రెండు వేల నలభై ఒకటవ సంవత్సరం...ఆ అపార్ట్‌మెంట్ నలభై తొమ్మిదవ ఫ్లోర్‌లో ఉంది. నాలుగు గదులు, చిన్ని హాలు గల ఆ అపార్ట్‌మెంటు మొత్తం ఎయిర్ కండిషన్డ్. హాల్లో ఉన్న డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని టీవీ చూస్తూ బీఫ్ ప్యాటీస్ తింటున్నారు హర్ష, విలాసిని. టూనా వచ్చి కూర్చుంటూ ఇద్దరికీ ‘గుడ్‌మార్నింగ్’ అని విష్ చేసింది. ఇద్దరూ టీవీకి అతుక్కుపోయిన కళ్ళు తిప్పకుండా ‘‘గుడ్‌మార్నింగ్ బేబీ’’ అన్నారు.టూనా చీఫ్ ప్యాటీ తీసుకొని తింటూ ‘‘డాడ్.. రాత్రంతా గ్రాండీ (నానమ్మ) దగ్గుతూనే వుంది! ఆమె దగ్గు నా గదిలోకి వినిపించింది!’’ అంది.హర్ష టూనా వంక ఒకసారి చూసి మళ్ళీ టీవీ వైపు చూపులు తిపకుంటూ ‘‘ఆసుపత్రికి తీసుకెళ్ళాలి! ఈరోజు మా ఆఫీసులో ప్రమోషన్స్ డిక్లేర్ చేయబోతున్నారు. కనుక నాకు కుదరదు. విల్లా విల్ యు టేక్ హార్?’’ హర్ష విలాసిని అని పిలిస్తే ఆమెకు ఇష్టం ఉండదు. చీప్‌గా అన్పిస్తుంది. ఆ పేరునే ఆమె స్టైల్‌గా ‘విల్లా’ అని మార్చుకుంది.విల్లా క్షణం ఆలోచించి ‘‘ఈరోజు క్లబ్‌లో అంత ఇంపార్టెంట్ పనేమీ లేదు! నేను హాస్పిటల్‌కి తీసుకెళ్తా’’ అంది. హర్ష చేతులు టవల్‌కి తుడుచుకుంటూ ‘‘వుడ్డీ, మింటూ ఎక్కడ?’’ అనడిగాడు.వుడ్డీ టూనా చెల్లెలు. ఆ సంవత్సరమే స్కూలు వదిలి కాలేజీలో అడుగుపెట్టింది.
మింటూ సెవన్త్ స్టాండర్డ్. ‘‘వాళ్ళింకా నిద్రపోతున్నారు’’ విల్లా అంది.‘‘నేను ఆఫీసుకు వెళ్ళొస్తా’’ అంటూ హర్ష వెళ్ళిపోయాడు.కాసేపు తర్వాత ‘‘నేను క్లబ్‌కి వెళ్ళొస్తా’’ అంటూ విల్లా కూడా వెళ్ళిపోయింది.టూనా టీవీ ఆఫ్‌చేసి ఆక్సిజన్ మాస్క్, పర్స్ తీసుకొని కాలేజీకి బయలుదేరింది.ఇంటినుంచి బయటకు అడుగుపెట్టాలంటే ఆక్సిజన్ మాస్క్ ఉండాల్సిందే. సూసైడ్ చేసుకోవాలంటే సులభమైన మార్గం... మాస్క్ లేకుండా వీధిలో రెండు నిమిషాలపాటు నిలబడడమే! ప్రశాంత మరణం పొందవచ్చు!!టూనా మాస్క్ తగిలించుకుని టాక్సీకోసం ఎదురుచూడసాగింది. నిమిషం తర్వాత టాక్సీ వచ్చి ఆమె ముందు ఆగింది. టూనా టాక్సీ తలుపు తీసి లోపల కూర్చుంటూ వెంటనే తలుపు మూసింది. అది ఎయిర్ కండీషన్డ్ టాక్సీ. ఆ మాటకొస్తే అన్నీ వాహనాలూనూ! (ఆక్సిజన్ మాస్క్ తగిలించుకొని బైక్స్ నడపడం కష్టమని వాటిని నిషేధించారు. సైకిళ్లు ఎపడో అంతరించిపోయాయి).టూనా ఎక్కడికెళ్ళాలో చెప్పింది. డ్రైవర్ కారును ముందుకు పోనిచ్చాడు. అతను టూనా వద్దనున్న ఆక్సిజన్ మాస్క్ చూస్తూ ‘‘డు యు నో వన్ థింగ్?’’ అనడిగాడు. ఇంగ్లీషు పదాలు వాడకుండా తెలుగు మాత్రం ఉపయోగించి ఎవరూ సంభాషించలేరు! ప్రస్తుతం అందరూ మాట్లాడేది తెలుగు, ఇంగ్లీషు కలబోసిన తింగ్లీషు అనే భాష. దినపత్రికలు, వారపత్రికలు, పాఠ్య పుస్తకాలు ఇపడన్నీ తింగ్లీషులోనే వస్తున్నాయి! తెలుగులో రావడం లేదు!!