వేసవికాలం. సమయం పది. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.ఆనందరావు ‘కాలు కాలిన పిల్లి’లా ఇంట్లోకి, బయటికి తిరుగుతున్నాడు.‘‘అలా తిరిగే బదులు ఇలా వచ్చి ఈ దొండకాయలు తరగొచ్చుకదండీ...!’’ అని వంటింట్లోంచి భార్య రత్నమాల కేక వేసింది.‘‘అబ్బా! ఉండవే.. నా టెన్షన్‌లో నేనుంటే మధ్యలో నీ నస ఒకటి...’’ అని విసుక్కున్నాడు ఆనందరావు.ఆనందరావు ఊరు చివర కొత్తగా కట్టిన ఇంట్లోకి అద్దెకి దిగాడు. ఆ ఇంటికి ఎదురుగా నున్న ఖాళీ స్థలంలో కొంతమంది కుర్రాళ్ళు క్రికెట్‌ ఆడుతున్నారు.

రత్నమాల ఎంత వ ద్దన్నా వినకుండా ఆనందరావు నిలువుటద్దంకి ఆర్డరిచ్చాడు. ఆ షాపువాడు ఆ రోజు ఇంటికి పంపిస్తానన్నాడు. అందుకు ఆనందరావు ఆతృతగా తిరుగుతున్నాడు.ఆనందరావుకి 43 సంవత్సరాలు. హిందీ మాష్టారుగా ఓ హైస్కూల్‌లో చేస్తున్నాడు.ఆనందరావుకి తన పర్సనాలిటీ మీద చాలా కాన్ఫిడెన్స్‌, కాస్త పొడవు, పొడవుకు తగ్గ ఒళ్ళుతో చూడ్డానికి బాగుంటాడు.ఆనందరావు తన పర్సనాలిటీని చూసుకొని ఉద్యోగానికి ఎగనామం పెట్టి సినిమా వోళ చుట్టూ కొన్నాళ్ళు, ఆ తర్వాత టి.వి. వాళ్ళ చుట్టూ తిరిగాడు వేషాల కోసం... అయినా ఫలితం కనిపించలేదు. చేతిలో డబ్బులు అయిపోయాయి. 

అప్పులు మిగిలాయి.చెప్పా చేయకుండా ఉద్యోగానికి ఎగనామం పెట్టి తిరుగుతున్న ఆనందరావుకి ఉద్యోగం ఊడిపోయే ప్రమాదం ఏర్పడింది. అంతేకాదు ఆనందరావు భార్య అయిన రత్నమాల కూడా ఇతగాడి పనులకి చిరాకు కలిగి అటు ఉద్యోగాన్ని ఇటు భార్యను వదిలి దేశదిమ్మరిలా తిరుగుతున్న ఆనందరావుని వదిలి పుట్టింటికి వెళ్ళిపోయింది.రత్నమాల ఇచ్చే ‘షాక్‌’కి కరెంట్‌ షాక్‌ తగిలిన ‘కాకి’లా గిలగిల లాడి, బుద్ధి తెచ్చుకొని అటు ఉద్యోగం, ఇటు సంసారం చక్కగా చేసుకోసాగాడు.చిన్నప్పటినుంచీ ఆనందరావు చదువుకి డుమ్మా కొట్టి అల్లరి చిల్లరిగా తిరిగేవాడు. తత్ఫలితంగా చదువులో వెనుకబడేవాడు.ఆనందరావు తండ్రి నారాయణరావుకి హిందీ మాష్టారుగా మంచి పేరుంది. ఆయన ఇంటి దగ్గర పిల్లలకి ట్యూషన్సు చెప్పేవాడు. ఆ పిల్లలతో పాటు ఆనందరావుని కూడా కూర్చోబెట్టి చెప్పేవాడు.

ఆ రకంగా ఆనందరావుకి హిందీ చదవడం, రాయడం వచ్చింది.నారాయణరావు స్కూల్లో పాఠాలు చెప్పుతుండగా గుండెపోటు వచ్చి చనిపోయాడు. తర్వాత స్కూలు వాళ్ళు ఆనందరావుని హిందీ మాష్టార్‌గా తాత్కాలికంగా నియమించారు.తర్వాత... తర్వాత ఆనందరావు అవసరమైన హిందీ పరీక్షలు రాసి, ట్రైనింగ్‌కి వెళ్ళి అదే స్కూల్లో హిందీ మాస్టారుగా సెటిల్‌ అయిపోయాడు.నిజానికి ఆనందరావు ఆర్థిక పరిస్థితి అంతంతే. అయినా తన పర్సనాలిటీ మీద ఒవర్‌ కాన్ఫిడెన్స్‌తో ఏ డబ్బున్న అమ్మాయినైనా ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనే తపనతో నలుగురైదుగురు అమ్మాయిలకు సైట్‌కొట్టి, బీటు వేసి భంగపాటు చెందాడు.