నేనిప్పుడు గౌరుమెంటు నౌకరిని. మాది ఇప్పటికీ బడి లేని, బస్సు లేని బ్యాక్‌వర్డ్‌ పల్లె. నాకున్న పెద్దకులాల దోస్తుల తల్లిదండ్రుల్లాగ మా తల్లిదండ్రులు బూసాములు, రైతులు కాదు. తమ పిల్లల్ని సిటీలల్ల బెట్టి సదివిచ్చే సక్కదనాలున్నోల్లు కానేగాదు. కూలినాలి జేసుకునేటోల్లు, ఏడేడు తరాలు ఎట్టి జేసుకుని బతికినోల్లు. సదువంటె ఏందో తెలువనోల్లు. ఎవరో తెల్సినోల్లు సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టల్లేస్తె... సదువు రుసి మరిగి ఆగకుంట యూనివర్సిటీ దాకాబోయి నౌకరి పరీక్షలు రాసి రాసి నౌకరి గొట్టిన.అయితే నాకు కతలు, నవలలు, కైతలు సదువుడు చానిష్టం. చిన్నప్పుడు డక్కలి కతలు, సిందు కతలు, కాకి పడుగులోల్ల కతలు, గొల్ల కతలినుడు మస్తు యిష్టంగుండె. వాల్లుజెప్పే ఎల్లమ్మ కతలు, మల్లన్న కతలు, జాంబపురాణం, ‘అల్లిరాని’ కతలు చూసి, యిని, మల్లా మా దోస్తుల ముందు అట్లనే ఆడి పాడి మురుసుకునేది.

 అట్లా కతలు వినుడు పెద్దగైనంక కష్టమైంది. కతలు విననీకి పోనియ్యక పోదురు మా అన్నలు. అందుకని పుస్తకాలల్ల ఉండే కతలు, నవలలు, డిటెక్టివ్‌ నవలలు ఏం దొరికితె అది నవిలేసేది. అంతిష్టముండె సదువుడంటె. అట్లా రష్యన్‌ అనువాదాలు, చైనా అనువాదాలు, ఉద్యమ సాహిత్యాలు, జాతీయోద్యమం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట సాహిత్యం, కమ్యూనిస్టు సాహిత్యం, పురాణ సాహిత్యాలు ఇట్లా ఏది ఇడవకుంట సదివేది. అయితే ఈ సాహిత్యాలల్ల మా అవ్వలు, అక్కలు, తాతవ్వలు, మా ఆడోల్లు, మా వాడ పర్యావరణాలు ఎక్కడ కనబడకపోయేది.

మా వాల్లు ఏం దిన్నరు, ఎట్లా బతికిండ్రు? వాల్ల కట్టేంది? బొట్టేంది?, వాల్ల పరిసరాలు ఎట్లుండె, వాల్ల వైద్యాలేంటియి, వాల్ల సంఘర్షణలు, వాల్ల ఆట, పాట, మాటలకు సంబంధించినయి ఏ సాహిత్యాలు రికార్డు చెయ్యలే... ఈ సాహిత్యాలు మాయిగాని జీవితాలు, యవ్వారాలు. ఎక్కడా మా ముత్తవ్వల, తాతవ్వల ఆనవాల్లు దొర్కలే... సదివి సదివి యాష్టకచ్చి వాల్లు వీల్లేంది మేమే రాస్కుంటము మా చరిత్రలను అని నేను రాసుడు మొదలువెట్టిన.