మేము సకాలంలో వైజాగ్‌ స్టేషన్‌కి చేరాం.భువనేశ్వర్‌ వెళ్ళే విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రెండు గంటలు లేటుగా నడుస్తోందని తెలియగానే చాలా నిరుత్సాహపడ్డాం. శ్రీరామ్‌ మాత్రం హుషారుగానే ఉన్నాడు. సంక్రాంతి పండగ నాటి విశేషాలు నెమరువేస్తూ ప్లాట్‌ఫారం మీద ఆడవాళ్ళను చూస్తూ రకరకాల కామెంట్సు చేస్తున్నాడు. నాకు చిరాకుగా ఉంది.‘‘ఆ అమ్మాయి పాదాలు చూడు ఎంత పల్చగా మెత్తగా ఉన్నాయో, జడ కూడ పొడవే. నిజంగా నాట్యకత్తె అయ్యుంటుంది... ఈమె భర్తని చూడు ఎంత హేండ్‌సమ్‌గా ఉన్నాడో, భార్య మాత్రం సరియైున జోడికాదు. ముక్కు మరీ పొట్టిగా ఉంది. పాపం - ఎలా ఇష్టపడ్డాడో... ‘‘ఇలా ఉంటాయి వాడి కామెంట్లు. సంక్రాంతి సంబరాల్లో... గంగిరెద్దుల వాళ్ళను సైతం వదల లేదు. నాకు భయం.. తెలిసిన వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో అని. కానీ వాడి కామెంట్స్‌ అశ్లీలంగా ఉండవు. వాడి కళాదృష్టిని ఎవరైనా మెచ్చుకోక తప్పదు. నాకు మాత్రం ట్రైను లేటు అవుతుంటే చికాకుగా ఉంది.అలా లొడలొడ వాగే శ్రీరామ్‌ ఒక్కసారిగా సైలెంటు అయిపోయాడు. ఏమైంది వీడికి అని చూసేసరికి, వాడు ఎటూ చూడటం లేదు. ఆకాశం వేపు తప్ప. ఓ అయిదు నిమిషాల తరువాత నిశ్శబ్దాని భగ్నం చేస్తూ ‘‘క్రిందటి సంక్రాంతికి నేను మీ ఊరు వస్తున్నప్పుడు ఒక రసవత్తరమైన సంఘటన జరిగింది. చెప్పమంటే చెప్తాను. కాని నీవు ఎవరికీ చెప్పనని మాటివ్వాలి. విని, నా మిత్రుడు ఇంతటి అల్పుడని నీవు అనుకున్నా నేనేం చేయలేను’’.

‘‘చెప్పు’’ అంటే చెప్తాను అంటూ ఆగాడు. నేను అంగీకార సూచకంగా తలూపాను. అటూ ఇటూ చూసి మొదలు పెట్టాడు శ్రీరామ్‌.‘‘కిందటి సంక్రాంతికి మీ ఊరొస్తూ మా చెల్లాయి పెళ్లి సంబంధం వెతికే పనిలో శ్రీకాకుళంలో దిగి అక్కడ నుండి ఓ పల్లెటూరు వెళ్ళవలసి వచ్చింది. సంబంధం వివరాలు చెప్పే ఆయన బరంపురంలో ఉన్నాడంటే అక్కడ దిగాను. కాని ఆయన లేడు. ఇంకో ఆయన శ్రీకాకుళం దగ్గర సంబంధం ఉందంటే ఆ రాత్రి రైల్వేస్టేషన్‌ కొచ్చాను. నేను ఎక్కే రైలు పది గంటలకు వస్తుంది. అది కూడా పాసింజరు ట్రైను. ఏదైతేనేం రాత్రి కలిసి వస్తుంది కదాని ఆ పాసింజరే ఎక్కాను. నేను ఎక్కిన కంపార్టుమెంటు రద్దీగా ఉన్నా, నాకు మాత్రం కిటికీ దగ్గర సీటు దొరికింది. నా పక్కనే ముసలమ్మ చలికి ముడుచుకుని, చిరుగుల దుప్పటి కప్పుకుని పడుకుంది. ఆమె కాళ్ళ దగ్గర ఇద్దరు చిన్నపిల్లలు నిద్రకు జోగుతున్నారు. నా బెర్తు కింద తట్టబుట్ట - సామానులు - అందరూ నిద్రావస్థలో ఉన్నారు. రైలు బయలుదేరిన తరువాత తెలిసింది. పుష్యమాసపు చలిధాటి, గాజు కిటికీ అడుగునుండి కత్తులతో కోస్తున్నట్టు గాలి. నా దగ్గరున్న దుక్క దుప్పటి కప్పుకుని, కాళ్ళు బెర్తుమీద పెట్టుకుని ముడుచుకుని కూర్చున్నాను. కంపార్టుమెంటు అంతటా గుడ్డి వెలుగు. ప్రతి చిన్నసేష్టన్‌లోనూ రైలు ఆగుతోంది. ఎక్కేజనం, దిగేజనం అంతా హడావుడిగా ఉంటోంది. మగత నిద్రపడుతోంది. నిద్ర తేలి పోతోంది. అలాగే ఓ గంట ప్రయాణం సాగిందేమో’’ శ్రీరామ్‌ ఆగి మళ్ళామొదలు పెట్టాడు.