొన్నటి వరకూ అంటే...నాకు పెళ్ళి అయ్యేంత వరకూ నాకు అమ్మ తప్ప వేరే లోకం తెలీదు.కడుపునిండా గోరుముద్దలు తినిపించేది. బొమ్మలా తయారు చేసి స్కూలుకి పంపించేది. నా పుస్తకాలకి అట్టలు వేసేది. నాకు హోమ్‌వర్క్‌ చేసి పెట్టేది. కథలు చెప్పి హాయిగా నిద్రపుచ్చేది.నా తోటి విద్యార్థులు నాతో బొమ్మలూ, నోట్సు రాయించుకునేవారు. నా అక్షరాలు ముత్యాల్లా వుంటాయని. నా చేతి రాత అంత అందంగా వుండడానికి కారణం అమ్మ.నాకు ధైర్యం తక్కువ. ఏదైనా సమస్య వస్తే హడలిపోతాను. ‘‘చదువు విజ్ఞానాన్నీ, ధైర్యాన్ని ఇస్తుంది. ప్రతి చిన్న దానికీ భయపడిపోతే ఎలా? జీవితమన్నాక అనేక ఆటుపోట్లుంటాయి. పిరికితనం కూడదు...’’ అని అమ్మ చెప్తూండేది.అమ్మకి గుండెల్లో నొప్పిగా వుందని హాస్పిటల్లో జాయిన్‌ చేసామని నాన్న ఫోన్‌ చేసి చెప్పారు. అప్పట్నుంచీ కాళ్ళూ, చేతులు ఆడడం లేదు. ఆ సమయానికి ట్రైన్‌ లేదు. బస్సుకి బయలుదేరాను.ఈ మధ్య అమ్మ ఆరోగ్యం క్షీణించింది అవును మరి.... అమ్మను నేనెప్పుడూ ఖాళీగా వుండడం చూడలేదు. ఇంట్లో పని మనిషి లేదు. అన్ని పనులు తనే చేస్తుంది. ఎప్పుడు తింటుందో... ఎప్పుడు నిద్ర పోతుందో తెలీదు. అమ్మకి సాయం చేద్దామని నేను కలుగచేసుకుంటే...‘‘నీకెందుకమ్మా ఈ పనులు! హాయిగా రెస్ట్‌ తీసుకో. రేపు పెళ్ళి అయ్యాక ఎలాగూ ఈ పనులు తప్పవు...’’ అని చేయనిచ్చేది కాదు.