నేను‘‘కర్నూలు వరద బాధితుల కోసం మీ ‘కొల్లీగ్స్‌’ కొందరు విరాళాలిస్తున్నారు. మీరు కూడా ఎంతోకొంత ఇవ్వొచ్చు కదా?’’ఆ ప్రశ్నకు నా సమాధానం ఎలా ఉంటుందో తెల్సికూడా అడిగింది సంయుక్త. పది రోజుల క్రితం, షూటింగ్‌ కోసం స్విట్జర్లాండ్‌ వెళ్ళినప్పుడు కొన్న ఖరీదైన గాగుల్స్‌ ముఖం మీద సరిగ్గా అమరేలా పెట్టుకుని సంయుక్త వైపు తిరిగి ‘‘నీకు తెలుసు, నాకిలాంటి ‘షో’ - వ్యవహారాలు నచ్చవని. అయినా ఎవరో ఒకరిద్దరు హీరోలు రిలీఫ్‌ఫండ్‌కి చెక్కు లిచ్చారని నేనూ ఇవ్వాలని రూలేం లేదు’’ అన్నాను. సంయుక్త ఏమీ మాట్లాడలేదు. కొన్నిక్షణాల మౌనం. తర్వాత నేనే మళ్ళీ అన్నాను. ‘‘..ఈ విరాళాలన్నీ నిజంగా బాధితులకి చేరతాయంటే నేను నమ్మను. నాయకులూ, అధికార్లు, మధ్యవర్తులూ... వీళ్ళే మింగేస్తారు’’. నా ‘ఇవ్వక పోడాన్ని’ సమర్థించుకునేందుకే అలా మాట్లాడేనని ఆమెకు తెలుసు. అప్పుడు కూడా సంయుక్త ఏమీ మాట్లాడలేదు. ‘‘ఇవేళ షూటింగ్‌ రామోజీఫిల్మ్‌సిటీలో. వెళ్తున్నాను. బై’’ చెప్పి, పోర్టికోలో నా కోసం ఎదురుచూస్తున్న బెంజ్‌లో కూర్చున్నాను. డోర్‌ మూసుకోగానే డ్రైవర్‌ కారుని ముందుకు పోనిచ్చాను.కష్టపడి స్వశక్తితో సంపాదించిన దేదీ, ఉచితంగా ఆయాచితంగా ఎవ్వరికీ ఇవ్వకూడదన్న నా ధోరణి చూసి నన్నోపెద్ద ‘మెటీరియలిస్ట్‌’గా అనుకుంటుంది నా భార్య సంయుక్త. నాకు పూర్తిగా భిన్నమైన మనస్తత్వం ఆమెది. తెలుగు చలనచిత్ర రంగంలో నేనొక ‘స్టార్‌’గా వెలుగొందుతున్నా, ఈ గ్లామర్‌ ప్రపంచం అంటే ఆసక్తి లేదామెకు. ఆమెది పూర్తిగా వేరే ప్రపంచం. నగర శివార్లలో నాచారం దగ్గర, ఏడెకరాల స్థలంలో దాదాపు ఐదువందల రకాల మొక్కల్ని పెంచి, పచ్చని ప్రపంచాన్ని సృష్టించిందామె. నర్సరీల్లోవే కాక, ఆయుర్వేదం, అరోమా, హైబ్రిడ్‌ బోన్సాయ్‌, ఆర్కిడ్స్‌ లాంటివి ఎన్నో పెరుగుతున్నాయక్కడ. మొక్కల సేకరణా, పెంపకం, అభివృద్ధి పరచడం కాక, రంగురంగుల పక్షులూ, చెంగుచెంగున ఎగిరే కుందేళ్ళ సంరక్షణా చేపట్టింది. స్కూలు విద్యార్థులకు ఉచితంగా మొక్కల్ని పంచుతూ, కాంక్రీట్‌ జనారణ్యంగా మారిపోతున్న నగరానికి వనాభివృద్ధి గురించిన అవగాహన కలిగిస్తుంది.

