‘‘ఎప్పుడు కొంటున్నావు మీ అమ్మగారికి టిక్కెట్టు..?’’రఘు అడిగిన ప్రశ్నకి ఎదురుగా ఉన్న జయ, అనుకోకుండా అటు వచ్చిన శారద యిద్దరూ విని ఒక్క క్షణం నిర్ఘాంతపోయారు. శారద గబుక్కున వాళ్ళకి కనపడకుండా పక్కకి తప్పుకుంది.

‘‘టిక్కెట్టా?’’ అన్న జయ ప్రశ్నకి ‘‘అవును, టిక్కెట్టే. ఈ వారం రోజుల్లో దొరక్కపోతే అప్పటికప్పుడు తత్కాల్‌ కొనాలి కదా... యేమాలోచించేవు మరి?’’ చాలా స్పష్టంగా చెప్పాడు రఘు.‘‘కానీ నాన్న యాత్రలకెళ్ళారు కదా... వచ్చే నెల పదిహేనుక్కానీ రారు.’’రఘు జయ పక్కన కూర్చుని అర్థమయ్యేటట్టు చెప్పడం మొదలెట్టాడు.‘‘చూడు జయా, మనం అవసరం అనగానే పరిగెట్టుకొచ్చేరు ఆవిడ. నేనొప్పుకుంటాను. ఇప్పుడు బబ్లూకి బాగానే ఉంది కదా... ఇంకో రెండ్రోజుల్లో ఫస్ట్‌ వస్తుంది. వాడిని క్రచ్‌లో పడేయవచ్చు. మీ నాన్నగారు వచ్చేక ఇంకా పదిహేను రోజులంటే అప్పుడైనా నెలమొత్తం డబ్బూ కట్టాలి. పోనీ అలాగే కడదామనుకున్నా అటు ఆ డబ్బూ కట్టి, ఇటు ఇంట్లో ఇంకో మనిషిని పెట్టుకోగలమా ఈ మండిపోతున్న రోజుల్లో... నువ్వే చెప్పు?’’‘‘అది కాదు రఘూ, యాత్రలకి వెడదామనుకున్న ఆవిడ మనం కంగారుపడి ఫోన్‌ చేస్తే మనకోసమని పరిగెత్తుకొచ్చింది.

అమ్మ ఇక్కడుందికదా అని, ఒక్కరూ ఇంట్లో వుండే బదులు నలుగురితో కలిసి అనుకున్న యాత్రలైనా చేసొద్దామని నాన్న అటు వెళ్ళారు. ఇటు బబ్లూకి నయమైపోయింది కదా అని మనం అమ్మని పంపించేస్తే అక్కడ ఒక్కత్తీ యెలా వుండగలదు చెప్పు?’’రఘు కాసేపు ఆలోచించి చెప్పేడు.... ‘‘ఒక్కరూ వుండలేరనుకుంటే పోనీ మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి వుండమను. మీ అమ్మగారినే అడుగు. ఆవిడ ఎక్కడికి వెడతానంటే అక్కడికే టిక్కెట్టు కొను...’’ చాలా ఉదారంగా చెప్పేసి రఘు వెళ్ళిపోయాడు.,హఠాత్తుగా రఘు వదిలిన పిడుగు లాంటి మాటకి బుర్ర పనిచెయ్యడం మానేసింది జయకి. నెల్లాళ్ళక్రితం యేడాదిన్నర వయసున్న బబ్లూ ప్రమాదవశాత్తూ జారి పడినప్పుడు కాలి ఎముక ప్రాక్చర్‌ అయిందని తెలియగానే పరిగెట్టుకొచ్చారు జయ తల్లీ, తండ్రీ. ఆపరేషను అయ్యేవరకూ వాళ్ళకి ధైర్యం చెపుతూ దగ్గరుండి, ఆపరేషన్‌ అవగానే బబ్లూని చూసుకోవడానికి శారదని ఇక్కడ వుంచేసి మూర్తిగారు ఇంటికి వెళ్ళిపోయేరు. అప్పటివరకూ జయ, రఘు బబ్లూని క్రచ్‌లో పెట్టి వారి వారి ఉద్యోగాలకి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు మంచం దిగని బబ్లూని క్రచ్‌కి పంపలేరు కదా... అందుకే నెల్లాళ్ళ నుంచి శారద ఇక్కడే వుండి బబ్లూని కంటికిరెప్పలా చూసుకోవడమే కాకుండా, జయ, రఘు ఆఫీసునుంచి ఇంటికొచ్చేటప్పటికి వాళ్ళకి కూడా వేడి వెచ్చనా చూస్తుండడంతో వాళ్ళిద్దరికీ కూడా మనసుకి ప్రశాంతంగా ఉంది. అలాంటిది హఠాత్తుగా రఘు తీసుకున్న నిర్ణయం తల్లీ కూతుళ్ళనిద్దరినీ ఆలోచనల్లోకి నెట్టేసింది.