అందరు పెళ్లికాని అమ్మాయిల్లాగే ముక్తేశ్వరి కూడా పెళ్లికి ముందు అందమైన కుర్రాడే తనకు మొగుడిగా దొరకాలని కోరుకుంది. ఎన్నో కలలు కన్నది కూడా. పెళ్లి చూపుల్లో రాజారావుని చూసి తొలి చూపులోనే ఇష్టపడింది.చిన్నప్పటి నుంచీ ప్రతి పనిలోనూ ఎంతో చురుగ్గా ఉండే ముక్తేశ్వరికి, అందానికీ, చురుకుదనానికీ సంబంధం ఉండి తీరాలనే నియమం లేదనీ తెలియడంతో పాటు రాజారావుతో మూడు నెలలు కాపురం చేశాక... కోపిష్టి మొగుణ్ణి భరించడం కంటే పరుషంగా ఒక మాట విసిరినా తనను కాదన్నట్టు నిర్వికారంగా ఉండే మగాణ్ణి భరించడం ఎంత కష్టమోననే విషయం కూడా తెలిసి వచ్చింది.మొగుడి నిరాసకత్తను భరిస్తూ, అతడితో కాపురం చేసిన దానికి గుర్తుగా వినీలను కని ఆమెకు సాధ్యమైనంత త్వరగా పెళ్లి చేసి బాధ్యతను నెర వేర్చుకునే ప్రయత్నాల్లో ఉన్న ముక్తేశ్వరికి వినీల తోటిదే అయిన అఖిలకు పెళ్లి కుదిరిందని తెలియడంతో మనసులో ఆందోళన మొదలైంది.‘పెళ్లంటే మాటలా? ఏ పనికీ చొరవలేని మొగుడి సహాయ సహకారాలతో ఆడపిల్ల పెళ్లి చేయడం కంటే ఒంటిచేత్తో వంద మందిని ఎదుర్కోవడమే తేలికేమో!’’ అని పరిపరి విధాల ఆలోచిస్తూ... ఆ రాత్రి రాజారావుతో తన గోడు వెళ్లబోసుకుని తన ప్రణాళిక వివరించింది ముక్తేశ్వరి.

‘‘మీరు వారం రోజులు ఆఫీసుకు సెలవు పెట్టిండి. మీ ఊరెళ్లండి. పెద్దవాళ్లనందర్నీ కలవండి. వెళ్తూవెళ్తూ వినీల ఫొటోలు తీసుకెళ్లండి. సంబంధాలు చూడమని చెప్పిన వారందరికీ ఫొటోలు ఇవ్వండి. తర్వాత మా ఊరెళ్లండి. మా అన్నయ్యనూ, ఇంకా మా బంధువుల్నీ కల్సుకోండి. అక్కడ కూడా అదే పని చేయండి. తర్వాత మీ అక్కయ్యగారి ఊరు వెళ్లండి.మొహమాట పడకుండా నలుగుర్నీ కలవండి. అలా నాలుగు ఊళ్లు తిరిగి మనక్కావల్సిన అబ్బాయిల వివరాలు సేకరించాక... ఇక్కడికి తిరిగొచ్చిం తర్వాత కూడా ఒకటికి పదిసార్లు అదే విషయం మీద దృష్టి పెడితేనే గానీ వినీలకు మంచి సంబంధం రాదు. సరేనా?!’’ అని రాజారావు వైపు చూసిన ముక్తేశ్వరికి... అతడు దిండుకు జేరబడి సగం కూర్చునీ, సగం పడుకునీ ఉన్న భంగిమ లోనే నిద్ర పోతూ కనిపించాడు. భర్త పట్టించుకోకపోయినా వాళ్లనూ, వీళ్లనూ బ్రతిమాలి ఆ తర్వాత.. వినీలకు వరసగా అరడజను సంబంధాలు చూసింది ముక్తేశ్వరి.వాటిలో రెండు సంబంధాలు ముక్తేశ్వరికి నచ్చితే రాజారావు ఇవ్వజూపిన కట్నం మగపెళ్లివారికి నచ్చలేదు. మరో రెండు సంబంధాలు వినీలకు నచ్చలేదు. మిగిలిన రెండు సంబంధాల వారికీ వినీల అందచందాలు నచ్చలేదు.రోజులిలా గడుస్తోండగా...ఒక రోజు రమ్య వాళ్లింటికి వచ్చింది. ఆమె అదేకాలనీలో ఉంటోన్న గాయత్రి గారమ్మాయి. గాయత్రికీ ముక్తేశ్వరికీ దాదాపు పదేళ్ల స్నేహం. ఒకరికి తెలిసిన వంటలు మరొకరికి చెప్పుకోవడంతో ప్రారంభమైన వారి పరిచయం, వారానికోసారి గుడికో, పదిహేను రోజులకోసారి బజారుకీ వెళ్లి రావడం వరకూ వచ్చి... స్వవిషయాలు అరమరికలు లేకుండా మాట్లాడుకునే వరకూ వచ్చింది.