‘‘సువ్వీ కస్తూరి రంగ.... నువ్వీ కావేటి రంగా...సువ్వీ రామాబిరామ... సువ్వీలలో....’’ గీరగా ఉన్న గొంతే అయినా రాగం తీసి మరి ఘంటాలమ్మ పాడుతూ వడ్లు దంచుతుంటే పనులు చేసుకుంటూ ఆ వాడలోని వారంతా ముసి ముసిగా నవ్వుకుంటూ వింటున్నారు.‘‘ఆపినవేంది ఘంటాలమ్మ... పాడు సుశీల జానకి గిట్ల ఎనకటితీరు ఎక్కువబాడతలేరు... నువ్వుపోరాదుసీన్మలలో పాడనీకి...’’ నీళ్ల తొట్టిలో బిందె వంపుతూ ఎల్లమ్మ కిసుక్కున నవ్వింది.‘‘ఏంది! ఎటకారమ... సీన్మ పాటలుగాదు నేను బాడేటన్ని పాటలు మీకెవులకన్నా వచ్చా...? కోతపాటలు బాడత... ఊడ్పుల పాటలు బాడతా... బతుకమ్మ పాటలు బాడతా.. నా తీరు మీరెవురన్నా బాడ్తరా....’’‘‘అయ్యో గంత కోపమెందుకు పెద్దవ్వ నువ్వు బాడకుండా ఏనాడన్నా నాట్లు ఊడ్పులు కోతలైనయ్యా....? నువ్వు బాడకుండా ఏనాడన్నా బతుకమ్మ సద్దులైనయా..? గిప్పటి ఆడిబిల్లలకు బతుకమ్మ సుట్టూ తిరగనీకి గొంతెత్తి బాడనీకి మస్తు శరమైతాంది... మైకులు బట్టుకుని మాయదారి సిన్మా పాటలు పాడమను మస్తుగ బాడ్తరు... కాలం మారిపోయింది....’’ రాజవ్వ పూచిక చీపురుకు తాడుకట్టి నేలమీద నాలుగైదు సరువులు సరిచింది.‘‘అసలు మన ఆటా పాట మన మాట మట్టిల గల్వకుండా మనమే జూసుకోవాలె.... ఒక్కొకళ్లు మస్తు పెయ్యిలు బెంచినంక బతకమ్మ సుట్టూ దిరగనీకి ఏడ చాతనైతది..? సదువులనుకుంట, కొలువులనుకుంట అందరూ సిటీల దిక్కే ఉరుకుతాండ్రాయే... అంత్రాల మీద అంత్రాలాయే... డబ్బాల డబ్బాల ఇండ్లాయే.. ఇగ ఆ డబ్బాల డబ్బాల ఇండ్లలో ఒక వాకిలూడ్సుడున్నదా... ఇల్లు అల్లుకుడున్నదా... ముగ్గులు పెట్టేదే లేదాయే... ఇగ అన్ని కరెంట్‌ మిషన్లైనంక ఒక దంచుడా... రుబ్బుడా... పెయ్యి అల్వకుంట పెరిగినంక ఇగ దొడ్డుగాక బక్కగైతరా యాడన్న...’’ ఘంటాలమ్మ దీర్ఘం తీసింది.

‘‘ఏందవ్వో పోయి పోయి ఘంటాలమ్మతోటి పెట్టుకుంటాండ్రా ఆమె చూడు ఈ దినం కూడ కొడుకులు బిడ్డలు మనుమలు ఏమన్నదినని అని ఆమె మాత్రం దంపుడు బియ్యమే తింటది.... ఆమె వడ్లు ఆమె దంచుకుంటది... అవి రేనపండ్లు గానీ జామపండ్లు గానీ ఏ కాలంలో ఏ పండ్లు దొరికితే అవి మస్తుగ తింటది....’’ గోడవతల చెత్త పారబోసుకుంటూ అన్నది వెంకటమ్మ.యాభై ఏండ్లు దాటినా నల్లగా నిగనిగలాడుతున్న సౌష్టవ శరీరం ఘంటాలమ్మది... కాస్త బొంగురుగా ఉన్న స్వరం ఘల్లుమల్లుమని కడియాల మోతలు ఆమెను ఇతరులకన్నా ప్రత్యేకంగా నిలబెడతాయి... దగ్గరదగ్గరగా ఉన్న పెంకుటిళ్ల ఆవరణ అది. అందరూ ఎవరిండ్లలో వారు ఉండి పనులు చేసుకుంటున్నా అందరూ అందరికీ కనిపిస్తూనే ఉంటారు. ఒకరి మాటలు స్పష్టంగా వినిపించటానికి కాస్త పెద్దగా మాట్లాడుకుంటారు.‘‘ఇంతకీ ఘంటాలమ్మ సేత్తో దంచుతాందా కాళ్లతో దంచుతాందా... కాళ్ల కడియాలు ఘల్లుఘల్లుమంటున్నాయి...’’ రాజవ్వ అన్నది. ఆ మాటకి చేతుల్లో పనులు వదిలేసి అందరూ ఘంటాలమ్మ చుట్టూ చేరి ఒకరికొకరు పోటీపడుతూ ఘంటాలమ్మతో మేళమాడసాగారు.