అనగనగా ఓ గాడిద.దానికిబతుకు మీద చీదరపుట్టి రేవులో మునిగి చద్దామని బైలు దేరింది.చివరి నిమిషంలో దేవుడు ప్రత్యక్షమయి ‘‘ఏమిటి నీ బాధ?’’ అని అడిగాడు.‘‘కోకిలమ్మకు కమ్మటి గొంతిచ్చావు. కోతికి గెంతులిచ్చావు. నెమలికి అందమైన ఈకలిచ్చావు. మా జాతిదే అయినా గుర్రానికి మంచి తేజా న్నిచ్చావు. సింహాన్ని సరే అడవికే రాజును చేశావు. చివరికి చిట్టెలుకను కూడా గణాధిపతి వినాయకుడికి వాహనంగా చేసావు. నేనేం పాపంచేశానని నాకీ గాడిద జన్మనిచ్చావు? చాకిరీ చేయలేక ఛస్తున్నాను. చీదరింపులకి అంతే లేదు. ఇన్నిన్ని అవమానాలు పడుతూ బతికేకన్నాఈ రేవులో పడి చావడమే మేలు’’ అంటూ ఘొల్లుమంది ఆ గాడిద.‘‘ముందా కొళాయి కట్టేయ్‌! ఏం జన్మ కావాలో కోరుకో!’’ అన్నాడు దేవుడు జాలిపడి‘‘అందంగా ఉండాలి. అందరూ నా వెంటేబడాలి. పదహారేళ్ల ఆడపిల్లగా పుట్టించు!’’ అని అడిగింది ఆ గాడిద ఆశగా.‘‘తథాస్తు’’ అని దేవుడు మాయమైపోయాడు.పదహారేళ్ళ పడుచుగా పుట్టి పదహారు రోజులైనా కాకుండానే ఒంటరిగా ఉన్నప్పుడు ఇంట్లో ఫ్యానుకి ఉరేసుకోబోయింది.‘‘మళ్ళా ఇదేం పిచ్చిపని?’’ అనడిగాడు దేవుడు అర్జంటుగా ప్రత్యక్ష మయిపోయి.‘‘నా అందమే నాకు శాపమైంది. అడ్డమైనవాడు ప్రేమించానని వెంట బడుతున్నాడు. కాదంటే యాసిడ్‌ పోస్తానని బెదిరిస్తున్నాడు. ఇక్కడా నాకు గాడిద చాకిరీ తప్పటం లేదు. ఇంట్లో రోజూ పెద్ద యుద్ధమై పోతోంది. ఈ మగ ప్రపంచంలో ఆడదానికి ఇంటా... బైటా బాటిలూ... భేటీలే! ఆడదై పుట్టేకన్నా! అడవిలో మానై పుట్టటం మేలన్నది ఎందుకో ఇప్పుడు అనుభవమైంది. మానుగా కాదు గానీ... వీలయితే నన్ను మళ్ళీ ‘జంటిల్‌మేన్‌’గా పుట్టించు! లేకుంటే నా మానాన నన్ను చావనీయ్‌’’ అని ముక్కు చీదిందా ఆడబిడ్డ.

‘‘జెంటిల్‌మ్యానంటున్నావు గనక ఓ గవర్నమెంటు స్కూల్లో ఉపాధ్యాయుడిగా ... ఇదిగో... ఇప్పుడే జన్మించు!’’ అంటూ మాయమై పోయాడు దేవుడు.సర్కారు టీచరుగా పుట్టి వంద రోజులు కూడా కాకుండానే టేంకు బండు మీద నుండి కిందకి దూకబోయాడా జెంటిల్‌మేన్‌!యథాప్రకారం మళ్ళీ విధాత ప్రత్యక్షం.‘‘పది మందికీ పాఠాలు చెప్పే పని వప్పగించినా, ఇదేం పిచ్చి పనీ? అయ్యవారి వృత్తి నీకు నచ్చలేదా?!’’‘‘అయ్యో! నాకసలు పిల్లలకు పాఠాలు చెప్పే అవకాశమేది స్వామీ! అందరూ నాకు పాఠాలు చెప్పే వాళ్ళేనాయె! వేళకు జీతాలు రావు. వచ్చిన జీతాలు చాలవు. ఎవరికీ పంతులంటే లెక్కలేదు. జనాభా లెక్కల్నుంచి, ఓటర్ల జాబితా సవరణలు, ఎన్నికల నిర్వహణ దాకా అన్నింటికీ ఉపాధ్యాయుడే చావాలాయ! గాడిద చాకిరీ మాత్రం వదలటం లేదు. బడి పంతులయితే అబ్దుల్‌ కలాంకి లాగా మంచి పేరొస్తుందనుకున్నా గానీ.. బడిపిల్లల చేత పిచ్చిపిచ్చి మారుపేర్లు పెట్టించుకుంటాననుకోలేదు. వంట బట్టని చదువులు, ఒక పట్టాన అంతు బట్టని జీవోలు, అంతేలేని పదోన్నతులు కౌన్సిలింగులు.... అంతమే లేని బలవంతపు బదిలీలు! బందీల దొడ్ది లాంటి బడిలో ఏ గోడ కిందో పడి దిక్కుమాలిన చావు చచ్చేకన్నా.... ఈ మురికి నీళ్ళలోకి దూకి ముందే పైకి పోవడం మేలుగదా! మంచి పుటక పుట్టే యోగం ఎలాగూ లేదు... మనసారా చావడానికి కూడా నాకవకాశం లేదా ఏమిటి స్వామీ?’’ అని ఎదురుదాడికి దిగిన బడిపంతులిని సముదాయించే పనిలో పడక తప్పలేదు పరంధాముడికి.