ప్రియమైన అమ్మమ్మా!నేను... మాధురీని.అమ్మ నీ దగ్గరకు ప్రయాణమై పోయింది. ఎవరికీఏమీ చెప్పకుండా. నిర్ణయాలలో అమ్మకు స్వేచ్ఛ ఎప్పుడూ ఉంది కదా! మాకు తెలిస్తే వద్దంటాం అనుకొందో... ఆపేస్తాం అనుకొందో... వెళ్ళనీం అనుకొందో... ఏమీ చెప్పలేదు.అమ్మ అంటే మాకెంత ప్రేమో తెలుసుకదా....! నాన్న అమ్మని పువ్వుల్లో పెట్టుకొని చూశాడు. లేమిలోను కాస్త ఉన్నంతలోనూ ఉన్నస్థితిలోనూ ఎలాంటి ఆర్థికస్థితిలోనైనా అమ్మను బాగా చూసుకొన్నాడు. మీరు కాదన్నా నాన్నను పెళ్ళి చేసుకొని అమ్మ ఎంత నిశ్చింతగా గడిపింది కాలాన్ని...?! వాళ్ళిద్దరి ప్రేమ ఎంతమందికి ఆదర్శంగా నిల్చింది...?! మా కుటుంబం మేమున్న వీధికే అనుబంధాల మాధుర్యానికి పేరెన్నిక గనింది కదా....! అంతటి ప్రేమ వారిది. మేమూ....?! మేము మా అమ్మని ఎంత ప్రేమించాం....? అన్నం కలిపే అమ్మ చేతి గాజుల గలగలలు, అమ్మ నడిచి వస్తుంటే పాదాల మెట్టెల చప్పుడు, అమ్మ చీరె చెరుగు రెపరెపలు ఎన్ని అపురూప భావనలు...? అమ్మను ప్రేమించటం మాత్రమే కాదు... అమ్మను ఎంత గౌరవించాం...? నువ్వు చూడలేదు కాని... అది నిజం. అమ్మకు, నాన్నా మేము ఇచ్చే స్థానం పట్ల ఎంత గర్వం...? ఎంత ఆనందం...? అవి అనుభవించే అమ్మ ముఖంలో ఎంత వెలుగు ఎంతెంత తాదాత్మ్యం...?! చూసి తీరాలి.ఆఫీసుకు వెళ్ళొచ్చే అమ్మ, ఇంటా బయటా పనితో నలిగి పోతోందని నాన్న పనికి వంటకీ కూడా మనిషిని పెట్టాడు. వంట మనుషులు లేని రోజుల్లో అమ్మ క్యాంపుల నుంచి వచ్చే సరికి మేం వంట చేసే వాళ్ళం. మా అమ్మ ఎండ కన్నెరగని తల్లి అననుకాని, అమ్మ కష్టాన్ని మేమంతా పంచుకొన్నాం పనులు నేర్చుకున్నాం. అమ్మ కష్టాన్ని సుఖాన్ని కూడా మాతో ఇష్టంగా పంచుకొంది. 

మరిప్పుడు... ఇదేమిటి... చెప్పుకుండా ప్రయాణమై పోయింది.అమ్మమ్మా.... అమ్మకు నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా...? ఎంతమందికి నువ్వు జీవితాన్ని చూపావు...? ఎంత మంది స్ర్తీలు తమ కాళ్ళ మీద నిలబడేలా చేశావు....? చూపు పోయినా స్ర్తీలకు ఆర్థికంగా నిలదొక్కుకొనే మార్గాలు ఎన్నిచూపావు...? అమ్మ చెప్తూఉంటే రోమాంచిత మయ్యేది. పసి తనంలో నిన్ను చూసిన మాకు కళ్ళు కనిపించని బోసి నోటి అమ్మమ్మే తెలుసు. ఇవన్నీ మా అమ్మ గర్వంగా చెప్తుంటే ఇక్కడ లేని నిన్ను ముద్దెలా పెట్టుకోవాలి అని దిగులేసేది? అసలంత ఎందుకు 1950లలోనే నువ్వు నీ కూతుళ్ళనిద్దరినీ బియ్యెస్సీ చదివించావంటేనే, నువ్వు ఎంత అద్భుతమైన స్త్రీవో తెలుస్తుంది. చదువే అరుదైన ఆ రోజుల్లో, అందునా ఆడపిల్లలను చదివించా వంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఉద్యోగం కోసం గోదావరి నుంచి రాయలసీమకు అమ్మను, సిమ్లాలో మిలట్రీలో ఉద్యోగానికి పిన్నీనీ, పంపిన నీ సాహసం వారి తెగువ నాకు ఎప్పుడూ అద్భుతమే...! మరి నీలాంటి అద్భుతమైన తల్లిని ఏ బిడ్డైనా ప్రేమించకుండా ఉండగలదా...? నీకు తెలుసా... ఈ ప్రయాణానికి ముందు, అమ్మకు నువ్వు కలలోకి వచ్చావు. ఇక్కడెక్కడో కాదు గోవాలో. సరిగ్గా నెల ముందు అమ్మా నాన్న ఇద్దరూ ప్రశాంతంగా పది రోజులు గడిపి రావాలని గోవా వెళ్ళారు. కానీ, అమ్మ తీవ్ర అనారోగ్యానికి గురయ్యింది. హాసిటల్లో చేర్చారక్కడ. ఓ రోజు నువ్వు కలలోకి వచ్చి, అమ్మ చుట్టూ తిరుగుతూ ‘చెల్లి నా దగ్గరే ఉంది నిన్నూ తీసుకెళ్తా’ నన్నావట. అది మొదలు. అప్పుడే నిర్ణయించుకొందా... నీ దగ్గరకు రావాలని...? ఏమో...? నేను మా అమ్మతో ఎప్పుడూ గొడవ పడేదాన్ని.... నా కంటే అక్క నాలుగేళ్ళు ముందు పుట్టి, నా కంటే ఎక్కువ ప్రేమ తీసేసుకొందని. మా అక్క పెళ్ళి అయ్యాక నా గారం నా అల్లరి మా అమ్మ దగ్గర అంతా ఇంతా కాదు. రెండు చేతులా ప్రేమను అలా అలా కొల్లగొట్టేశాను. నాలో కలిగినలాంటి భావన ఏమైనా అమ్మకూ కలిగి ఉంటుందా....? చెల్లి ఒక్కతే అమ్మ ప్రేమ పొందుతూ ఉందని అనిపించిందా...? అందుకనే చెప్పకుండా ప్రయాణ మయ్యిందా..? ఏమో...!