ఢిల్లీ నుండి బయలుదేరిన తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ చాలా వేగంగా చెన్నైవైపు దూసుకుపోతోంది. అందులో ప్రయాణిస్తున్న నా ఆలోచనలు కూడా అంతకన్నా వేగంగా మా వూరివైపు, ఊళ్ళో వుంటున్న మా అమ్మవైపు పరుగులు తీస్తున్నాయి.దాదాపు సంవత్సరం తరువాత మా అమ్మను చూడబోతున్నాననీ, అమ్మ చేతివంట తినబోతున్నాననీ తలుచుకుంటేనే మనసు ఆనందంతో ఉఝ్కిరిబిక్కిరవుతోంది. ‘‘గువ్వలా ఎగిరిపోవాలీ.. నా తల్లి గూటికే చేరుకోవాలి.. లీ.. లీ’’ అంటూ అమ్మకోసం సినిమాలో హీరో కృష్ణలా పాట పాడుతూ గంతులు వెయ్యాలనుంది. కానీ నేనుండేది రైల్లో కదా.మా ఆమ్మ! ఎంత మంచి అమ్మ. నా కోసం ఎన్నికష్టాలు పడింది. ఎన్ని అవమానాలు భరించింది. ఎన్ని నిందలు మోసింది.అమ్మకు నేనంటే ప్రాణం. ఒక ప్రాణం కాదు, పంచ ప్రాణాలు. ఆ పంచ ప్రాణాలూ నా మీదే పెట్టుకుని అమ్మ ఇన్నాళ్ళూ బ్రతికింది.

ఇంకా బ్రతుకుతూ వుంది.అటువంటి అమ్మకోసం తనేం చేశాడు? హాయిగా ఢిల్లీలో ఉద్యోగం చేసుకుంటూ పెళ్ళాం పిల్లలతో కులాసాగా గడుపుతూ, ఆమెనేమో దిక్కులేని దాన్నిలా ఆ పల్లెటూళ్ళో ఒక్కదాన్నీ వదిలేసాడు.అసలు అమ్మను ఎట్లా చూసుకోవాలనుకున్నాను? ఎంతగా సుఖ పెట్టాలనుకున్నాను? నాకు ఉద్యోగం వచ్చిన తరువాత అమ్మను నా దగ్గరే ఉంచుకుని, సకల సౌకర్యాలు కలుగజేసి కాలు కిందపెట్టే అవసరం లేకుండా మహారాణిలా చూసుకోవాలని ఎన్ని కలలు కన్నాను. ఆమె ఇన్నాళ్ళూ పడ్డ కష్టాలు అన్నీ మరచిపోయేలా ఆమెను సంతోష పరచాలనుకున్నాను. కానీ, తీరా ఉద్యోగం వచ్చి పెళ్ళయి పెళ్ళాం వచ్చాక ఏమీ చేయలేకపోయాను. నా కలలన్నీ కల్లలైపోయాయి. కారణం నా భార్య రేఖ.రేఖకు అమ్మంటే గిట్టదు. మా అమ్మను తీసుకొచ్చి మన దగ్గరే ఉంచుకుందాం అని నేను అన్నపడల్లా ‘‘ఆ ముసల్దానికి నేను చాకిరీ చేస్తూ వండి వార్చుతుండాలా! ఆ ముసల్దాన్ని చూస్తేనే నాకు అసహ్యం. ఇక జీవితాంతం దానితో కలిసి మెలిసి వుండాలంటే నా వల్లకాదు’’ అంటూ నిర్మొహమాటంగా చెప్పింది. నేను కొట్టాను. అంతే, అన్నం తినకుండా అలిగేది. నన్ను పట్టించుకునేది కాదు. ఎంత చెప్పినా వినేది కాదు. మొండిగా ప్రవర్తించేది. ఇక లాభం లేదనుకొని వదిలేశాను.