‘‘అగ్నిసాక్షిగా ఏడడుగులు నడవడంతో ప్రారంభమైన వైవాహిక జీవితం ఏడేడు జన్మల వరకూ కొనసాగడం అనే భావన మనకు భారతీయ వైవాహిక బంధంలోనే కనిపిస్తుంది. ఒకరంటే ఒకరికి తెలియని ఇద్దరు వ్యక్తులు తమజీవితాలనుకలిసి పంచుకోవటమనే ఒక అనిర్వచనీయ అనుభూతిని ఆవిష్కరించే ఒక మహోత్కృష్ట సంస్కృతికిమనమందరమూ శిరస్సు వంచి నమస్కరించాలి.’’ఇలాసాగిన ఆ వాక్ప్రవాహానికి జేజేలు పలుకుతూ కరతాళధ్వనులతో తమ అభినందనలను కళాశాల ప్రాంగణం అంతా మార్మోగేలా తెలియజేశారు, అక్కడ హాజరయిన విద్యార్థులంతా...ఆ కరతాళధ్వనుల మధ్య కళాశాల యాజమాన్యం ప్రతినిధులు వెంటరాగా అందరికీ వీడ్కోలు పలుకుతూ సెలవుతీసుకున్నాడు ప్రముఖ రచయిత మోహన్‌. అప్పటికే కథలు, నవలలు, వ్యక్తిత్వ వికాస వ్యాసాలు, కాలమ్‌లు, యాత్రా సాహిత్యం ఇలా సాహిత్యం అన్ని పార్శ్వాలలోనూ తనది అంటూ ఒక ముద్రని సృష్టించుకుని, ఎంతో మంది పాఠకులకు ఆరాధ్యుడిగా మారిన మోహన్‌కు, కారులో కూర్చోగానే, ఆలోచనలు అతడిని ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి చేశాయి.వివాహ బంధపు మధురిమలను వినసొంపుగా వివరించిన తను తన జీవితంలో ఎందుకింత అసంతృప్తికి లోనవుతున్నాడని ప్రశ్నించుకొన్నాడు. 

లోపం ఎక్కడుంది తనలోనా, లక్ష్మిలోనా అనుకుంటూ సెల్‌ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు. ఇంటి దగ్గర్నించి రెండు మిస్స్‌డ్‌ కాల్స్‌, రాగిణి దగ్గర నుంచి రెండు మిస్స్‌డ్‌ కాల్స్‌ కనిపించాయి. రాగిణి....ఆ పేరు తలుచుకోగానే మోహన్‌కి ఒక్క చల్లని పిల్ల తెమ్మెర స్పృశించిన అనుభూతి కలిగింది. పరిచయమై పదినెలలే అయినా ఎందుకిలా తనని వెంటాడుతోంది రాగిణి. మనసులో రేగే ఇలాంటి ఎన్నో అలజడులను పాఠకలోకం మీదకు వదిలిన తను కూడా చివరకు ఈ కల్లోలంలో చిక్కుకుంటున్నాడా అని ఒక్క క్షణం తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఎడారిగా మారుతున్న తన జీవితంలో రాగిణి ఓ అందమైన ఒయాసిస్సులా ప్రవేశించింది అని సమాధాన పరచుకున్నాడు.వైవాహిక జీవితంలో స్తబ్ధత ఏర్పడడం అనేది చాలా మంది జీవితాల్లో జరుగుతుంది. ఒక రచయితగా చాలా మంది జీవితాల్లో దాన్ని గమనించాడు తను. రచయితగా ఎదుగుతున్న కొద్దీ లక్ష్మికి దూరంగా జరగటం ప్రారంభమయింది. లక్ష్మి కూడా ఒకప్పుడు తన పాఠకురాలే. తనని వలచి వెంటాడి మరీ చేసుకుంది.

తన ఎదుగుదలలో తనూ ఓ భాగమైంది కానీ, తరవాత రోజుల్లో లక్ష్మిలో ఏదో అభద్రతా భావం చోటు చేసుకుంటుందన్న అనుమానం తనలో మొదలైంది. దానికి తోడు పెళ్లై పదేళ్లయినా పిల్లలు లేకపోవటం తన మీద ప్రభావం చూపకపోయినా, లక్ష్మిలో దాని తాలుకు ఆవేదన కనిపిస్తోందని గ్రహించాడు మోహన్‌.అలాంటి సమయంలో మోహన్‌ జీవితంలో ఒక ఝంఝామారుతంలా ప్రవేశించింది రాగిణి. మొదట్లో మోహన్‌ పెద్దగా పట్టించుకోక పోయినా కథ రాయటం అనే దాని మీద ఆ అమ్మాయికున్న శ్రద్ధ, తపన, దీక్ష ఇవన్నీ అతన్ని ముగ్ధుణ్ణి చేశాయి. ‘‘నాకు కథ రాయటం నేర్పండి సార్‌’’ అని అమాయకంగా అడిగిన రాగిణి కేవలం పది నెలల వ్యవధిలో పేరున్న పత్రికలో పదికి పైగా కథలు రాసింది. అది తలుచుకున్నప్పుడల్లా మోహన్‌ పారవశ్య మోహనుడవుతాడు.