అసలు నా జీవితంలో ఇటువంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఊహించినామనిషికి అందనిది కదా కాలం. సంతోషాన్ని విషాదాన్ని ఎప్పుడు మోసుకొస్తుందో దానికి తప్ప ఎవరికి తెలుసు. ఎప్పుడూ కాలాన్ని రెండు భాగాలుగా విభజించుకుని పరిస్థితుల్లోకి మార్చుకోవటానికి మనిషి ప్రయత్నించాలే తప్ప దానికి మాత్రం శాసనకర్తలం మాత్రం కాలేము. 

ఒడిదుడుకుల్ని ఎత్తుపల్లాల్ని అది అవలీలగా అధిగమించి మెత్తగా సాగిపోతూ మనల్ని కూడా లాక్కుపోతూనే ఉంటుంది. ఆ దెబ్బలు దానికి తగలవు కానీ మనకు మాత్రం భయంకరమైన గాయాలను మిగులుస్తుంటుంది.ఒక్కొక్కసారి శిఖరాగ్రాన - మరోసారిలోయల్లో, ఆ ప్రయాణానికి అలవాటుపడే లోపే మన జీవితం ముగిసిపోతుంది. దాని తార్కికతను అర్థం చేసుకున్నాను కానీ తాత్త్వికతను మాత్రంతెలుసుకోలేక పోయాను. అది నా భార్య సాధించి చూపించింది. వేదాంతం అందరం చెబుతాం. కష్టాలొచ్చినప్పుడు జారి పోతుంటాం. కొంతమంది మాత్రమే ఆ మార్మికతను వ్యక్తిత్వంగా రూపుదిద్దుకోగలరు. ఆ వరసలో నా భార్య లక్ష్మి చాలా చాలా ముందున్నదనే వాస్తవాన్ని చెప్పే సంఘటనకు ముందు నా జీవిత క్రమాన్ని కొంత చెప్పుకోవాలి.నేను అగ్రికల్చర్‌లో ఎమ్మెస్‌ చేసి ప్రభుత్వ ఎ.జి. ఆఫీసులో అడిషనల్‌ డైరెక్టర్‌గా 20 ఏళ్ళుగా పని చేస్తున్నాను. నా భార్య లక్ష్మి పెద్ద కుటుంబం నుండి వచ్చింది. పట్టుబట్టి ఉద్యో గస్తుడు కావాలని నన్ను ఏరికోరి పెళ్ళిచేసుకుంది. వస్తూ ఆస్తిని కూడా వెంట బెట్టుకొని వచ్చింది. ఈ ధనం కంటే ఆమె గుణమే ఎంతో గొప్పదని తొందర్లోనే అర్థం చేసుకున్నాము. ఒద్దికగా ఎప్పుడూ నవ్వుతూ నెమ్మదిగా ఉండే నా భార్య నా కుటుంబంలో చక్కగా ఒదిగిపోయింది.

నా తల్లితండ్రులు నాకంటే ఆమెనే ఎక్కువ ప్రేమించారు.పదేళ్ళకాలం మాకో అగ్నిపరీక్షను మిగిల్చింది. పిల్లలు పుట్టలేదనే బాధ ఇద్దరం సమానంగా కలిసి అనుభవించాము. ఈ విషయంలో నా తల్లిదండ్రులు కూడా ఆమెను కూతురిలా అక్కున చేర్చుకున్నారే తప్ప అందరిలా ఆక్షేపించలేదు. తనే నన్ను మరో వివాహం చేసు కోమని ప్రోత్సహించినప్పుడు ఆమెను మందలించాను. ఆదర్శ దాంపత్యంలో పిల్లలు రెండవ భాగమే తప్ప భార్యా భర్తల బంధాన్ని చెడగొట్టేంత ప్రధానమైంది కాదని నచ్చజెప్పాను.మొదటినుండి లక్ష్మిది ప్రత్యేకమైన స్వభావం. పిల్లలు లేని స్ర్తీలంతా గుళ్ళు, గోపురాలు ఆశ్రమాలు తిరుగుతుంటే, తాను మాత్రం అనాథ శరణాలయాలకు వెళ్ళి డబ్బు - బట్టలు దానం చేసి వచ్చేది. వృద్ధాశ్రమాలకు వెళ్ళి పండ్లు, స్వీట్లు, దుప్పట్లు పంచి పెట్టేది. ఆమె కనిపించని దైవం కంటే కష్టాల్లో ఉన్నమనుషులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది.