అందమైన ఆడది కోకిల కంఠంతో ఏడుస్తున్నా అందంగా వినసొంపుగానే వుంటుంది రాగాలాపనలా. కానీ ఓ మొగాడు గార్దభస్వరంతో భళ్ళున అద్దం పగిలినట్టు ఏడుస్తుంటే ఆ దృశ్యాన్ని చూడ్డమూ,భరించడమూ ఇబ్బందే. కానీ ఆ ఇబ్బంది నాకే వచ్చిపడింది. సాయంకాలం పబ్లిక్‌ పార్క్‌లో ఓ మూల సిమెంట్‌ బెంచీపై కూర్చుని నా భుజంపై ఒరిగి నా బాల్యమిత్రుడు యాభైతొమ్మిదేళ్ళ దాసు నీళ్ళకుండ బద్దలైనట్టు ఏడుస్తూండటంనాకూ చుట్టుపక్కలవాళ్ళకీ ఎబ్బెట్టుగా యిబ్బందిగానే వుంది.పార్కులకి వచ్చేది ఆహ్లాదంగా గడపటానికి కదా. వూరుకోరా అని నేను సముదాయిస్తున్నకొద్దీ వాడి దుఃఖం సుడులు తిరిగే సుడిగాలిలా తీవ్రమౌతోంది. పబ్లిగ్గా ఎంత గట్టిగా అయినా నవ్వొచ్చు. కానీ ఏడ్చుకునేందుకు మాత్రం మరుగుకావాలి. కాలకృత్యాలు తీర్చుకోవడానికి మరుగు కావల్సివచ్చినట్టు. ఏడుపూ ఓ భావోద్రేకపు విసర్జనేగా!మిమిక్రీ ఆర్టిస్ట్‌లా ఎపుడూ అందర్నీ నవ్వించే దాసు ఏడవటాన్ని నేను చూడటం యిదే. చిన్నప్పుడు ఆత్మీయంగా కలిసేవున్నా, ఉద్యోగరీత్యా దూరతీరాలకు కొట్టుకుపోయి చాలా అరుదుగా మాత్రమే వాడి విశేషాలు తెలిసేవి. ఏడాదిక్రితమే ఇద్దరం రిటైరయ్యాం. ఇటీవలే వాడి భార్య పోయిందని తెలిసాకా ఇదే కలవడం. నవ్వుతూ తుళ్ళుతూ హుషారుకి మారుపేరుగా వుండే దాసుకీ-ఇపుడు దుఃఖానికి ప్రతిరూపంగా వున్న దాసుకీ పోలికేలేదు. దుఃఖపు పొంగు కొంచెం చల్లారాక ఏడుస్తూనే చెపుతున్నాడు.‘‘నా జీవితం చివరికిలా అవుతుందని కలలో కూడా అనుకోలేదురా. నాలుగు జీతం రాళ్ళు చేతికందుతూ ఆరోగ్యంగా వున్నంతకాలం నాకెదురులేదు హీరోని అనుకునేవాడ్ని. కుటుంబ బరువు బాధ్యతలన్నీ ఆవిడమీదే ఒదిలి స్వేచ్ఛగా నా జల్సా బతుకు నేబతికేవాణ్ణి. పొదుపు అవసరం గురించీ, ఆరోగ్య సూత్రాల గురించీ తను చిలక్కి చెప్పినట్టు ఎన్నివందలసార్లు చెప్పినా ఏనాడైనా విని చచ్చానా. మొగాణ్ణి నాకు ఆడది సలహాలు చెప్పడవేమిటనే అహంకారంతో ఈసడించి పారేసే వాణ్ణి. కొంప పట్టకుండా బయట తిరిగే నాలాటి మొగాడికి తప్ప ఇంట్లో పడుండే ఆడ దానికేం తెలుసు లోకం గురించీ, జీవితం గురించీ అనే పొగరూ, అజ్ఞానంతో ఆమెను నాతో సమానమైన మనిషిగా ఏనాడూ గుర్తించి గౌరవించలేదు. ఆడది వెయ్యి జన్మలెత్తినా ఓ మొగజన్మతో సమానం కాదనే అహం నాది.

 నా జీవితం నేను శాసించినట్టే మహారాజులా గడిచిపోతుందని విర్రవీగానే తప్ప జీవితం నాకేం రాసిపెట్టివుందో గ్రహించలేకపోయాను.నాకు గుణపాఠం చెప్పడానికేమో అన్నట్టు హఠాత్తుగా ఆవిడ యింక నీ చావు నువ్వు చావు అన్నట్టు నన్ను ఒంటరిని చేసి నిష్క్రమించేసరికి నా బతుకు రాచభవనంలోంచి ఒక్కసారిగా పూరిగుడిసెలోకి లాగిపారేసినట్టయింది. నన్ను పట్టించుకునేవాళ్ళు లేక బీపీ, సుగర్‌, కీళ్ళ నొప్పులూ చుట్టుముట్టి అనారోగ్యంపాలై, ఉన్నావా తిన్నావా అని పలకరించేవాళ్ళు లేక, ఆప్యాయంగా అన్నంపెట్టే చేతులు కరువై జీవితం ఒక్కసారిగా చిమ్మచీకటై బతుకు దుర్భరమూ నరకమూ ఐపోయింది! చేతులు కాలాక ఆకులుపట్టుకున్నట్టు ఇప్పుడర్ధమవుతోంది. భార్యమాట విని చెడినవాడూ, వినక బాగుపడినవాడూ లోకంలో వుండడని. ఎంత మూర్ఖుణ్ణిరా! ఆమె ఉన్నంతకాలం నా బతుకు వెన్నెల్లో ఆటలా నడిచింది. ఆమె తప్పుకోగానే నా బతుకంతా అమావాస్యే అయిపోయింది. మొగాడి వెనుక పెట్టనికోటలా ఆడది నిలబడినంతకాలమే అతగాడి ఆటలు చెల్లుతాయనీ, ఆడది వెనుకదన్నుగా లేని మొగాడి జీవితం కుక్కలు చింపిన విస్తరిలా తయారవుతుందనే జీవిత సత్యం పోగాలం దాపురిస్తేగానీ నాకు అవగాహన కాలేదు. మొగాడికి భార్యను మించిన ఆత్మీయమైన వ్యక్తి ఎవరూ వుండరనే సత్యాన్ని గ్రహించలేకపోయాను. నా పురుషాహంకారాన్నీ, అజ్ఞానాన్నీ, మూర్ఖత్వాన్నీ దుర్మార్గుల్ని మోసే భూదేవిలా ఆమె ఎంత సహనంతో భరించిందో ఇపుడాలోచిస్తే సిగ్గుతో నా బుర్ర పాతాళంలోకి కుంగిపోతోంది. ఈ జ్ఞానం ఆమె వున్నప్పుడే నాలో కలిగివుంటే ఎంతబావుండేది! కాలమే వెనక్కి తిరిగి ఆవిడ ఒక్కక్షణం బతికివస్తే నా కన్నీటితో ఆవిడ పాదాలు కడిగి క్షమించమని ప్రార్థించనా. కాలానికి ఎంత నిర్దయ!’’ నన్ను పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. జాతరలో తల్లి చేయి జారవిడిచి తప్పిపోయిన పిల్లాడిలా ఏడుస్తున్నాడు.