ఈ విషయంలో నేనస్సలు జోక్యం చేసుకోను. ఆమె అభిరుచికీ అడ్డూ పడను. ఎందుకంటే, ఆ ఏడెకరాల భూమి సేకరణకు అయిన ఖర్చు, వ్యాపారవేత్త అయిన ఆమె తండ్రే భరించాడు! ఆమె అభిరుచి పద్దుక్రింద నేను ఒక్క రూపాయి కూడా ఆమెకు ఎప్పుడూ ఇవ్వలేదు!! అదీ అసలు కారణం.మా ఇద్దరి మధ్యా ఒక్క విషయంలోనే అభిప్రాయభేదాలు వస్తూ ఉంటాయి. అది డబ్బు విషయమే.చలనచిత్ర రంగంలో అందరికన్నా నేనే ఎక్కువ సంపాదించాలి. ఏ హీరో దగ్గరా లేనంత డబ్బు నా దగ్గరుండాలి. సంపద విషయంలో నేను శిఖరాగ్రాన ఉండాలి. నా ప్రతి ఆలోచనా, ప్రతి అడుగూ ఆ దిశలోనే! సంయుక్తకేమే ‘మనకు ఇంత ఉంది కదా, లేనివాడికి కాస్త సాయపడదాం’ అనే తత్వం. నాది ‘అందుకోవా’లనే ఆరాటం, ఆమెకు ‘పంచాల’నే తపన. నా ఈ డబ్బు - ఆరాటం అసమంజసమేమీ కాదనటానికి నా వాదన నాకుంది. అదేంటంటే - వెండిచెంచా నోట్లో పెట్టుకుని పుట్టిన వాడినేం కాదు నేను. గుడివాడ దగ్గరి ఓ మారుమూల పల్లెలో చాలా నిరుపేద కుటుంబంలో పుట్టి, సినిమా వ్యామోహంతో నగరానికి వచ్చాను. తిండి లేక కుళాయినీళ్ళతో కడుపు నింపుకున్న ఎన్నో నిద్రలేని రాత్రులు. గది అద్దె చెల్లించే డబ్బు, లేక ఎన్నోసార్లు రక్తం అమ్ముకున్నాను. ఎన్నో తిరస్కారాలు. మరెన్నో అవమానాలు. అన్నీ భరించాను. క్రమంగా, అసిస్టెంట్‌ డైరెక్టర్‌నై, జూనియర్‌ ఆర్టిస్టునై, విలన్‌ఐ, ఆఖరికి హీరో స్థాయికి చేరుకున్నాను. ఈ ఎదుగుదల క్రమంలో, డబ్బు విలువ బాగా తెలిసొచ్చింది. అందుకే నాలో ఓ కసి. ఏ డబ్బులేక విలవిలలాడి పోయానో, దాన్ని నా సొంతం చేసుకోవాలి. ఎవ్వరూ ఊహించని ఎత్తుకి ఎదిగిపోవాలన్న ఆరాటం!! నాలుగున్నర మిలియన్‌ల విలువైన ఇల్లూ, హీటెడ్‌ స్విమ్మింగ్‌పూల్‌, మేపుల్‌ వుడ్‌ ఫ్లోరింగ్‌ గదులూ, బూర్జ్‌దుబాయ్‌ నూట ఇరవయ్యవ అంతస్తులో రెండు ఫ్లాట్లూ, మెర్సిడెస్‌ బెంజ్‌, న్యూల్యాంబర్‌కీ 6496 సి.సి. కార్‌... అన్నీ పొందాను!! అయినా తృప్తి లేదు. ఇంకా పొందాలన్న తపనే! సంయుక్తలో దానగుణం ఎక్కువ. తెలివైనవాడ్నీ, ప్రాక్టికల్‌ థింకింగ్‌ ఉన్నవాడ్నీ గనుక, ఆమె దానగుణం నాకు మూర్ఖత్వంలా తోస్తుంది!!